top of page

23. ఎక్కడని వెదికేది?

 

నిను చూసిన తొలి క్షణమే, 

పొందెను నా మది పరవశం

 

నీ తలపులు అనుక్షణం నింపెను,

నా గుండెల్లో కలవరం

 

నీ చూపుల వలలో బంధించి, 

నీ మాటల బాణాలను సంధించి

 

నీ కొంటె ఊసులతో నా మదిని బంధించి, 

నీ వలపుల కిరణాలను నా పై ప్రసరించి

 

నీ కోసం నేనంటూ స్నేహ హస్తం అందించావు,

నా ఆలోచనలకునీవు దిక్సూచివై 

 

నా జీవతనౌకకు చుక్కానివై నిలిచి,

నిర్మలమైన ప్రేమను అందించి

 

కోటి జన్మల బంధం మనది,

అంటూ మురిపించావు

 

నాలో ఆశలు రేపి చెలిమికి శ్రీకారం చుట్టి,

వలపుల బాసలు చేసి

 

నేడు నా చూపులకి చిక్కకున్నావు,

నా ఊహకి అందకున్నావు

 

నీకోసం ఎక్కడని వెదికేది?

ఎన్ని లోకాలు చుట్టేది?

 

|| సిరి వడ్డే || 29-01-2013

11. ఎందుకో?

 

సుడి గాలికి ఎందుకో అంత వేగం, 

నాలో రేపిన విష వలయాన్ని నీకు వివరించాలనా ?

 

సముద్రునికి ఎందుకో అంత ఆరాటం,

నా కన్నుల్లో అలలై తాను

ఎగిసి పడిన వైనం నీకు తెలపాలనా ?

 

నిశబ్దానికి ఎందుకో అంత తొందర,

నిర్దయగా నా గుండెను చీల్చిన క్షణాలను, 

శబ్ద తరంగాలుగా శ్రుతి చేసి మీటాలనా?

 

హృదయానికెందుకో అంత స్పందన,

తాను రేపిన మాయని గాయాన్ని మాన్పించ గలననా ?

 

నిజానికి ఎందుకో అంత నిశ్శబ్దత,

అబద్దాన్ని సైతం అద్దం పట్ట గలననా ?

 

ఆశ కెందుకో అంత అత్యాశ,

నిరాశ తో కలసినను ఊగిసలాడిస్తున్నందుకా?

 

కన్నీటి కెందుకో అంత సంబరం,

ఉరుకుల పరుగులతో ఉప్పెనలా పొంగి నా కంట ప్రవహించి నందుకా?

 

|| సిరి వడ్డే || 30-01-2013

12. నా ప్రాణమా

 

కవి కలాన్నే మరచినా,

కోకిల స్వరాలనే విడిచినా, 

రవి ఉదయాన్నే మరచినా, 

హరివిల్లు రంగులే మార్చినా,

 

కాలం గమనాన్ని ఆపినా,

మది సవ్వడినే నిలిపినా, 

మేఘానికి పయనమే లేకున్నా,

 

కుసుమము పరిమళాలను వీడినా, 

గుండె శ్వాసనే విడిచినా,

సాగరానికి కెరటాలే లేకున్నా,

 

జాబిలి వెన్నెలమ్మ తోడు విడిచినా, 

మరణమే నను వలచి వచ్చినా,

ఒక గడియ ఆగమంటా,

నా మది నివేదన వినిపిస్తా,

 

ఎందుకో తెలుసా ?

 

నీ చెలిమి ఒక సుందర స్వప్నమే, 

నీ పరిచయం ఒక మధుర కావ్యమే,  

నీతో గడిపే ప్రతి గడియా ఆనందసాగరమే, 

 

మాటలలో చెప్పలేను,

భావాలలో చూపలేను,

గుప్పెడంత గుండెలో నిండిన, 

అనంతమైన ప్రేమ నీ కొరకేనని 

ఎలా తెలుపను? 

 

మది పదాలను మరచి ,

మౌన వ్రతాన్నే ఆశ్రయిస్తోంది ,

మన్నించవా ప్రియతమా,

 

నా నాయనాశ్రువులనే, 

ముత్యాలుగా మలచి, 

నీకే అర్పిస్తున్నా నా ప్రాణబంధమా.

 

|| సిరి వడ్డే || 21-10-13

24. తెలియనే లేదు

 

నీ తీయని స్వరం వినేవరకు తెలియనే లేదు 

కోయిలమ్మకు కూడా పోటీ ఉందని,

 

నీ హృదయస్పందలు ఆలకించే వరకు తెలియనే లేదు 

సప్తస్వరాలకు సరితూగే రాగాలు ఉన్నాయని,

 

నీ మృదుమధుర స్పర్శకు పులకించేవరకు తెలియనే లేదు 

విరిసే కుసుమాలకు మెత్తదనం ఇచ్చింది నీవేనని,

 

నీ చిరునవ్వులకు మైమరచేవరకు తెలియనే లేదు 

మల్లెలు అసూయపడే మౌక్తికసుమాలు నీవని,

 

నీ చూపులకత్తులు హృదిని భేదించే వరకు తెలియనే లేదు 

మన్మధశరాలకు మంగళ హారతులు పట్టాలని,

 

నా మది వెదురులో ఊపిరి నింపేవరకు తెలియనే లేదు 

మధురమైన మోహనరాగమాలపించగలదని,

 

నా మనస్సు ఎగిరే కపోతమై అంబరాన్ని చేరుతోందని తెలియనే లేదు 

నీ తలపుల తుషారపు జల్లుల్లో తడిచి ముద్దయ్యే వరకు,

 

నా హృదయాకాశాన తలపుల తారలెందుకో తెలియనే లేదు 

చుక్కల తళుకులు ఆ తారల దగ్గర వన్నెలు దొంగిలించేవరకు.

 

|| సిరి వడ్డే || 17-10-13

19. ఏవేవో

 

ఏవేవో  కోరికలు,

నీ ఊహల మలయమారుతాలు 

చిలిపిగా నా దరి చేరి  

చల్లగ నా చెంపలను తాకాలని.

 

ఏవేవో తలపులు,

నా మది సవ్వడులకు  

నీ శ్వాసల సిరిమువ్వల రవళులతో

శృతి కలపాలని. 

 

ఏవేవో వలపులు, 

నా మది తోటలో నీ జ్ఞాపకపు 

మల్లెలు విరిసి పరిమళించాలని

వాడని కుసుమాలై నిలిచిపోవాలని.

 

ఏవేవో అల్లికలు, 

మనో గగనంలో వెలిగే వెన్నెలరేడుని

వదలని వెన్నెల నేనవ్వాలని

తారగా మారి చెంతనే ఉండిపోవాలని.

 

ఏవేవో  ఊహలు,

కురిసే ప్రతి మంచు బిందువు 

నా నడుము వంపుల్లో చేరి 

నవరత్నాలై జారాలని

అలవోకగా  దోసిట పట్టి 

వాటితో నిన్ను అభిషిక్తం చేయాలని 

ముత్యాల తలంబ్రాలుగా పోయాలని.

 

|| సిరి వడ్డే || 16-10-13

7. నాప్రాణం నీవని

 

ఉషోదయాన మెరిసేటి మంచుబిందువులనడుగు

తెలవారే తూరుపులోని అరుణకిరణాన్నిఅడుగు,

 

కరి మబ్బులలోని చిరు చినుకులనడుగు

వర్షించే నీలి మేఘాలనడుగు,

 

చిరు గాలులలోని తలపులనడుగు

వికసించే పూబాలలనడుగు,

 

సంద్రంలో తొంగి చూసే ఆ నింగిని అడుగు

చుక్కలతో దోబూచులాడే నెలరేడును అడుగు,

 

పడి లేచే  కెరటాలను అడుగు 

గలగల పారే సెలయేటిని అడుగు,

 

కొమ్మలపై కిలకిలలాడే పక్షులనడుగు

ఝుంకారాల తీపి తుమ్మెదలనడుగు,

 

మధుమాసాల నవవసంతాల నడుగు

నీకై స్పందించే నా ఎదసవ్వడిని అడుగు,

 

నిదురకు నోచుకొని నా కంటిపాపలనడుగు

తేనెలు పంచే నా తీయనిచెలిమిని అడుగు,

 

నువ్వే నా సర్వస్వమని సాక్ష్యమిస్తాయో?

లేక 

నాప్రాణం నీవని బదులిస్తాయో?  

 

|| సిరి వడ్డే || 03-08-2013

6. హృదయ శకలం

 

అనుక్షణం నా తలపుల్లో నీవే ఉన్నా,

నా మనసు అనుక్షణం నిన్నే పిలుస్తూ ఉన్నా,

పెదవుల మాటున మౌనరాగాలనే ఆలపిస్తున్నా,

రెప్పల మాటున కన్నీటి ఉప్పెన దాచి పెట్టా.

 

కన్నీటి సాగరాన నే జలకమాడుతున్నా,

హృదయాగ్నితోనే జ్వలిస్తున్నా,

నీ మనోవనంలో నా జ్ఞాపకాలు మొగ్గలు తొడిగి,

ప్రేమసుమాలుగా వికసించే క్షణం కోసమే వేచి ఉన్నా.

 

కనులారా నిను చూడాలని,

నామనసులోని మాటల మూటలను విప్పాలని,

గడియైనా నిను కలవాలని,

నీ తీయని స్వరాన్ని మనసారా వినాలని,

ఎదురు చూపులు చూస్తూనే ఉన్నా.

 

నీ జ్ఞాపకాలతోనే కాలం కరిగిపోతున్నా,

ఈ క్షణమే నిను కలసినంత క్రొత్తగా ,

అనుక్షణం నిన్నే వెంటాడుతోంది నా హృదయం.

 

పగిలిన హృదయశకలాలను పేర్చుకుంటూ,

వాటినతికించే పిచ్చిప్రయత్నం చేస్తూ,

నీ కోసమే ఈ శ్వాసను నిలిపి ఉంచా.

 

నీవెక్కడున్నా,

నా హృదయ సామ్రాజ్యానికి యువరాజువే,

నా ఊహల్లో నిన్నెప్పుడూ ఆరాధిస్తూనే ఉంటా,

స్వప్నలోకాన నీతో విహరిస్తూనే ఉంటా,

నీతో ఉన్నాననే భ్రమలోనే,

కన్నీటి అలలపై తేలియాడుతూనే ఉంటా.

 

ప్రాణాలను ప్రాధేయపడుతూ ఉన్నావేచి ఉండమని,

నీ ఒడిలో శాశ్వతనిద్రను పొందాలని,

నా శ్వాసను విడిచి,

నీ ఊపిరిగా మిగలాలని,

నీకై వేచి ఉన్నా నా ప్రియబంధమా. 

 

|| సిరి వడ్డే || 18-10-13

5. అదేమిటో

 

అదేమిటో..

ఆ దినకరునికివళ్ళంతా తాపపు సెగలే ,

ఆ నెలరాజుకుముఖమంతా వలపుల మచ్చలే ,

ఆ వసంతునికితనువంతా విరుల తాకిడులే,

 

అదేమిటో...

ఆ ఇంద్రునికివళ్ళంతా నయనపు కత్తులే,

ఆ మదనునికివళ్ళంతా సుమశరాలే ,

ఆ గోపయ్యకుమది నిండా గోపెమ్మలే ,

 

అదేమిటో...

ఆ పిల్లగాలులకుఎపుడు చిలిపి ఈలలే ,

ఆ తుంటరి తుమ్మెదకిఎప్పుడూ తేనెల గోలలే,

ఆ వయ్యారి లతలకుసొగసైన అల్లికల అతిశయమే 

 

అదేమిటో...

ఆ గ్రీష్మానికెపుడూవేడిమి నిట్టూర్పులే ,

ఆ తొలకరికెపుడూచిరుజల్లుల సవ్వడులే ,

ఆ జాబిల్లికెప్పుడూతారలతో గగనాన విహారాలే,

 

అదేమిటో...

నా మది కెపుడూ నీ వలపుల తలపులే.

 

|| సిరి వడ్డే ||  22-06-2013

4. ఎందుకో నాకు నచ్చలేదు

 

తొలి పొద్దు పొడుపులో

నిను పలుకరించే నేస్తాలలో 

ఒకరినై మిగలడం ఎందుకో నచ్చలేదు,

బాలభానుని తొలి కిరణాన్నై నిను చేరాలని చిన్నిఆశ.

