top of page

తెలుగు గజల్స్ 

 

తెలుగు గజల్ .... (1)

 

గుండె చీల్చు హరిత ఖడ్గ సందడెంత బాగుంటుంది

ధరణి మాత కంట మెరిసె మురిపమెంత బాగుంటుంది

 

పైరుపాపల్తో ఊసులాడే గాలిపాడే జోలకు

తలలూపే ముద్దుపూల నాట్యమెంత బాగుంటుంది

 

గ్రీష్మంలో బీటలుపడి తల్లడిల్లె భూదేవిని

ముద్దాడుతు కురుస్తున్న తొలకరెంత బాగుంటుంది

 

తమ ఉనికిని జగతి మరిచిపోయిందని వాపోయే

గరిక నత్తుకునే స్వాతి చినుకెంత బాగుంటుంది

 

ఉదయించే భానుబింభాన్ని నుదుటి తిలకంగా దిద్దుకున్న 

తూరుపు ముత్తైదువ నిండు సౌభాగ్యమెంత బాగుంటుంది    

 

నెలరాజు రాకతో పొంగిపూసే కన్నెకుముదం 

వలపు వన్నెల సోయగమెంత బాగుంటుంది

 

పడమటి కనుమల కొంటెగా తొంగిచూసే 

వెన్నెలరేడుని తుంటరి తనమెంత బాగుంది 

 

గుడ్డును పొడుచుకొస్తూ ముడుచుకుంటున్న పసిగువ్వకు    

తల్లిపక్షి  రెక్కల్లోని వెచ్చందనమెంత బాగుంటుంది,

 

నీలిమబ్బు నీడజాడకి నర్తించే మయూరికి 

వానజాన చినుకందెల సవ్వడెంత బాగుంటుంది,

 

మావితోపులపై రవళించే చిరుగాలి పదనిసలతో  

శృతికలిపే సంధ్యారాగపు సన్నాయెంత బాగుంటుంది,

 

చిట్టి కూనలమ్మ తొలిపలుకుల పాట కచెరీకై

కాకమ్మింట ఓనమాలు  దిద్దేవైనమెంత బాగుంటుంది 

 

తరువుల సిగల్లో రంగుల విరులనద్దేస్తూ 

ఋతురాజాడే వసంతకేళీ వినోదమెంత బాగుంటుంది,

 

మధుమాసపు వేళలో "సిరి" విరినగవులతో 

గుభాలించే మరుమల్లెల పరిమళమెంత బాగుంటుంది ......@సిరి

 

ll  సిరి వడ్డే  ll   12-07-2014

 

 

 

 

తెలుగు గజల్ .....(2)

 

సుమలతలను ఆర్తిగా పెనవేసుకుంటూ 

కుసుమకాంతల సిగ్గులసౌరభం అతిశయమే

 

గిరితనువుపై అలవోకగా జారిపోతూ 

చినుకుపూల పులకింతలు అతిశయమే

 

ఆమని అందాలకు పులకరిస్తూ 

కూనలమ్మ స్వరాభిషేకం అతిశయమే 

 

తుషారపు ముత్యాలను జార్చుతూ

చిగురుటాకుల సుకుమారం అతిశయమే

 

తెలిమంచు తెరలమాటున దోబూచులాడుతూ 

హిమగిరుల సోయగం అతిశయమే 

 

పూలఎదలలో పులకింతలను లేపుతూ 

తుంటరితుమ్మెదల ఝుంకారనాదం అతిశయమే

 

నీలాంబరి నడుము వంపుల్లో వదిగిపోతూ 

హరివింటి వర్ణాల వడ్డాణం అతిశయమే 

 

తారలమ్మ పొదరింట మజిలీలతో 

నెలరేడుని వెన్నెలగానం అతిశయమే 

 

నీలి ముంగురులతో నాట్యమాడే 

మలయమారుతాల చిలిపితనం అతిశయమే

 

రంగురంగుల కోకలు చుట్టుకున్న 

సీతాకోకచిలుకమ్మ సింగారం  అతిశయమే

 

ఉలి గిలిగింతలకు పులకరింతలతో 

శిల్పంగామారే శిలలసౌందర్యం  అతిశయమే

 

"సిరి"మల్లెల జల్లులతో పరవశిస్తూ 

వసంతకన్యక నర్తనం అతిశయమే.....@సిరి 

 

ll  సిరి వడ్డే ll   17-07-2014

 