 

కోటి తారలతో చేరి నిశీధినీడలలో

వెలుగుని నింపడం ఎందుకో నచ్చలేదు,

అందాల జాబిలినై నీ గుండెల్లో వెన్నెల నింపాలని చిన్నిఆశ.

 

సమస్యల సంద్రంలో

ఎగిసిపడే అలల్లో 

ఒక అల నేనై మిగలడం ఎందుకో నచ్చలేదు ,

ప్రేమనావను నేనై వలపుల తీరానికి నిను చేర్చాలని చిన్నిఆశ.

 

వేవేల వర్ణాలలో

ఒక వర్ణము నేనై మిగలడం ఎందుకో నచ్చలేదు,

నీ మనోపటలంపై అందాలోలికించేరంగులచిత్రంగా నేనై నిలవాలని చిన్నిఆశ ,

 

నీ కంటికి విందులు చేసే వేల అందాలలో

 ఒకటిగా మిగలడం ఎందుకో నచ్చలేదు,

నీ మనో దర్పణంలో నీ ప్రతిబింబాన్నైఅందంగా నేనుండిపోవాలని చిన్నిఆశ ,

 

నిను ఉక్కిరిబిక్కిరి చేసే ఊహలలో

సతమతమవడం ఎందుకో నచ్చలేదు,

నీ ఊపిరిలో ఊపిరినై, నీ కన్నులలో మెదిలే ఊహనై నిలవాలని చిన్నిఆశ.

 

కరిమబ్బుల గుంపులతో

చేరి పయనమై పోవడం ఎందుకో నచ్చలేదు,

చల్లని గాలి తాకిడికి ముత్యపు చినుకునై నీపై కురవాలని చిన్నిఆశ.

 

నీ మౌనరాగాలతో

శ్రుతి కలిపే విషాదగీతమవడం ఎందుకో నచ్చలేదు,

నీ మదివీణను మీటేకమ్మనిరాగంగా మారాలని చిన్నిఆశ.

 

నీ కనురెప్పల మాటున

చిలిపి కోరికనైదోబూచులాడడం ఎందుకో నచ్చలేదు,

నీ కంటి వెలుగుల చిరుదివ్వెను నేనే కావాలని చిన్నిఆశ.

 

దహించే గ్రీష్మపు తాపాలను

 నీవు భరించడం ఎందుకో నచ్చలేదు,

శరద్రాత్రుల వెన్నెల నేనై నిను చేరుకోవాలని చిన్నిఆశ.

 

నిను ఓటమి చీకట్లు ముసరడం ఎందుకో నచ్చలేదు,

నీ విజయపు వెలుగుల కిరణమై నిను చేరాలని చిన్నిఆశ.

 

ఈ జన్మకు ఈ ఆనందం చాలని 

మనస్సును మభ్యపెట్టుకోవడం ఎందుకో నచ్చలేదు,

 కోటి జన్మలకైనా నీకోసమే మళ్ళీ మళ్ళీ జన్మించాలని చిన్నిఆశ.

 

|| సిరి వడ్డే || 14/06/2013

14. ఎందుకో ఏమో

 

ఎందుకో ఏమో ?

చిరుగాలుల సవ్వడిలో 

నీ పలుకులే వింటున్నా,

 

ఎందుకో ఏమో ?

నా హృదయ స్పందనలో 

నీ ఊసులే మోస్తున్నా ,

 

ఎందుకో ఏమో ?

నా కనురెప్పల మాటున 

నీ ఊహలే కంటున్నా ,

 

ఎందుకో ఏమో ?

నా పెదవుల మాటున 

నీ మౌనాలే దాస్తున్నా ,

 

ఎందుకో ఏమో ?

నా గుండెల మాటున 

నీ భావాలే నింపుకున్నా ,

 

ఎందుకో ఏమో ?

నా తలపుల మాటున 

నీ బాసలే దాచుకున్నా ,

 

ఎందుకో ఏమో ?

నా మేని మాటున 

నీ జ్ఞాపకాలే పదిల పరుచుకున్నా ,

 

ఎందుకో ఏమో ?

నాలో భావాలెన్ని ఉన్నా 

నీ కోసం పదాలు వెదకలేకపోతున్న ,

 

ఎందుకో ఏమో ?

పదాలు ఎన్ని ఉన్నా 

నీ కోసం కవితలల్లలేకున్నా

 

ఎందుకో ఏమో ?

ఈ జన్మకు నిను కలిసే 

భాగ్యం లేదని తెలిసినా ,

 

ఎందుకో ఏమో ?

మరు జన్మ లోనైనా 

నిను చేరాలని నా ఈ తపన

 

|| సిరి వడ్డే ||  22-05-2013

17. నను మరువకుమా

 

వికసించే కుసుమ మా ,

వాడి పోకుమా 

 

కురిసే చినుకమ్మా ,

ఆగి పోకుమా 

 

మెరిసే నీలి మేఘమా , 

చెదిరి పోకమ్మా 

 

వెలిగే దీపమా ,

ఆరి పోకుమా 

 

విరిసే వసంతమా ,

మోడు వారకుమా  

 

పచ్చని పైరమ్మా ,

బీడు వారకుమా 

 

పాడే కోయిలమ్మా ,

మూగ బోకుమా 

 

తీయని స్వప్నమా ,

కరిగి పోకుమా 

 

నర్తించే మయూరమా ,

నటనమాపకుమా 

 

స్పందించే హృదయమా ,

సవ్వడులను వీడకుమా 

 

ఆనంద బాష్పమా ,

జారి ( రాలి ) పోకుమా 

 

తీపి జ్ఞాపకమా ,

నను వీడి పోకుమా 

 

సప్తవర్ణాల చాపమా , 

వెలిసి పోకుమా 

 

సాగిపోయే సెలయేరమ్మా ,

వెనుదిరగకు మా 

 

పడమటి సంధ్యరాగామా ,

తరలి పోకుమా 

 

నా ప్రియ నేస్తమా ,

నను మరువకుమా

 

|| సిరి వడ్డే || 16-06-2013

18. విన్నపం

 

పాపికొండల నడుమ  

గోదారిలో తొంగి చూసే 

జాబిలమ్మను అర్దించా,

తన వెండి వెలుగులను 

నీ కన్నులలో నింపమని.

 

సవ్వడి చేస్తూ ముందుకు  సాగే 

సేలయేరమ్మను అడిగా ,

తన గల గల నాదాలను 

నీ నోట పలికించమని.

 

చిటారు కొమ్మన కులుకుతున్న 

కోయిలమ్మను వేడుకొన్నా,

తన తీయని స్వరాలను 

నీ హృదయ స్పందనలుగా మార్చేయమని.

 

భూమాత ఒడిలో మైమరచి ఆడుకునే 

ముద్దు పూబాలలకు విన్నవించా, 

నీ పెదవులపై చెదరని 

చిరునవ్వులై విరియమని.

 

పర్వత శిఖరాల నుండి జారే 

జలపాతాలను వరమడిగా, 

నీ మదిలో ఆనందపు ఝరియై 

జాలువారమని.

 

అందాల హరివిల్లుకు అర్జీ పెట్టా, 

నీ జీవనరాగంలో సప్తవర్ణాలను అద్దమని.

 

నీలి మేఘానికి నా చెలిమి కానుకను పంపించా, 

నీ నీలి నయనాలతో 

పోటీకి రావలదని.

 

నా మనసుకు మౌనం గా మనవి చేశా 

కోరికల విహంగమై తుళ్ళి పడవద్దని,

ఆశల మందిరాన 

నీ నేత్రాల చిరు దివ్వెల 

వెలుగుకై వేచి ఉండమని.

 

నీ రాకకై నే వేచి ఉన్నా 

నా ఊహల గుసగుసలను

నీకే వినిపించాలని 

నిన్ను చేరాలని నా మనసు పడే ఆరాటాన్ని 

స్వయంగా విన్నవించుకోవాలని..

 

|| సిరి వడ్డే || 2-05-2013

13. కనుపాపలలో ఒదిగిపో

 

ఉషోదయాన బాలభానుని 

తొలి కాంతి కిరణమై,

వేకువలో చిగురుటాకున

మెరిసే మంచు బాష్పమై , 

 

వెన్నెలతో వన్నెలు 

అద్దుకున్న నెలరాజువై ,

కనురెప్పల మాటున

దోబూచులాడే చిలిపి స్వప్నానివై ,

 

ముత్యపు చిప్పలో 

జాలువారే స్వాతి చినుకువై ,

హృదయ సంద్రాన కదిలే 

అల్లరి కెరటమై ,

 

చిరునవ్వుల సవ్వడిలో 

సిరిమువ్వల రవళివై ,

మల్లెలు కురిసే మనసున 

మధుమాసపు వసంతానివై ,

 

మది వీణ పలికే గానలహరిలో 

దాగే సుస్వరాల రాగానివై ,

నా హృదయ కుసుమపు మధువుకై వాలే 

పదహారు వన్నెల అల్లరి తుమ్మెదవై ,

 

ఉండిపో

మదిలో దాగిపో,

కనుపాపలలో ఒదిగిపో.

 

|| సిరి వడ్డే || 19-04-2013

3. మావా..మావా..

 

పూదోట పొదరింట ఒంటిగా నేనుంటే ,

నా నీడే నను బయపెడతా ఉంటది.

 

మామిడి తోపుల్లో పండ్లను తినబోతే,

నోరంతా సేదౌతూ ఏదోలా ఉంటది.

 

వంగతోటలో కాయలను తెంపుతుంటే,

గుచ్చుకుంటున్నాయి వంగ ముళ్ళు

 గుండెల్లో గుచ్చే నీ సూదంటురాయి సూపులల్లే.

 

జొన్నసేలకెల్లి కంకుల నేరబోవ,

సిత్తరంగ సూసి ఎక్కిరిస్తున్నట్లైతది

 

ఈసే గాలిలో నీ సైగలే సూసుకోనా ? 

నా ఊపిరిలో నిను దాసుకోనా ?

 

సీకట్లో ఎలుగై నా యెంట అడుగేయవా ?

కన్నుల్లో మెదిలే కలవై ,

ఎదలోకి జారిపోవా?

 

ఏసవి ఎండల్లో తొలకరి సినుకువై,

పున్నమి ఎన్నెల్లో ఎలిగే సందమావవై 

నా యెదలో ఉండి పో...

 

గువ్వలు గూటికి సేరె యేలకి, 

ఆకాశం సుక్కల తివాసీ పరిసే ఏలకి,

సందమామ దీపం ఎట్ట్టే ఏలకి,

జాబిలమ్మ జోల పాడే యేలకి, 

 

నీ ఎంకి కాడికోచ్చేయ్,

నెలవంకను తురిమి సిగలో ముడిసేయ్,

నాలోని కొత్త ఆసలకు తెర తీసేయ్.

 

|| సిరి వడ్డే || 31-03-2013

16. నా నీవు

 

భాష కందని మౌనరాగం నీవు, 

శిల్పికి అందని అపురూప సౌందర్యం నీవు,

విజయానికి చిరునామావి నీవు,

ధైర్యానికి మరో రూపం నీవు.

 

మాటలకందని భావం నీవు ,

నీకై కలలు కనే కళ్ళల్లో,

విరిసే వేయి పున్నముల వెలుగువి నీవు,

మనసు పడే మమతల మురిపెము నీవు.

 

పున్నమి రేయిలో వెలుగులు చిందించే వెన్నెల రాజువి నీవు ,

నా వలపుల హృదయం చేసే సవ్వడి నీవు ,

మమతానురాగాల మధురకావ్యం నీవు,

స్మరించిన కొలదీ పెరిగే అనుబంధం నీవు.

 

బాలభానుని నులివెచ్చని తొలికిరణం నీవు,

ఉషోదయాన చిగురుటాకున జారే మంచుముత్యానివి నీవు,

నా హృదయ రాగానికి శృతి కలిపే చిలిపి వేణువు నీవు,

నిరంతరం మదిలో కదలాడే ఊహవు నీవు.

 

నా హృదయాకాశంలో వెలిగే చందమామవు నీవు,

నా స్వప్నలోకాన కనిపించే నవ మన్మధుడవు నీవు,

నా కన్నులలో మెదిలే కళ్యాణమూర్తివి నీవు.

 

నా ప్రాణానికి ఊపిరి నీవు,

నా అస్తిత్వానికి కారణం నీవు,

నా జన్మ సార్ధకం చేసేందుకు దిగివచ్చిన దేవదూతవు నీవు.

 

|| సిరి వడ్డే || 27-03-2013

20. చెలికి కానుక

 

నీ నల్లని ఒత్తైన కురులలో 

విరిసేను ముద్దమందారాలు,

నీ చల్లని చూపులు తెలిమంచు పుష్పాలు

 

అందాల నాసిక పరిమళించే సంపెంగ,

జిలుగు చక్కెళ్ళ పై సిగ్గులు మెరిసే తారల తళుకులు

 

వంపులు తిరిగిన కను బొమ్మలు 

వేవేల వర్ణాల హరివిల్లులు, 

సిగ్గులతో వాలే కనురెప్పలు బోర్లించిన నెలవంకలు

 

నీలి వర్ణాల నయనాలు 

మెరిసే నల్లని కలువలు,

వంపులు తిరిగిన పెదవులు మన్మధ శరాలు

 

తేనే లొలుకు పలుకులే 

తీపి రాగాల కోయిల గానాలు,

నడకలలో అగుపించెను నర్తించే మయూరాలు 

 

అందెల రవళి లో ప్రతి ద్వనించెను

సప్తస్వరాల సరిగమలు,

బాల భానుని అరుణ కిరణాలే 

అర చేత సింధూరపు గోరింటలు

 

కొలను వెలిసిన తామర తూడులు 

సొంపైన కరములు,

నడుమున ఇమిడెను గంగా యమునలు

 

ముగ్ద మోహన నాచెలి పాదాలకు 

ముద్ద బంతుల పారాణులు,

నా హృదయ రాణికిఅర్పిస్తున్నా 

నా మానసవనంలో విరిసిన పారిజాతాలను.

 

|| సిరి వడ్డే || 15-03-2013

25. మావతో నే వేగలేకున్నానే

 

పండు వెన్నెలలో ఆడు కుందామంటే ,

వెన్నెలమ్మ తో పోటీ దేనికంటాడే ?

 

పసిడి జూకాలు నే నడగ బోతే ,

పసిడి బొమ్మకు మెరుగు లెందుకంటాడే?

 

వనవిహారం చేయించమంటే,

వన దేవత ముద్దు బిడ్డవు నీ వంటాడే?

 

సంగీత కచ్చేరికి పోదామంటే ,

గాన కోకిలవు నీకెందు కంటాడే?

 

ముత్యాల గాజులు నేనడగ బోతే ,

మువ్వన్నెల చీరతో సరి పెడతాడే?

 

నా చిరు నవ్వుల తళుకులు గని ,

మెరుపులమ్మకు మేన కోడలినని కవ్విస్తాడే?

 

నీళ్ళ రేవు కాడ నే తాన మాడబోతుంటే ,

జల కన్యవు నీవని మురిపిస్తాడే?

 

హృదయం ఉప్పొంగుతోందంటే,

గోదారమ్మకు నీ పరవళ్ళు ఎక్కడివి అని అరా తీస్తాడే?

 

తిరునాళ్ళకు నే పోత నంటే ,

కొంటె కుర్రాళ్ళు చిలిపిగా కను గీటు తారంటాడే?

 

పూబాలల కోసం , పూదోటకు నే రమ్మంటే ,

పసిడి మొగ్గవు నీవంటాడే?

 

మనస్సు పురి విప్పి ఆడుతోందంటే ,

మయూరం జోలికి పోవద్దు అంటాడే?

 

కాసులు పేరు తెమ్మంటే ,

కుందనపు బొమ్మవు నీవంటాడే ?

 

ముక్తి కోసం కోవెలకు పోదామంటే ,

నీ అందెల రవళికి , గుడి గంటలు చిన్నబోతాయంటాడే?

 

హంసల దీవికి పోదామంటే ,

నీ నడకలను చూసి , మూతి ముడుస్తాయి అంటాడే ?

 

గుండెల్లో నా కోసం గుడి కట్టానంటాడే?

తన కను సన్నలలో నను మెలగ మంటాడే?

 

తన ప్రేమ ఉప్పెనలో నేను ఈదలేకున్నానే,

అన్నిటికన్నీ సర్ది జెప్పే మావతో నే వేగలేకున్నానే.

 

|| సిరి వడ్డే || 5-03-2013

27. రహస్య నేస్తమా

 

నువు రహస్య స్నేహితుడివా?

నను మెచ్చిన హితుడివా?

పూర్వ జన్మ బంధానివా? 

నీవెవరు?  నేనెలా ఊహించను?

 

నీ తలపుతో 

నే హంస నడకల వయారినయ్యా,

మయూరినై ,మధుర కోకిలనై, 

నీకై ఆలపిస్తున్నా.

 

నీ మధురాలోచనలతో

పలుకులు నేర్చిన పూల రెమ్మనయ్యా

జాజి కొమ్మనో, ముద్దుగుమ్మనో 

నేను నేనుగా లేక పోయాను

ఓ నేస్తమా, నీ వింకా నాకు కానరానే లేదు.

 

అయినా, హోయలోలికే నాయగారాన్నయ్యా 

వంపు సొంపుల గంగోత్రి నయ్యా

జలపాతాలకే నే పరవళ్ళు నేర్పిస్తున్నా ఓయ్! కనిపించవా!

 

జాబిలమ్మ చల్లదనం నీవని 

వెన్నెలమ్మ తెల్లదనం నీదని 

మెరుపులమ్మ సోయగం నీ సొంతమని 

అనుకుంటున్నా,

 

అందాల హరివిల్లు,

చిన్నారి సీతాకోక చిలుక 

నీ మెరుపును దోచేసి , దాచేసాయని

నీ తుల్లింతల కేరింతలను బుజ్జాయి ,

తువ్వాయి వడిచి పట్టేసాయని

 

నీ నవ్వుల తెల్లదనాన్ని 

సిరి మల్లె దొంగిలించిందని

మురిపించావు నను మరిపిస్తున్నావు 

 

నీ ఆలోచనల జడి లో తడిపేస్తావు

నీ వెవ్వరని నిలదీస్తే,

నీ ప్రేమ దాసుడనంటావు 

ప్రేమగా లాలించి చిలిపిగా దాటేస్తావు.

 

తెలుపవా నేస్తం నీ చిరునామా ఎక్కడో?

జీవితపు చివరాంకంలోనైనా

నిను కనగలనా

నీ రూపం ఊహించగలనా?

ప్రియతమా.. 

 

|| సిరి వడ్డే || 1-03-2013

1. నీ కోసం నే జన్మిస్తా

 

సీతాకోక చిలుకనై 

చిలిపిగ ఎగురుతా, 

 

ఆమని కోయిలనై 

కమ్మని రాగం తీస్తా,

 

మయూరం నేనై

పురివిప్పి ఆడేస్తా,

 

విహంగం నేనై

స్వేచ్చగాగగనాన ఎగురుతా,

 

శ్రుతిచేసిన వీణనై 

స్వరాలను పలికిస్తా, 

 

సిరి మువ్వల సందడి తో

నర్తన మాడేస్తా,

 

వెదురును మురళిగ మలిచి

రాగాలాపన చేస్తా,

 

కవ్వింపుల బాణాలను 

సూటిగ గుండెకు తాకిస్తా,

 

తోలి పొద్దు పొడుపులో 

వెచ్చని కిరణం నేనౌతా ,

 

మబ్బుల చాటున

జాబిలిచల్లదనం నీకోసం తెస్తా,

 

తారలలో జాబిలినై ,

పున్నమి వెన్నెలనై వస్తా, 

 

మెరుపులమ్మకే

తళుకులు అరువిస్తా,

 

నా చితిలో నువ్వు తోడొస్తే

నీకై నే మళ్ళీ జన్మిస్తా, 

 

ఎన్ని జన్మలకై

నా తోడై నీడై నీవెంటే నే ఉంటా. 

 

|| సిరి వడ్డే || 22-02-2013

26. చెలీ విన్న వించవె 

 

ఈ వేళ ఎందుకో

నాలో ఏదో తెలియని గిలిగింత

ముందెన్నడూ ఎరుగని పులకింత,

మై మరపింత

 

తొలి పొద్దు వేళలో,

నే కురులార బోస్తుంటే 

గోరు వెచ్చని సూరీడు కొంటెగా కను గీటి

గుండెల్లో గుబులు రేపుతున్నాడు ఎందుకని?

 

మసక వెన్నెల్లో ,

నే పూల మాలలల్ల బోతుంటే

మబ్బు చాటున దాగిన జాబిలి

చిలిపిగా అల్లరి పెడుతున్నాడు ఎందుకని?

 

ఈదురు గాలులు సైతం 

ఈలలు వేసి గోలలు చేస్తుంటే 

పూబాలలు నను చూసి 

ముసి ముసి గ నవ్వు కుంటున్నాయి ఎందుకని?

 

వేలతారలను నయనాలుగచేసుకుని

నీలాకాశంతన వలపుల బాణాలను 

సూటిగా విసురుతున్నది ఎందుకని?

 

అడగవే నా చెలీ 

సంగతి ఏమిటని ?

చెప్పవే చెలీ

చిలిపిగా నన్నల్లరి పెట్టొద్దు అని.

 

తుంటరి తుమ్మెదలా వచ్చి 

నా హృదయపు కుసు మకరంధాన్ని 

చిలిపిగా దోచేయ్యోద్దని 

 

గడసరి కందిరీగ వై 

నా బుగ్గను కంది పోనివ్వొద్దని

నీ వైనా తెలుపవే చెలీ 

నన్నుక్కిరి బిక్కిరి చెయ్యొద్దని 

 

అడగవే చెలీ తగునా నీకిది యని

నీ చిన్నారి చిలకమ్మ పై 

చిలిపి అలక వద్దని 

'మేఘ మాల' తో కబురంపవే

నా ముద్దు 'గోరింకకు' వచ్చి వడిలో వాలమని

 

నీ తలపుల మునకలో

మది మునిగి తేలుతోందని 

హంస తో 'రాయబారం' పంపవే

 

నీ రాకతో తన హృదయ వీణ

ఆనంద రాగం మ్రోగిస్తుందని

నీ పిలుపు వింటే తనువుపులకిస్తుందని,

మయూరమైమనసు పురి విప్పి ఆడుతుందని,

 

వినిపించవె నా ప్రియునికి 

నా హృదయ తంత్రులు మీటే మౌన గానాన్ని 

విన్న వించవె చెలీ

ఇంత మౌనం తగదని

నా మదివీణను శృతి చేయమని. 

 

|| సిరి వడ్డే || 20-02-2013

28. నా తొలి ప్రేమ కానుక

 

" ప్రేమికుల రోజు " కోసం అందిస్తున్న నా ప్రత్యేక కవిత..

 

కలలో కనిపించి

కనురెప్పలపై మెల్లగా జారుతావు ,

మధుమాసపు వసంతాలలో 

మల్లెలు కురిపిస్తావు ,

 

పడమటి సంధ్యారాగంలో 

పిల్ల గాలిలా వీస్తావు ,

నా గుండెల్లో చేరి 

దోబూచులాడుతావు .

 

పున్నమి రేయిలో , 

నెలరాజు వదనంలో కనిపించేది నీమోమే,

నా హృదయస్పందనలలో, 

వినిపించేది నీనామమే .

 

నా కలలతీరంలో

అనుక్షణం అలవై,

నా మౌనంలో మెదిలే బాషకు రూపమై,

ఉషోదయాన తొలికిరణమై మెరుస్తావు .

 

నా పెదవుల పై

విరిసినవెన్నెల నవ్వుని ఆపేదెలా? 

నా గుండెల్లో నిలిచిననీ రూపాన్ని దాచేదెలా ?

 

నా యెదలో నిండిన

నీ తీయని తలపుని బుజ్జగించేదేలా?

నీ రాకకై వేచిచూసే

నాకనురెప్పల కలవరింతని జోకొట్టేది ఎలా?

 

భాషను నేనై , భావాలను పలికించనా ?

కలతను నేనై కన్నీరుగా కరిగిపోనా ?