 

 

తెలుగు గజల్ ...... (3)

 

చైత్రవసంతం మురిసిపోతూ  పలుకుతోంది ఆహ్వానం

కొత్తపూల నెత్తావులాగమానికి  పలుకుతోంది ఆహ్వానం

 

కుసుమరాగాలను అద్దుకుంటూ పరవశించే చైత్రసఖునికి

మురిసిపోతూ వసంతసఖి పలుకుతోంది ఆహ్వానం 

 

విరి వధువులను చేపట్టేందుకు బారులుతీరే బ్రమర వరులకు 

ఆధరసుధలతో సుమ వధువుల మనోవేదిక  పలుకుతోంది  ఆహ్వానం

 

ఆరుఋతువులేకమైన వసంతంతో సౌగంధికా రాగమాలపిస్తూ వనరాణి, 

వసంతకేళీలో మైమరచిన మదనునుకి  పలుకుతోంది  ఆహ్వానం

 

మేఘమాలికల కంటిముత్యాలను ముద్దాడుతూ, ఓ చిలిపి కిరణం 

నీలాంబరి జన్మనిచ్చే సప్తవర్ణాల ముద్దుపాపడికి పలుకుతోంది ఆహ్వానం 

 

తరువుల నడుమొంపులను మీటేస్తూ అల్లరి పవనం, 

కుసుమకాంతల చిలిపి నర్తనాలకు పలుకుతోంది ఆహ్వానం

 

చినుకు ముత్యాలతో అభిషేకించే అందాల స్వాతిజల్లుకు 

హృదయాంజలిని అర్పిస్తూ పేదగరిక పలుకుతోంది ఆహ్వానం

 

వయ్యారి తారలతో సరాగమాడే వెన్నెలరేడుకు 

వెండివెలుగులనద్దుకొని వెన్నెలకన్యక పలుకుతోంది ఆహ్వానం

 

చెక్కిలిని చిదిమి సిగ్గులసింధూరాలను పూయించే సూరీడుకు

పులకల మొలకలతో సంధ్యాసుందరి పలుకుతోంది ఆహ్వానం

 

మత్తకోకిలల గానామృతాన్ని సేవిస్తూ మత్తిల్లే మధుమాసానికి 

పరిమళాల గుబాళింపులతో "సిరి"మల్లియ పలుకుతోంది ఆహ్వానం.......@సిరి

 

  ll సిరి వడ్డే ll    20-07-2014

 

 

 

తెలుగు గజల్... (4)

 

భరిస్తూనే ఉంటా మర్మపు నవ్వుల జరిమానాలెన్నో 

గాయపరిచిన హృదయాలకు సైతం, నగవుల నజరానాలతో

 

పూస్తూనే ఉంటా గాయాలపై అనునయాల లేపనాలెన్నో 

పదఖడ్గాలతో చీల్చబడ్డ మదికి సైతం, మమతల ఖజానాలతో

 

ఆలపిస్తూనే ఉంటా అనురాగాల ఆలాపనలెన్నో 

ఆలకించని ఎదలకు సైతం, అభిమానపు లాలనలతో

 

లిఖిస్తూనే ఉంటా మౌనాల మాటున లేఖలెన్నో 

వెలివేయబడ్డ హృదయానికి సైతం, అర్పించే విన్నపాలతో

 

శృతిచేస్తూనే ఉంటా వినతుల స్వరాలెన్నో 

విరిసిన "సిరి"మువ్వలకు సైతం వినిపించే సవ్వడులతో.... @ సిరి

 

ll  సిరి వడ్డే  ll   29/07/2014

 

 

 

తెలుగు గజల్ ...(5)

 

ఎదలోతును సుతిమెత్తగ తాకుతున్నాయి స్మృతులు

మదికిటికీ మెలమెల్లగ తెరుస్తున్నాయి స్మృతులు

 

మనోమురళిని మీటుతున్నాయి జతులు 

మదిరవళులను మ్రోగిస్తున్నాయి స్మృతులు 

 

తొలివలపు సంజలలో ప్రభవిస్తున్నాయి బింభాలు 

సిగ్గుల కెంజాయిలనే పులుముతున్నాయి స్మృతులు

 