భావము నేనై నీ గుండెల్లో ఒదిగి పోనా ?

జ్ఞాపకాన్ని నేనై నిలువెల్లా నిను అల్లుకుపోనా?

 

పంచ భూతాలను నిలదీసాను ,

సాగరం లోని ప్రతి బిందువును తడిమి చూసాను ,

పూలలోని మకరందాన్ని ఆరా తీశాను,

తళుకులొలికే తారల్ని అర్ధించాను ,

నీ జాడ తెలుపమని.

 

ఒక చల్లని ఉదయాన ,

వెలుగులమ్మకు తెల్లని మంచు,

జాజుల పరదాను పట్టే వేళ

మెరిసే ఆకులపై మంచు ముత్యాలై ,

వయ్యారంగా జాలువారే వేళ ,

 

మది నిండా మదురమైన

అనుభూతులను పరుచుకుని పరవశించే వేళ ,

నా అందమైన భావాలను 

అక్షరమాలలుగా అల్లి

నీకే అర్పిస్తున్నా నా 'తొలిప్రేమకానుక'గా...

 

|| సిరి వడ్డే || 14-02-2013

2. ఉప్పెనంత ప్రేమ

 

సిరి వెన్నెల్లో , 

సిరిమల్లె పందిరి కింద 

పైర గాలికి ఎగిరే నా ముంగురులు చూస్తూ 

 

నా సిరి మువ్వల శబ్దానికి 

అలవోకగా విసిరిన తన కళ్ళలోని

చిలిపి కవ్వింతని పట్టేసా.

గుండెగదిలో గుట్టుగా దాచేసా.

 

పిండార బోసినట్టున్నపండు వెన్నెల్లో 

పచ్చని చీర కట్టిన ప్రకృతి వడిలో 

సెలయేటి గలగలలకి పరవశిస్తూ

మామ మదిలో కలిగిన కొంటె ఆలోచన పసిగట్టేసా.

 

నా కోసం దివి నుండి దిగివచ్చిన

అందాల 'చందమామ' అని మురిసే, 

నా మావకు తన వాడి చూపులతో గుండెల్లో గుచ్చొద్దని,

తీయని బాధ పెట్టొద్దని ముద్దు ముద్దుగా మనవి చేశా.

 

ఎన్నటికి తీరిపోని రుణమై 

ప్రాణం లో ప్రాణమైన బంధమై

వెళ్ళిపోని స్థిరమైన చుట్టమై 

ఏడేడు జన్మలకు నాకు తోడై ఉండిపొమ్మని

లాలించి మరీ తన మనసును గెలిసేసా.

 

నా విసుగొచ్చే చిలిపి చేష్టలను భరిస్తూ, 

శృతి మించితే తెచ్చే ప్రమాదాన్ని హెచ్చరిస్తూ,

నా కంట తడిని గుండెల బరువును

తానే తీసుకుంటూ నా తలపై చెయ్యి వేసి నిమిరేస్తూ

నుదుటిపై సున్నితంగా చిరుముద్దిస్తూ,

 

నాపై తను కురిపించే నిస్వార్ధ మైన, 

నిర్మలమైన ప్రేమకు బదులుగా నువ్విచ్చే 'కానుక'

ఏమిటని నిలదీసేనా మనసుకు చెప్పేసా,

 

ఈ గుప్పెడంత గుండెలో ఉప్పెనంత ప్రేమతోతన కోసం గుడి కట్టేసా'అని.

 

|| సిరి వడ్డే || 12/02/2013

10. నీకై తపన

 

నీ కోసం అనుక్షణం తపిస్తున్నా , 

ఏమీ చేయలేని నా నిస్సహాయతకు , 

నిను తలుస్తూ రోదిస్తున్నా,

 

నీ కోసమే కన్నీరు కార్చే ,

నా నయనాలకు ,

నీ తలపే పిలుపులుగా ,

ఉలిక్కి పడే నా మనస్సుకు ,

నీ జ్ఞాపకాలు చేసినమది గాయాలకు,

 

నీ మరపురాని బాసలతో ,

సతమతమయ్యే నాహృదయస్పందనలకు ,

నీతో గడియైనా గడపలేని నా చేతకాని తనానికి , 

నీతో గడిపిన క్షణాలే తీపి గురుతులుగా,

మిగిల్చిన ఆ విధి రాతలకు,

 

నీ ఊసులే చెలిమి కానుకలుగా,

వదిలేసిన ఈ కాలానికి,

 స్నేహానికి అర్ధం తెలియదంటూ,

నిందించే నా మనస్సుకు,

జవాబివ్వలేక అలిసిపోతున్నా.

 

నీ జ్ఞాపకాల నీడలు నను వెక్కిరిస్తుంటే,

నీ ఊహలతో నా ఊపిరి ఆగిపోతుంటే,

నిన్నెలా మరువగలను?

ఎలా నీ చెంతకు చేరగలను?

 

నా మనసు నిను వీడి,

రాలేనని పసి పాపై మారాం చేస్తుంటే,

యేమని బదులివ్వను ? 

నను నేనేమని బుజ్జగించు కోను?

 

మనసంతా నువ్వే నిండి ఉన్నావని , 

నా కన్నీటి ధారల్లో ప్రవహించే ప్రాణధారవు నీవని,

స్వప్నంలో కూడా నిను వీడిపోలేనని ,

నా మది సవ్వడే నీవని, 

నీకెలా తెలుపను ప్రియతమా?

 

|| సిరి వడ్డే ||  23-05-2013

30. అపురూప నేస్తం

 

'మాతృదినోత్సవ ప్రత్యేక కవిత'

 

ధరణి పై అడిగిడుతూనే

పసి గుడ్డుగా దర్శించేది

మచ్చలేని జాబిలమ్మ లాంటి

అమ్మ రూపునే.

 

అక్షరాభ్యాసానికి ముందే

ఓనమాలు దిద్దేది

ముద్దాడే సరస్వతమ్మ

అమ్మ ఒడిలోనే ,

 

తన పాపల పెదవులపై

విరిసే నవులన్నీ మురిపెముగా

ఏరి మాలలల్లి మురిసే

అమృత వర్షిణి.

 

బిడ్డల ఆనందాల వెలుగులతో

కోటి జ్యోతుల దీపపు కాంతులను

తన కంట వెలిగించుకుని

వెలిగే ఆరని తారాదీపం

 

గారల పట్టీ కాలిలో దిగిన కంటకాన్ని

తన కన్నుల దిగినంతగా విల విలలాడి

కంట రక్తపు కన్నీటిని నింపుకునే దయాసాగరి

ఆకలితో మెలిపెట్టే ప్రేగులను బుజ్జగించుకుని

మన కడుపు మంటను చల్లార్చే

కల్మష మెరుగని దేవత.

 

ప్రతి క్షణం అర్పించాలి అమ్మకు

అభినందనల దినోత్సవ వందనం

ఆ దైవం అనుగ్రహిస్తే

ఆ అమ్మకు అమ్మగా పుట్టి

తీర్చుకోవాలి మన ఋణం.

 

|| సిరి వడ్డే || 11-05-2013

35. అన్న అనరాగము

 

'నా ప్రియ సోదరుడు ...ప్రసాద్. వేగి కు ఈ చిరుకవిత అంకితం'

 

అన్నా ! అనే పిలుపే అతిమధురం ,

అమ్మలోని ఆప్యాయతకు చిరునామావి నీవు

నాన్న లోని బాధ్యతకు ప్రతి రూపానివి నీవు

 

ఉగ్గు పాలతోనే ఓదార్చే గుణాన్ని

అన్న ప్రాసనతో అనురాగాన్ని

ఓనమాలతో ఔదార్యాన్ని

గ్రహించేసిన జ్ఞానివి నీవు

 

తోడపుట్టిన మమకారానికి కట్టుబడి

నాకన్నీళ్లను సైతం నీ కళ్ళల్లో దాచెస్తావు

నా బాధను నీ గుండెలపై మోస్తావు

అవసరమైతే నీ రక్తాన్ని ధారబోసి 

ప్రాణాలను పణంగా పెట్టే ప్రాణదాతవు నీవు

 

తల్లివై, తండ్రివై , గురువై , హితుడై ,

నను నడిపించే చుక్కానివి నీవు

కలలోనైనా మరవని బంధానివై

కనులముందు నిలిచిన ప్రత్యక్ష దైవానివి నీవు

 

అపురూపాల బంగారు తల్లినని ,

ముత్యాల నవ్వుల సిరి మల్లెనని ,

నీ ఇంట సిరులు పండించ వచ్చిన

శ్రీ లక్ష్మి అంశాన్ని నేనని

 

మది నిండుగా మురిసేవు

వర్ధిల్లమని చల్లని దీవెనలను అందించేవు.

నీవున్న చోటే నందన వనం

నీ చిరు నవ్వే నాకు నిత్య కళ్యాణం

నీ చేతి చలువే నాకు శ్రీరామ రక్ష

 

నిండు మనస్సుతో నువ్వందించే

శుభాకాంక్షలే నాకు నిత్య సౌభాగ్యం

ఆ దైవమే దయతలచి వరమందిస్తాను అంటే

మరు జన్మానికి నీ తల్లయ్యే బాగ్యమే ఇమ్మంట  

నిను వడిలో లాలించే అమ్మను నేనై నీ రుణమే తీర్చుకుంటా 

 

|| సిరి వడ్డే || 12-02-2013

33. విజయ వసంతం

 

'ఉగాది కవితల పోటీ కొరకు' 

 

ఈ కవిత " ఉగాది కవితల పోటీ " కొరకు " సేవా పత్రిక " వారు నిర్వహించిన కవితల పోటీ సందర్భముగా ఆ పత్రికలో ప్రచురితమయ్యింది

 

అరుణారుణ కిరణాలతో ,

పసిడి వన్నెల కాంతులతో ,

పక్షుల కువ కువ రాగాలతో, 

రెక్కలు విచ్చుకుంటున్న పూబాలల సందళ్ళతో,

ప్రకృతి కాంత స్వాగతం అందుకునేందుకు

అనుకోని అతిధిలా వస్తావు.

 

మెరుపుల వసంతాలు తెస్తావు ,

చిరు మొగ్గల గుస గుసలతో ,

సుందర కుసుమాల పరిమళాలతో,

కోకిలమ్మ గానాలతో మురిపిస్తావు.

 

వికసించే కుసుమాలతో

ప్రకృతి నయగారాలతో,

అమృతాలను కురిపిస్తూ

ఆనందాల హరివిల్లును తెస్తావు

మల్లెల నవ్వులతో జల్లులలు కురిపిస్తూ

 

తెలుగింట అడుగిడే ప్రగతి పరిమళమై

మామిడి పూతల సోయగాలతో ,

పక్షుల కిల కిల రావాలతో

నిను స్వాగతిస్తున్న ప్రకృతిని

చేపట్టేందుకు చైత్రరధంపై విచ్చేస్తావు.

 

తీపి చేదు కలయికల జీవనం లో

కష్ట సుఖాల జీవిత పయనం లో

షడ్రుచుల సమ్మేళనాల సేవనం,

ఆనందోత్సాహాలను నింపే మాధుర్యం.

 

ప్రకృతి పులకరించి ఆనంద నాట్యం చేసేవేళ ,

చిరు గాలుల సంగీతాలతో ,

గాలికి నాట్యమాడే సుమబాలల గీతికలతో,

యెద మీటే చైత్ర రాగాలతో,

విచ్చేసే విజయనామ వత్సరం,

కావాలి తెలుగువారి మదిలో పచ్చని చిగురాకుల తోరణం.

 

|| సిరి వడ్డే || 5-04-2013

34. నేస్తమా

 

'సిరమ్మా అoటూ ఆత్మీయంగా పలుకరించే మా అపురూప నేస్తం ( పేస్ బుక్ నేస్తం ) శ్రీ చారి గారు పిన్న వయస్సులోనే కామెర్ల వ్యాధి భారిన పడి ఆకస్మిక మరణం పొందారన్న జీర్ణించుకోలేని విషయం తెలిసినప్పటి నుండి హృదయం ఎందుకో తట్టుకోలేక పోతోంది .

 

ఆత్మీయంగా స్నేహహస్తాన్ని అందించి , నవ్వుతూ , నవ్విస్తూ , నవ్వులను అందరికీ పంచుతూ చలాకీగా ఉండే ప్రియ నేస్తం ఇక లేరు అని , మరి ఇక తిరిగి రాని లోకానికి నేస్తాలందరినీ విడచి తరలి వెళ్ళారని తెలిసీ బాధతో ఏ దేవుణ్ణి ఎలా వేడుకోవాలో కూడా తెలియని అయోమయ స్తితిని అనుభవించాను ..ఇటువంటి బాధ పగవారికి కూడా కలుగ కూడదని , ఆత్మీయ నేస్తం పవిత్ర ఆత్మ ఆ దైవసన్నిదిలో సేద తీరాలని బాధాతప్త హృదయం తో ఆ దైవాన్ని వేడుకుంటూ , వారి కుటుంభ సభ్యులందరికీ ఆ దైవం త్వరగా కోలుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ , ఆత్మీయ ప్రియ నేస్తానికి అంకితం'

 

ఆ దైవం వరమిస్తానన్నా

తొందర పడి మాటివ్వకు

మళ్ళీ జన్మిస్తానంటూ.

 

ఎందుకో తెలుసా ?

వంటరిగా అడుగిడవు కదా ఈ జగతిలోనికి

మరణాన్ని నేస్తంగా వెంటేసుకుని మరీ వస్తావు.

అనురాగపు మడిలో సంతోషపు విత్తనాలను

నాటి పోవడానికి ,

 

ఆత్మీయతల వనంలో

నవ్వుల కుసుమాలను విరబూయించడానికి,

మమతల నవరత్నపు ఉద్యానవనం లో

ముత్యాల మాటల మాలలను అల్లడానికి.

 

అనుబంధపు తోటకు వసంతపు కోయిలవై వస్తావు

తీయని స్వరాలతో పలకరించడానికి

అనురాగపు తేనియ రాగాలను అందించడానికి

ఆప్యాయతల మేఘమై మురిపిస్తావు ,

అభిమానపు జల్లులతో తడిపేస్తావు ,

 

మనసున అనురాగపు మల్లెలను పూయించి మురిపిస్తావు.

మది వీణియ తీగలను నిర్దాక్షిణ్యంగా తెంచేస్తావు

హృది వేణువులో శోకరాగాలను పలికిస్తావు.

 

అసలు ఎందుకు వచ్చావు నేస్తం? 

హృదయసౌధం లోనికి చెలిమి హస్తం అందించి ,

మరణ మృదంగం మ్రోగించడానికా ?

మదిలో స్మశాన నిశబ్దాన్ని శాసించడానికా?

 

ఆనందాల సామ్రాజ్యానికి చిరునామావై ,

మా నవ్వులను నీవెంట తీసుకు పోడానికా ?

బాధతో పగిలిన హృదయ శకలాలను ,

పేర్చుకోలేక అవస్తపడే నేస్తాలను చూసి నవ్వుకోడానికా?

 

అందుకే మా ప్రియ నేస్తమా !

తిరిగి జన్మించకు ,

చెలిమి హస్తాన్ని అందిస్తావు ,

నవ్వులతో మనసులను దోచేస్తావు ,

మాటల మాటున తేనెలను ఒలికిస్తావు ,

నాకిది మామూలే ... ఇక సెలవంటూ సాగిపోతావు. 

 

నీకు తెలుసా ?

ఏడ్చి ఏడ్చి కన్నీటి బొట్లు కూడా రాజీనామానే కోరుకుంటున్నాయి.

అందుకే నను మనస్పూర్తిగా మన్నించు ఆత్మీయ నేస్తమా !

నీకిదే నా కన్నీటి వీడ్కోలు .

 

 

|| సిరి వడ్డే || 1-07-2013

36. వసంత కోకిల

 

వసంత కోకిలవై వచ్చావు,

మధుర గానాన్ని అందించావు

గ్రీష్మతాపాన్ని నాకొదిలి,

పని ఉన్నట్లు వెళ్ళిపోయావు ,

 

వద్దు వద్దని నా మది తెగ వారిస్తున్నా వినకుండా .

నెమ్మదిగా నీదైపోయింది నా మనసు

నీ మాయలో పడి ఏమి మంత్రం వేసావో

ఏమి మాయ చేసావో,

 

మాటల భాణాలే వేసి

నా హృదయాన్ని నీ నీడగా మార్చేసి

నీ వెంటే తిప్పుకుంటావు

రా రమ్మని పిలిచినా

 

నీ చెంతకు రాను పొమ్మని మొరాయిస్తోంది

నాది కాని నా మనసు ,

వెక్కిరించి నవ్వుకుంటోంది

తిక్క కుదిరిందని తెగ తిప్పుకుంటోంది

 

నాకే తెలియని కొత్త వింతేదో

నాలో ఉందని తెలిపి నీ స్నేహంతో

మరో జన్మకు శ్రీకారం చుట్టి

కొత్త రూపాన్ని ఇచ్చావు ,

 

అంతలోనే నీతో తగవే నాకు ముచ్చటని

మండే అగ్నిగోళాన్నితలపిస్తావు

నిప్పులు చెరిగే లావాను

కన్నుల ముందర నిలిపేస్తావు

 

క్కడి నుండి తెచ్చు కోను

నిను అర్ధం చేసుకునే మరో అద్దె హృదయాన్ని

ఎలా వెనక్కి తీసుకొను నీకిచ్చేసిన

నా పవిత్ర హృదయాన్ని.

 

|| సిరి వడ్డే || 9-02-2013

32. నా హృదయమా

 

ఓ నా చిలిపి హృదయమా !

ఇది పులకింతల పరవశమా ?

లేక కవ్వింతల కలవరమా ?

 

ఆ మెత్తని అడుగుల సవ్వడి లో

సిరి మువ్వల గల గలలు విని మురిసి నర్తించేవు.

 

ఆ నీలికళ్ళ కాంతుల పసిడి కిరణాల తాకిడికి

తుళ్ళి పడి పరవశించేవు .

 

ఆ తీయని పెదవుల పై విరిసిన చిరు నవ్వుల తళుకులకు

తారకవై మెరిసేవు .

 

ఆ సుతిమెత్తని స్పర్శకు వికసించిన

కొలను తామరవై విస్తరించేవు.

 

ఆ తేనెలొలుకు పలుకుల తీయందనాల

జడిలో తడిచి మైమరచి జలకమాడేవు. 

 

ఆ హృదయంలో వెలిగే ప్రణయదీపపు కాంతుల వెలుగులను

దోచి మణిదీపమై ప్రభలనిచ్చేవు.

 

ఆ ఉచ్స్వాస , నిశ్వాసలకు లయబద్ధంగా

నీ స్పందనను కలిపావు.

 

ఆ మదిలో కదిలే మధురభావాలకు

మౌనరాగాలు పాడేవు

మధుర గానాల ఊహల వేణువై అలరించేవు .

 

ఆ కన్నుల్లో మెదిలే కమ్మనికలవై,

భావాలలో మెదిలే రంగుల హరివిల్లై,

వెంట నడిచే ఛాయవు నీవై నడిచేవు.

ఆ మనసుకి హారతి పట్టేవు.

 

|| సిరి వడ్డే || 10-02-2013

38. ఏవో ఏవేవో

 

సంధ్యా సమయాన పిల్ల గాలులేవో

గుసగుసలతో అల్లరి చేస్తుంటే ,

 

వినీల గగనాన మేఘమాలికలేవో

మెరుపుల తలపులతో యెదను మీటుతుంటే ,

 

కరి మబ్బుల మాటున వెండి మెరుపుల వెన్నెలలేవో

తపనల స్వరాలతో మదినే పులకరింపజేస్తుంటే ,

 

తొలకరి జల్లుల చిరు ఊహల సడులేవో

అందెల రవళులతో హృదినే మ్రోగిస్తుంటే ,

 

తలపుల తాళాలతో పెదవి దాచని మౌనాలేవో

పరవశాల గానాలను మౌనంగా ఆలపిస్తుంటే ,

 

తీయని తలపులేవో

మనో వీణ తంత్రులను సుస్వరాలతో సవరిస్తుంటే ,

 

ఊసుల వేణువులేవో

లయతప్పిన గుండె సవ్వడులకే రాయంచల నడకలనే నేర్పిస్తుంటే ,

 

ఊహల బాసలెన్నో దాచి ఉంచా నీకై

మది ఆరాటాలన్నీ వినిపించాలని నీకే .

 

 

|| సిరి వడ్డే || 31-10-2013

37. గుర్తుకొస్తున్నాయి , దివ్యస్మృతులెన్నో

 

గుర్తుకొస్తున్నాయి ,

ఎదలోతులో ఏ మూలనో

నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి ,

 

అమ్మ పాలలోని మురిపాలు ,

నాన్న ముద్దులోని మమకారాలు ,

అన్న అనురాగం లోని తీయందనాలు ,

చెల్లి ప్రేమలోని అనురాగాలు ,

తమ్ముని మాటలోని గారాలు ,

 

ఎగసి పడుతున్నాయి

అలలై మది పొరల్లో దాగిన

బాల్య స్మృతులు తట్టి లేపుతూ ,

 

కూనలమ్మతో కలిపి తీసిన కూని రాగాలు , 

పాలనురుగులు నోటికంటిన బుల్లి తువ్వాయిలు,

చెంగు చెంగున గెంతులు వేసిన బుజ్జి మేక పిల్లలు ,

 

గూటిలోని చిట్టి గువ్వల

నోటికి ఆహారం అందించిన చిట్టి పిచ్చికలు ,

గుండెను మెలిపెడుతున్నాయి

మనసునే మభ్యపెడుతున్నాయి

హిమప్రవహాలై జారుతూ మదినే ఊరడిస్తున్నాయి ,

 

గుల్మోహర్ పూల పుప్పొడితో పడిన పోటీలు ,

పెరటిలో అరవిరిసిన జాజి ,మల్లె ,బంతి ,చేమంతులు ,

ముద్దు మందారాల మోములు ,

నిత్యమల్లి నవ్వులు ,

శుభోదయాలు పలికిన ఆ రోజులు ,

 

తన్నుకొస్తున్నాయి , 

అంతరంగపు పొరలను చీల్చుకుని పసిడి కావ్యాలై ,

 

కుక్కపిల్లలతో ఆటలు , 

చేప పిల్లలకై వేటలు ,

కోడిపిల్లల కిలకిలలు,

పిల్లి పిల్లల అల్లర్లు ,

 

జారిపడుతున్నాయి

మది అంచులనుండి కట్ట కట్టుకుని

వెక్కిరిస్తూ పసి జ్ఞాపకాలెన్నో ,

 

కుంభవృష్టికి విరిగిపడ్డ వేప కొమ్మలు ,

చిరుగాలి తాకిడితో నేల రాలిన పొగడపూలు ,

చినుకుల అందెలకు నర్తనమాడే చిగురటాకులు,

వర్షపు బిందువుల బారాన్ని మోయలేక తలవాల్చిన పూబాలలు ,

 

ఈ జన్మకు సెలవంటూ సాగిపోయిన బాల్యాన్ని

తీపి గుర్తులుగా మిగిల్చి 

ఏడిపిస్తున్నాయి 

పగలబడి నవ్వుకుంటున్నాయి,

 

చూరులనుండి ధారలుగా కారి బుడగలై పగిలి ,

కలిసి సాగిపోయే వాన నీటి కాల్వలు ,

వానలై , నదులై , వాగులై పొంగిన మేఘమాలికల

కన్నీటి ధారలు మరపు రాని ,

మచిపోలేని కలల అలలై ,

కన్నీటి వరదలై , మది సాగరాన్ని ముంచేస్తూ ,

గుర్తుకొస్తున్నాయి ,

 

రంగు రంగుల తుమ్మెదల వెంట పరుగులు తీసి అలసిన ఆనందాలు ,

గోదారమ్మ చెంత కట్టిన గుజ్జన గూళ్ళు ,

చలి చలి తొలకరిలో అమ్మ చేసిన వేడి వేడి పకోడీల సువాసనలు ,

 

అడ్డుపడుతున్నాయి

కన్నీటి పొరలమాటున చిట్టి చిట్టి జ్ఞాపకాలై ,

 

చెల్లితో ఆడిన లక్కపిడతలు , చింతపిక్కల ఆటలు ,

అమ్మ వేసిన మొగలి .చేమంతి పూల జడలు ,

తమ్ముడితో పోటీ పడి వాన నీటిలో వేసిన పేపర్ బోటులు ,

పైట వేసిన మాట మరచి అన్నతో కలసి వేసిన కుప్పిగంతులు ,

 

పసిడి చిగురులై తొడుగుతున్నాయి

పసతనపు పసివాడని జ్ఞాపకాలెన్నో ,

 

చెన్నాపట్నం నుంచి నాన్న గారు తెచ్చిన కుచ్చుల గౌనులు , బాబీ రిబ్బనులు , మువ్వల పట్టీలు , చెవి బుట్టలు , ముత్యాల దండలు ,

చేతి గడియారాలు

 

చెదరని జ్ఞాపకాలై ,

నాకు తెలియకుండానే నను వీడిన బాల్యాన్ని గుర్తు చేస్తూ

వెక్కిరిస్తున్నాయి ,

ఈ జన్మకు ఇక సెలవంటూ మరి రామంటూ ,

ఏడిపిస్తున్నాయి.. 