తలపుల వసంతాలాటలో అలసిపోతున్నాయి ఆమనిలు 

మత్త కోకిలలై మురిపిస్తున్నాయి స్మృతులు

 

గ్రీష్మంలో హేమంతమౌతున్నాయి తుషారపు పవనాలు 

హిమకుసుమాలై తాకుతున్నాయి స్మృతులు

 

గజళ్ళ స్వాతిజల్లులలో తడిసిముద్దైపోతున్నాయి పదాలు 

"సిరి" నగవులై మురిపిస్తున్నాయి స్మృతులు...@ సిరి

 

ll  సిరి వడ్డే ll   05/08/2014

 

 

 

తెలుగు గజల్ ...(6)

 

తామరాకు వేదికపై నీటి ముత్యమెంత అద్భుతం 

అలవోకగా నర్తించే లయవిన్యాసమెంత అద్భుతం 

 

ప్రకృతి బడిలో వసంతరాగమెంత అద్భుతం 

చైత్రపు వడిలో కోకిలగానమెంత అద్భుతం

 

తూరుపు కొండలపై బాలభానుడెంత అద్భుతం 

పడమటి కెంజాయలో సంధ్యసొగసెంత అద్భుతం  

 

హరివింటి మెరుపులో ప్రతి వర్ణమెంత అద్భుతం  

రవివర్మ కుంచెలో ప్రతి చిత్రమెంత అద్బుతం

 

నండూరివారింట ఎంకి పాటలెంత అద్భుతం 

గోపన్నగారినోట రామకీర్తనలెంత అద్భుతం

 

రాయంచల దీవిలో కులుకులెంత అద్భుతం 

రాచఠీవి నడకలో హొయలెంత అద్భుతం

 

అమ్మ పాడే జోలలో కమ్మదనమెంత అద్భుతం 

నిదురలోకిజారే పాపడి నయనమెంత అద్భుతం

 

గాలిపాట సన్నాయిలో అల్లరెంత అద్భుతం 

సెలయేటి "సిరి"మువ్వల రవళులెంత అద్భుతం.....@సిరి

 

ll  సిరి వడ్డే ll   18/08/2014

 

 

 

తెలుగు గజల్...(7)

 

బోసినవ్వుల లయలలో రవళులు మురిపెమే 

పసిపాదాల అడుగులో పదములు మురిపెమే 

 

జ్ఞాపకాలై మిగిలిపోతూ పసితనములో 

తరలి వెళ్లిపోయిన గడియలన్నీ మురిపెమే 

 

యవనసీమలో విహరిస్తూ పులకింతలతో  

హృదయపు పరవశాల సవ్వడులు మురిపెమే

 

కనుపాపల ప్రేమ పరిష్వంగములో మురిసి 

దోబూచులాడే చిలిపి స్వప్నం మురిపెమే 

 

ఎదవీణను మీటుతూ గిలిగింతలు పెడుతూ 

మదిజత కలిపే వలపుల తాళం మురిపెమే 

 

సిగ్గుతెరలలో "సిరి"వెన్నెల్లా ఒదిగిపోయే 

నవవధువు మోమున తన్మయత్వం మురిపెమే ....:@సిరి 

 

ll  సిరి వద్దే ll 20-09-2014

 

 

 

తెలుగు గజల్... (8)

 

సెలయేటి కన్యక నడకలన్నీ చిత్రమే 

అలల అందియల రవళులన్నీ చిత్రమే

 

అమావాస్య చీకట్లను చీల్చుకొస్తూ 

జాబిలమ్మ మెరుపు ఖడ్గాలన్నీ చిత్రమే

 

రెక్కలను తొడుగుతు ఎగిరే బుల్లి గువ్వల 

రెప రెప సంగీత ధ్వనులన్నీ చిత్రమే

 

అరుణుడు దిద్దిన సింధూరపు రంగులతో 

తూరుపు సంధ్యలలో సొగసులన్నీ చిత్రమే

 

మబ్బు కురుల తెరలను తొలగిస్తూ అల్లరిగా 

తొంగి చూసె శశివదనాలన్నీ చిత్రమే

 

స్వాతిసౌధపు అంచుల్లో మెరిసిపోతూ 

చినుకు ముత్యాల "సిరి"నగవులన్నీ చిత్రమే ......@సిరి

 

ll సిరి వద్దే ll 21-09-2014

 

 

 

 

 

© 2013 by Komal Vadday

bottom of page