 

 

|| సిరి వడ్డే || 21-11-2013

39. కాలేక పోతినే

 

సంతోషానికి నే చిరునామానైనా కాకపోతినే

నీ పెదవులపై నవ్వునై విరియడానికి ,

 

ఆనంద భాష్పమైనా కాకపోతినే

నీ చెక్కిలిపై జాలువారడానికి ,

 

నీ బాష లోని భావమైనా కాకపోతినే

అక్షర నక్షత్రమై వెలుగొందడానికి ,

 

ఊహలోని ఉలినైనా కాకపోతినే

నిను అందమైన శిల్పంగా మలచడానికి ,

 

నీ శ్వాసనైనా కాకపోతినే

మనో వేణువులో గేయమై నిలవడానికి ,

 

కవితనైనా కాకపోతినే

నీ కవన నగరిలో విహరించడానికి ,

 

ప్రాణమైనా కాపోతినే

నీ నీడనై తాకడానికి ,

 

మరణాన్నైనా చేరలేక పోతినే

మరు జన్మలో నిను కలవడానికి .

 

|| సిరి వడ్డే || 26-11-2013

41. ఎందుకో , మా పల్లంటే

 

 

( " సాహితీ సేవ " పత్రికలో ( 27-12-13 ) ప్రచురించబడిన నా కవిత , " ఎందుకో ...మా పల్లంటే ")...http://sevalive.com/sahithya/?p=799

 

ఎందుకో అంతిష్టం

మా పల్లంటే 

జ్ఞాపకాల్లోనే ఉంటూ

నావెంటే ,

 

గోవుల సీనయ్య కోడె దూడంటే,

ఆదెమ్మ గారి పిల్లికూనలంటే ,

మాణిక్యం గారి కోడి పిల్లలంటే ,

రామం గారి ముద్దు పలుకుల చిలకమ్మంటే,

వసంతరాగాలను ఆలపిస్తూ ..

అతిధిలా వచ్చే మధుమాసపు కోయిలమ్మంటే ,

 

ఎందుకో అంతిష్టం 

మా పల్లంటే 

జ్ఞాపకాల్లోనే ఉంటూ 

నావెంటే .

 

ఒంటెద్దు బండి సూరన్న అంటే ,

పాలు పోసే వెంకన్న అంటే ,

గాజులువేసే ధర్మయ్య అంటే ,

ఉల్లిపాయల షావుకారు సుబ్బయ్య అంటే ,

 

ఎందుకో అంతిష్టం 

మా పల్లంటే 

జ్ఞాపకాల్లోనే ఉంటూ  

నావెంటే .

 

వాకిలి ముంగిట వేసిన రంగవల్లికలంటే ,

ఎండావానల కలయికతో వచ్చే హరివిల్లులంటే ,

బాల్యస్నేహితులతో చేసిన బొమ్మల పెళ్లిల్లంటే,

ఏటి వడ్డున కట్టిన గుజ్జన గూళ్ళంటే ,

 

ఎందుకో అంతిష్టం

మా పల్లంటే 

జ్ఞాపకాల్లోనే ఉంటూ  

నావెంటే .

 

చరిత్ర పాఠాలను నేర్పిన రాజు మాష్టారంటే ,

ఆంగ్లాన్ని భోదించిన శ్రీను మాష్టారంటే ,

అల్జీబ్రాతో గుండె గాబరా పెట్టించిన నందయ్య మాష్టారంటే ,

గోడకుర్చీలు వేయించిన డ్రాయింగు మాష్టారంటే ,

చందమామ , బాలమిత్ర కధల పుస్తకాలను ఇచ్చిన లైబ్రరీ పంతులుగారంటే ,

 

ఎందుకో అంతిష్టం 

మా పల్లంటే 

జ్ఞాపకాల్లోనే ఉంటూ 

నావెంటే .

 

మాలతి కట్టే విరజాజి మాలలంటే ,

సరళ కురులలో తురుముకునే పాలబంతి విరులంటే ,

సుశీల పెరటిలోని కాడమల్లె పూలంటే ,

అర్చకస్వాములిచ్చే ధనుర్మాసపు చేమంతులంటే ,

 

ఎందుకో అంతిష్టం 

మా పల్లంటే 

జ్ఞాపకాల్లోనే ఉంటూ  

నావెంటే .

 

పసి(డి) ప్రాయాన్ని మోసినందుకే ,

కల్మషమెరుగని బాల్యానికి తీపి గుర్తై మిగిలినందుకే ,

పసిమువ్వనై మురిసే చిట్టి మనస్సుతో మైత్రి చేసినందుకే ,

తీయని బాల్య స్మృతుల నిధులను దాచినందుకే ,

 

అందుకే అంతిష్టం

మాపల్లంటే 

సప్తజన్మల బంధమై

నిలిచినందుకే ,

 

మాటలతో మమకారాన్ని పంచినందుకే ,

మనసులో అనురాగాన్ని నింపుకున్నందుకే ,

అభిమానపు చిరునగవులే చిరునామాలై నిలిచినందుకే ,

పెంచిన తల్లే తాను అయినందుకే ,

 

అందుకే అంతిష్టం 

మా పల్లంటే 

ఆ పల్లెతో ముడిపడిన

జ్ఞాపకాలంటే  

 

II సిరి వడ్డే ll    26-12-13

 

 

40. ఓ కాలమా

 

కాలానికింత నిర్దయ దేనికో?
ఎవ్వరి కోసం ఆగదు
ఎవరినీ తనతో రమ్మని పిలువదు,
మొన్న , నిన్న , నేడు , రేపు .తను ఉంటూనే ఉంటుంది
తనతో పాటు నేనూ ఉంటాను , కొన్ని రోజులే.
 
ఏటేటా కాలమనే అమ్మ ఒడిలో 
కళ్ళు తెరిచే పురిటికందు "నూతన సంవత్సరం".
తనతోపాటే ఎన్నో సంబరాలను,
సంతోషాలను,ఆశయాలను,ఆశలను మోసుకొస్తుంది.
 
కొందరి జననం , కొందరి మరణం, మరి కొందరు చిరస్మరణీయం..
కొందరికి పురస్కారం,
మరి కొందరికి సమస్యా పరిష్కారం, 
నల్ల సూర్యుని నిష్క్రమణ 
మాస్టర్ బ్లాస్టర్ క్రికెట్ విరమణ.
ఈ కాలమనే గాలానికి మనమంతా చిక్కుతూ ఉండే చేపలం 
 
తరాలెన్నో మారుతున్నా అంతరాల్లో మార్పు సున్నా.
ప్రపంచమెంత దూసుకుపోతున్నా,
దురాగతాలేమి ఆగకున్నా,
సంవత్సరానికొక పేజీని చింపేస్తూనే ఉన్నా ,
జీవితపు కాలెండర్లో లెక్కతేలని అంకెలే మిన్న.
 
జరిగేది జరగక మానదు,
వచ్చిన ప్రతిగడియకు వీడ్కోలు పలుకకా తప్పదు
పాతను ఒక జ్ఞాపకం గా , క్రొత్తను ఒక నమ్మకం గా అహ్వానించకా తప్పదు..
మరో అదృష్ట గడియకై ఆశతో వేచి ఉండాలి ఎప్పుడూ.
 
ఓ కాలమా !
నేనున్నా , లేకున్నా 
నీ పయనం ఆపకమ్మా
నా పుణ్య భూమిపై చల్లని నీ దృష్టే నిలపవమ్మా..
 
ప్రపంచంలో ఏ మూలనున్నా నేను భారతమాతకు ముద్దు బిడ్డనన్న గర్వాన్ని, 
మా తేజాన్ని చాటి చెప్పవమ్మా.
అనుకోని అతిధిలా వచ్చి ,
చెప్పకుండానే సెలవంటూ సాగిపోయే పాత సంవత్సరమా నీకిదే నా కన్నీటి వీడ్కోలు.
 
వసంతకన్యకలా విశ్వసుందరివై ,
" సిరి " మువ్వల చిరు సవ్వడితో మా ముంగిట అడుగిడవమ్మా ఓ నవీన వత్సరమా !
నీకిదే మా హృదయపూర్వ ఆహ్వానం...

 

|| సిరి వడ్డే || 01-01-2014

43. "శ్రీ " గురుభ్యో నమః

 

కఅఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం .

తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః .

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

 

లాలనలో తల్లివై ,

పాలనలో తండ్రివై, వేదనలో ఓదార్పువై,

ఆశయసాధనలో చుక్కానివై,

 

అనురాగంలో సోదరుడివై,

ఆనందంలో సహితుడివై,

దీక్షలో దక్షుడివై,

శిక్షణలో గురువై, 

ఆప్యాయతకు మారురూపువై,

అలుపెరుగని యోధుడివై, 

 

నడతలలో దిక్సూచివై,

స్వార్థరహిత శ్రేయోభిలాషివై,

సాహితీగగనాన వెలిగే ధృవతారవై,

కవనగిరిపై ప్రసరించే రవికిరణమై,

కావ్యవనానికి తరలివచ్చిన కవికోయిలవై,

 

వాగ్దేవీమాత ప్రియసుతుడవై,

నవరస రచనా తిలకుడవై,

శృంగారసాహిత్య 'శ్రీ'నాథుడివై,

 

ఏకవాక్య కవితావిశారదుడవై,

"మనసంతా నువ్వే" స్థాపకుడవై,

హితుడై, స్నేహితుడై,

గురుడై, సద్గుణుడై,

తోడై, నీడై,

వరమై వచ్చిన కవి చంద్ర శ్రీ కి కవితా నూలుపోగు..

 

అక్షర దీపారాదనలో పదలక్షణ హారతులీయగా , వీణాపాణి సుతునకు, జన్మదిన శుభాకాంక్షలు . "మనసంతా నువ్వే" పుస్తకావిష్కరణ అభినందనలతో..

 

 

"మనసంతా నువ్వే " గ్రూప్ స్థాపకులు , శర్వాణీ ముద్దుల తనయులు , మన ప్రియతమ అడ్మిన్ , గురు సమానులు , శ్రేయోభిలాషి , శ్రీ ఆర్ . వి , ఎస్ . ఎస్ . శ్రీనివాస్ ( శ్రీ ) గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరియు " మనసంతా నువ్వే " పుస్తకావిష్కరణ అభినందనలతో ,,"మనసంతా నువ్వే " గ్రూప్ కో- అడ్మిన్స్ మరియు కుటుంభ సభ్యులు .

 

|| సిరి వడ్డే || 11-01-2014

 

https://www.facebook.com/photo.php?v=603213459747037&notif_t=video_wall_create

 

https://www.facebook.com/photo.php?v=603238593077857&set=p.603238593077857&type=2&theater

45. చెప్పాలని ఉంది...మదిలో సంగతి

 

ఎలా చెప్పేది ?
నీ సమక్షంలో 
నా మాటలు మౌనాలనే 
ఆశ్రయిస్తాయని,

 

నీ నిరీక్షణలో
జ్ఞాపకాలే చిరునవ్వులై 
పెదవులపై విరబూస్తాయని,

 

నీ రూపానికి 
మదికి మతి తప్పుతుందని ,
నీ మౌనం సైతం 
యెదలో గిలిగింతలు రేపుతుందని,
నీ ఊహలే కోటి దివ్వెలై 
నా కంటివెలుగులౌతాయని,

 

చెప్పాలనే ఉంది !
నే పిలుపే కలకూజితమని 
నీ నడకే మయూర నర్తనమని ,
నీ నడతే నాకు ఆదర్శమని 
నీ మనసే నీలాంబరమని,
నీ తలపే నా మనోల్లాసమని
నీ ఆగమనమే నాకు వసంతోదయమని,

 

మది విప్పాలనే ఉంది !
నీ దరహాసం మౌక్తిక వనమని
నీ పలుకులు తేనెల మూటలని
నీ సంతోషమే నాకు ఆనందబాష్పమని
నీ సమ్మతమే నాకు శిరోధార్యమని,

 

ఇంకా...చెప్పాలనే ఉంది
మది మాటున దాగిన సంగతి 
అందరికీ తెలిసిపోతూ నీకు మాత్రమే తెలియని ఆ సంగతి.  

 

|| సిరి వడ్డే || 19-01-2014

49. వెన్నెలనౌకవై రావూ?

 

అంతరంగపు అరలన్నీ నిండిపోతున్నాయి
నీ జ్ఞాపకాల పుస్తకాలతో.
ఓర్చుకుంటూనే ఉంటా  వేయి జన్మలైనా
నీ జ్ఞాపకాలు చేసే  గాయాలను ,

 

మనసు పుస్తకంలో అక్షరాలు
మసకగా కనబడుతున్నాయి 
నీ జ్ఞాపకాలిచ్చిన కన్నీటిపొరలతో ,

 

ఉప్పునీటి సరస్సుల నిలయాలుగా
మారిపోతున్నాయి  నా కళ్ళు
నీ జ్ఞాపకాలిచ్చిన  వేదనాజలంతో ,

 

మౌనంతోనే ముచ్చటిస్తున్నా 
ఎటు తిరిగినా నీ జ్ఞాపకాలే
కనిపిస్తూ నా మనసును గుచ్చేస్తుంటే 
మనో గగనపు వీధులంతా 
సంచరిచేవి నీ జ్ఞాపకాల నీడలే...
అవి నా మనసుకి పంచేవి నిండు అమాసలే  

 

నా మది నిశీధిసంద్రంలో వెన్నెలనౌకవై రావూ 
జ్ఞాపకాల చీకట్లను చీల్చేందుకు.
నీ వలపు వెలుగులతో ఆ చీకట్లను తరిమికొట్టవూ  ..

 

|| సిరి వడ్డే || 16-01-2014

48. ఆగి పోకుమా

 

వికసించే కుసుమ మా , వాడి పోకుమా ,

 

కురిసే చినుకమ్మా , ఆగి పోకుమా ,  

 

మెరిసే నీలి మేఘమా , చెదిరి పోకమ్మా ,

 

వెలిగే దీపమా , ఆరి పోకుమా ,

 

విరిసే వసంతమా , మోడు వారకుమా ,

 

పచ్చని పైరమ్మా , బీడు వారకుమా , 

 

పాడే కోయిలమ్మా , మూగ బోకుమా ,

 

తీయని స్వప్నమా , కరిగి పోకుమా ,

 

నర్తించే మయూరమా , నటనమాపకుమా ,

 

స్పందించే హృదయమా , సవ్వడులను వీడకుమా ,

 

ఆనంద బాష్పమా , జారి ( రాలి ) పోకుమా ,

 

తీపి జ్ఞాపకమా , నను వీడి పోకుమా ,

 

సప్తవర్ణాల చాపమా , వెలిసి పోకుమా ,

 

సాగిపోయే సెలయేరమ్మా , వెనుదిరగకు మా ,

 

పడమటి సంధ్యరాగామా , తరలి పోకుమా ,

 

నా ప్రియ నేస్తమా , నను మరువకుమా .

 

|| సిరి వడ్డే || 22-01-2014

50. నీకెలా తెలుపను ?

 

అలలై నా మనసును తాకిన నీ స్నేహం

 

కలగా కరిగి పోతుంది ఎందుకని ?

 

కంటికి కనపడక దోబూచులాడే నీ రూపం

 

స్వప్న లోకాన అలరిస్తున్నది దేనికని ?

 

పెదవులపై నాట్యమాడే నీ నామం 

 

మకరందాల మునుగుతున్నది ఎందుకని ?

 

నా హృదయ ఫలకం పై గీసిన నీ చిత్రం

 

పదిలమై నిలిచింది మాత్రం నిజమేనని...

 

నేస్తం ...నీకెలా తెలుపను ?

 

|| సిరి వడ్డే || 24-01-2014

51. ?????????

 

పరవళ్ళ గోదారమ్మకు

పరుగులు నేర్పించనా

మౌన మందాకినితో

మాటలనే పలికించనా ,

 

కవుల ఊహలకే అందని
కావ్య నాయిక నేనవ్వనా
కవన వనంలో పరిమళించే
కావ్యకుసుమమై వికసించనా,

 

నీ మది పూదోటలో
ముద్దులొలికే పూబంతి నేనవ్వనా
జాజి తీగనై అల్లుకుపోనా
కుసుమ కన్యకనై మురిసిపోనా,

 

రంగుల హరివిల్లునే 
నడుమున బంధించనా
నెలవంకను తెంచి 
సిగలో తురుముకోనా,

 

గంతులు వేసే తువ్వాయినై
పసిడి వన్నెల బుజ్జాయినై పోనా
చెంగు చెంగున గంతులు వేసే  

లేడి పిల్లనై ఉండి పోనా,

 

మణులలో మాణిక్యం నేనవ్వనా
నీ పదవిపై చిరునవ్వుల ముత్యమై మెరవనా
నీ చెక్కిలిపై కెంపునై మురియనా
నీ కన్నుల మెరిసే నీలాన్ని నేనవ్వనా ,
 
నీ కనులకే కలలను నేర్పించనా
నీ నిదురలో కమ్మని స్వప్నమై నే రానా
నీ ఆనందానికి నే రూపాన్నైనిలువనా
నీ సంతోషానికి చిరునామాగా మిగలనా,

 

నీ మురళి గానానికి నాగినినై నర్తించనా
నీ పదములకు కలహంసనై పదగతులనే అర్పించనా
ఎలకోయిలనై స్వర జతులతో అర్చనలే చేయనా
అలుకలు చిలుకను నేనై నీ చల్లని గుండెల్లో దాగిపోనా,
 
నీ అడుగుల సవ్వడి విని
తడబడే నా మనసును బుజ్జగించనా
కలవరమొద్దని నా నీడై ఉన్న
ప్రియ బాంధవుడవు నీవని చెప్పేయనా .... 

 

 

|| సిరి వడ్డే || 22-01-2014

52. ఎలా నివేదించుకోను?

 

ఈ క్షణమే పిచ్చి కోరిక
నిన్ను చూడాలని
ఒకే ఒక చిన్ని ఆశ
నీ పలుకులనే వినాలని ,
 
ఎందుకో ఇంత అత్యాశ
నీతోనే ఉండి పోవాలని
నీ యెదలో నేనే నిండిపోవాలని
నీ ఊపిరే నేనవ్వాలని ,

 

నీ తీయని స్వరానికి 
నను నే మరచిపోవాలని 
నీ వడిలో సేదతీరాలని
నీ నవ్వుల జల్లులలో తడవాలని ,
 
నా ఊహలలో నీవే నిండాలని
నీ ఊపిరే నేనవ్వాలని
నీ యెద సవ్వడితో ఊసులాడాలని
నీ చిరునవ్వుల సందడితో "సిరి" మువ్వనై రవళించాలని ,
 
నా మది పొరల్లో నీ జ్ఞాపకాలే నిక్షిప్తమవ్వాలని
నీ సమక్షంలో కాలమే తనను తాను మరవాలని
నా ప్రేమ సామ్రాజ్యానికి యువరాజువు నీవవ్వాలని
నా హృదయాన్ని గెలిచిన చక్రవర్తివై మురవాలని  ,
 
ఎలా నివేదించుకోను ?
ఏమని విన్నవించుకోను ?
నీకెలా తెలుపగలను ?
మదిమాటున దాగిన ఆశలను ..
 
పున్నమి రేడువై వస్తావని
వెన్నెలమ్మనై వేచి చూస్తున్నా 
వసంతునివై మురిపిస్తావని
ఆమని వసంతాలే తెస్తావని , ఆశతో ఉన్నా,
 
నీ వెన్నెల వానల్లో జలకమాడనీయవా !
నీ పూల శరాలతో నను బంధీకానీయవా !
నా ప్రేమ పందెంలో విజయుడవై రాలేవా !
నీ గుండె గూటిలో గువ్వనై నను వదిగిపోనీయవా !

 

 

|| సిరి వడ్డే || 27-01-2014

55. నా వల్లకాదంటూ

 

అంబరం నీలాన్ని వలదంటే
హరివిల్లు వర్ణాలను వద్దంటే
తారలు ప్రకాశాన్ని వదిలేస్తే
జాబిలమ్మకు చల్లదనమే పడదంటే
 
కూనలమ్మ స్వరాలనే వినిపించనంటే
చిలుకమ్మ పలుకులను విడనాడితే
మయూరం నర్తనాలను మరిచానంటే
కలహంస నడకలలో వయ్యారం వద్దంటే
 
"సిరి"మువ్వ రవళించలేనంటే
మురళి ..వేణుగానమే నిలిపేస్తే
వీణియకు నాదమే పడదంటే
మృదంగం మౌనాలనే ఆశ్రయిస్తే
 
రవి ప్రకాశమే నిలిపేస్తే
శశి వెలుగుల జిలుగులనే వదిలేస్తే
మబ్బులు జల్లులనే ఆపేస్తే
పవనుడు వాయు దిగ్భంధనమే కావిస్తే
 
కుసుమాలు వికాసమే తమ వల్ల కాదంటే
విత్తుకు మొలకంటేనే విసుగంటే
వృక్షం ఎదగడమే దండగనుకుంటే
వసంతమే పూలపరిమళాన్ని నిరాదరిస్తే
 
లతలకు అల్లికలే అలుపు తెప్పిస్తే
వాగులు ప్రయాణమే ఆపేస్తామంటే
పసి గువ్వల రెక్కలే అలిగితే
ధరణి విరామమే కోరుకుంటే
 
సాలీడు అల్లికల నేర్పునొదిలేస్తే
గోమాత క్షీరధారలనే నిలిపేస్తే
హృదయ స్పందనలు విరామమే కోరుకుంటే
అమ్మ శ్రమకు, సహనానికి రాజీనామా చేసేస్తే.....
 
మానవ జాతికి మనుగడే లేదుగా  ?
జీవనానికి ప్రమాణమే జారిపోదా ?
జీవితానికి ప్రయాణమే ఆగిపోదా ?
మనిషి  జన్మకు అర్ధమే మారిపోదా ?
 
అందుకే ....
 
ఉత్సాహంగా బ్రతుకునే సాగనివ్వు ,
సంతోషాల వడిలో వాలనివ్వు ,
తొలకరి జల్లై దిగి రానివ్వు ,
వాగుల నేస్తమై నను పయనించనివ్వు ..
 
నా ఉనికినే నువ్వు మరిస్తే,
నే శ్వాసనే  విడుస్తా ..
నా ఊహలకే నీవు ప్రాణం పోస్తే  ,
అనుక్షణం నీ ఛాయనై నడుస్తా ...   

 

|| సిరి వడ్డే || 03-02-2014

54. అపురూపమే

 

మెరిసే గాజుల గల గలలతో

చిరు చేపల నయనాలతో
సిరి మువ్వల సవ్వడితో
బుడి బుడి నడకలు... అపురూపమే
 
కోకిలమ్మల స్వరానుకరణలతో
తుమ్మెదల వెంట పరుగులతో
బుజ్జాయిల సయ్యాటలతో
యెదలో నిదురిస్తున్న జ్ఞాపకాలన్నీ.... అపురూపమే
 
పంట కాలువల్లో చేపపిల్లల ఈదులాటలు
లేత రెక్కలను విరుచుకుంటున్నగువ్వపిల్లల ముద్దు మోములు
కోడిపిల్లల మధ్య కీచులాటలు
లేగదూడల గెంతులాటలు ..అపురూపమే
 
తెల్లారకముందే వినవచ్చే హరిదాసుల పాటలు
రంగవల్లుల మధ్యన గొబ్బెమ్మల ముచ్చట్లు
ఇంటింటా బసవన్నలు చేసే సందళ్ళు
గాదెలు నిండిన కొత్త పంటలు ..అపురూపమే
 
తోబుట్టువుల పండుగలు
పరిమళించే మమతల కోవెలలు
పసుపుకుంకుమల దీవెనలు
ప్రేమతో పొంగే అన్నదమ్ముల హృదయాలు ..అపురూపమే
 
చెమ్మ చెక్కా చేరడేసి మొగ్గా
అందాల అక్కా చక్కని చుక్కా
పొగడపూలదండలెన్నో నీకై తెచ్చానంటూ
చెల్లి మోమున విరిసిన అభిమానపు కుసుమాలు ....అపురూపమే
 
అమ్మ చీరను చుట్టి తడబడిన అడుగులన్నీ  
తూలిపడిన వేళలన్నీ 
అన్న నవ్వుల్లో జాలువారిన ముత్యాలన్నీ
నాన్న ప్రేమలోని మురిపాలన్నీ ..అపురూపమే
 
మందారాలే అరచేత గోరింటలై పూస్తే
సింధూరాలే పారాణిలై పండితే
మొగలిరేకులే పూలజడలై పరిమళిస్తే
అమ్మ కంట వెలిగిన కోటి దివ్వెల కాంతుల మెరుపులన్నీ  ..అపురూపమే
 
గవ్వల పోగేతకై వెదికిన తీరాలు
నెమలి పింఛమంటే(కన్నులు)మోజులు
బళ్ళో చదువులంటే బేజారులు
ఈత పళ్ళకై రువ్విన రాళ్ళు ..అపురూపమే
 
నవవధువుల నోములంటూ
కాలువలో కరిగే పసుపు గౌరమ్మలంటూ
గోమాతలకు కుంకుమ పూజలంటూ
అట్ల తద్దె ఊయలలంటూ..మురిసిన రోజులన్నీ ..అపురూపమే
 
వాననీటి తడిని విదిలించుకునే పక్షి పిల్లలు
జల్లుల భారంతో తలవాల్చిన పూబాలలు
చూరులవెంట దారలుగా జారే వాన బిందువులు
అమ్మ స్పర్శలో వెచ్చగా వదిగిన ముద్దు కూనలు..అపురూపమే
 
జెండా వందనాలంటే  తెలియని రోజులు
మిఠాయిలకై వేచిన గడియలు
జైహింద్ లకై ఎదురుచూపులు
బడిగంటలు కొట్టక ముందే ఇంటికి పరుగులు ..అపురూపమే
 
వేసవి సెలవుల్లో పల్లెలకు పయనం
ఏటివడ్డుకు చేరిన పరుగుల ప్రస్తానం
చెరువుగట్ల చుట్టూ ప్రదక్షిణం
పిల్లగాలులతో ఆడిన వైనం ..అపురూపమే
 
సెలవంటూ ..మరి రానంటూ సాగిపోయిన బాల్యం
పసితనపు జ్ఞాపకాలనే దాచుకున్న స్మృతిపధం
తుళ్ళి తుళ్ళి పడి జారిపోయిన చిరుప్రాయం 
పదిలమై నిలిచే ప్రతి క్షణం ..అపురూపమే
 
బాల్యంలోనే ఆగిపోవాలంటూ అన్ని గడియలు
పసి(డి)తనమే కావాలని నూరేళ్ళు
ముక్కోటిదేవతలకు ఎన్నెన్నో మ్రొక్కులు
జన్మంతా పసిప్రాయానికై ఎదురుచూపులు
మరుజన్మకైనా తీరేనా నా ఆశలు ...
 

|| సిరి వడ్డే || 06-02-2014

56. అందుకే ..ఈ మనసంటే

 

ఎన్నో అనుబంధాలతో పరిచయాలు 

చేజారిపోతూ కొన్ని ఆత్మీయ హృదయాలు 

జ్ఞాపకాలనే జ్ఞాపికలుగా మిగిల్చే వేదనానిలయాలు 

పరిచయిస్తూనే ఉంటాయి కన్నీటి సంద్రాలు.

 

ఏమి నేరం చేసాయనో 

బాధనంతా దత్తతనిస్తూ నయనాలకు 

వేదనల ఉప్పెనలే హృదయాలకు 

కష్టాలు తనకైతే కళ్ళకెందుకో ఈ చమరింతలు

హృదయానికీ తప్పవు విషాదాల చెలమలు

 

ఎవరినెపుడు దగ్గరకు చేర్చుకుంటుందో

ఎందులకు విసిగి వేసారిపోతుందో

అవమానాలంటూ ఆక్రోశిస్తుందో

ఆశయాలకు సైతం హద్దులను చెరిపేస్తుందో

ఏ ఆప్యాయతలను ముడివేసుకుంటుందో

ఏ అనురాగాలను పెనవేసుకుంటుందో

ఏ అవమానాలకు విలపిస్తుందో

ఆశయాల సాధనకై పరుగులు తీస్తుందో 

 

అందరూ తనవారేనంటూ 

తనుమాత్రం ఏకాకినంటూ

నిలకడే లేదంటూ 

హద్దుల గిరి గీసుకుంటూ 

ఆశ పడుతూనే ఉంటుంది 

అత్యాశలకు లోనౌతూఉంటుంది 

ఆనందాల పల్లకీలో ఊరేగుతూనే ఉంటుంది 

నచ్చిన వారి ఛాయే తానౌతుంది

 

కలనైనా మైత్రి విడవనంటుంది 

ద్వేషంగానైనా ప్రేమిస్తుంది 

చిరు చింతలకే కన్నీటి ప్రళయమౌతుంది 

విధి రాతకందని వింతపాటలేవో పాడుతూనే ఉంటుంది 

 

మరి రాలేనంటూ మొరాయించే బాల్యానికై ఎదురుతెన్నులే కాస్తుంది 

జీవనయానంలో చిరు మజిలీయని తెలిసీ యవ్వనంలో మిడిసిపడుతుంది

బాధ్యతల సుడిగుండాల కౌమార్యమంటేనే మండి పడుతుంది 

పసిప్రాయాన్ని తలపించే వృద్దాప్యమంటేనే అదిరిపడుతుంది

 

అర్ధం కాని గ్రందమే తానంటుంది

ఏ లిపికందని బాషై కూర్చుంది 

గమ్యమెరుగని పయనమే తానంటుంది 

తీరం చేరని కెరటమై ఎగసి పడుతుంది 

మనసున కెన్నో స్వప్నాలంటూ

మౌనమే తన భాషంటూ

ఊగిసలాడుతూనే ఉంటుంది 

ఊహల ఊయలలే ఊగుతుంటుంది 

ఉబలాటాలేవో పడుతుంటుంది 

కలతల సరోవరాన జలకమే ఆడుతుంది.

 

అందుకే .....ఈ మనసంటే 

 

కొంత ఇష్టం - కొంత కష్టం 

కొంత ప్రేమ - కొంత ద్వేషం 

కొంత ఆవేశం - కొంత పరవశం 

కొంత అనురాగం - కొంత నైరాశ్యం 

కొంత ప్రణయం - కొంత ప్రళయం 

కొంత ఆనందం - కొంత విషాదం 

కొంత వైరాగ్యం - కొంత సౌరభం 

కొంత ఓదార్పు - కొంత నిట్టూర్పు 

కొంత లాలన - కొంత వేదన 

 

ఆశల నిలయం 

ఊసుల ప్రళయం 

ఊహల వలయం 

ఆనందాలే అతిశయం 

అందాలే వీవనం 

మారుతూనే అనుక్షణం 

సాగిపోయే జీవన వేదం 

 

 

|| సిరి వడ్డే || 12-02-2014

57. నీతోనే ఉండిపోతా 

 

నీ చెక్కిలిపై కంటిముత్యమై ...

నే జారిపోతా,

 

నీ మదిలో మధుర బావమై ...

నే ఉండిపోతా,

 

నీ ఊపిరిలో శ్వాసను నేనై ...

నిను చేరి పోతా ,

 

నీ పెదవులు పలికే కమ్మని నామమై ...

నే మిగిలిపోతా ,

 

నీ చూపులకు చిక్కిన సుందర రూపమై ...

కనుల విందునై ఉంటా ,

 

నీ మనస్సు మురిసే తీయని జ్ఞాపకమై ...

నిను మురిపిస్తా ,

 

ఋతువులెన్ని మారినా యెదలో వసంతమై ...

నీకై పరిమళిస్తా ,

 

నీ చిరునవ్వుల వెలుగుల్లో "సిరి" వెన్నెల ...

నేనై వెలుగొందుతా,

 

నీ కనురెప్పలు పాడే కనుసైగ పాటల్లో ...

తీయని కలనై కరిగిపోతా ,

 

ప్రాణం ఉన్నంత వరకు నీ చెలిమిని నేనై 

నీతోనే ఉండిపోతా ...

 

|| సిరి వడ్డే || 28-02-2014

58. ఎంత  స్వచ్చమైనదంటే  నీమనసు 

 

"హృదయ స్పందన" పుస్తక ప్రచురణకు ఎంపిక అయిన కవిత

"సాహితీ సేవ పత్రిక" లో కూడా ప్రచురించబడిన కవిత

 

పచ్చకోక చుట్టుకున్న మా కోనసీమ పరువమంత 

తెల్లవారే తొలిసంధ్యలోన తుళ్ళిపడే పల్లెపడుచు ప్రాయమంత

మమతలు అల్లుకున్న పల్లెసీమ మనసులంత

ప్రతి లోగిలిలో దిద్దుకున్న రంగవల్లుల సోయగమంత

 

అమ్మవడిలో కొసరి కొసరి తిన్న పాలబువ్వంత 

చదువులమ్మ బడిలో పట్టి పట్టి విద్యను నేర్పిన గురువులంత

పెదవులపై పదిలమై నిలిచిన ఆత్మీయపు చిరునవ్వంత 

మదిలో నింపుకున్న నిండైన నీ ప్రేమంత

 

మాపంట చేలపైన వీచే పైరగాలంత

ఏటి అలలపై ఊయలూగే తెరచాప నావ అంత

సెలఏటిపై తేలియాడే తరగల పాల నురుగులంత

ఇసుకతిన్నెలతో కట్టుకున్న గుజ్జనగూళ్ళంత

మా పల్లె పరవశించి పాడుకునే జానపదమంత

చిగురుటాకుపై జారిపడే మంచుబిందువంత 

 

నాన్న ప్రేమలోని బాధ్యతంత

అమ్మ మనస్సులోని స్వచ్చతంత

అన్నదమ్ముల అనురాగమంత 

అక్కచెల్లెళ్ళ అభిమానమంత

 

పాపికొండల మాటున తొంగి చూసే జాబిలంత

అంబరాన వెలిగే తారా దీపమంత

హరివిల్లులోని వర్ణమంత

హంసల్లలే తేలియాడే తెలిమబ్బులంత.

 

గుమ్మపాలు తాగి గెంతులేచే లేగదూడలంత 

గున్నమావి కొమ్మపైన గూడులల్లిన బుల్లిగువ్వలంత

మధువులకై వేటాడే తుమ్మెదల మురిపమంత

రెమ్మన ఊయలలూగే కమ్మని పాటల కోయిలమ్మలంత

 

మా పెరటిలోన ముద్దు పూబాలలంత

మా ఇంటి గడప తోరణమంత

మా ఇంట పెరిగే బుజ్జి కూనలంత

మా ఊరి కోవెల గంటల సవ్వడంత

 

గోధూళివేళ సింధూర వర్ణమంత 

ఆమనిలో పూవని అందమంత

తొలకరి పరిమళమంత

మలయమారుతాల చల్లని స్పర్శంత

 

ధరణిని చీల్చుకువచ్చే చిట్టి అంకురమంత

వెన్నెల్లో గోదారి అందమంత 

కొనేట విరిసిన కలువభామ సౌందర్యమంత 

"సిరి"మల్లెలోని తెల్లదనమంత

 

గరికపూలతో చెలిమి చేసే చిన్ని క్షీరదమంత

అలుపెరుగక గూడునల్లే సాలీడు నేర్పంత

వయారంగా అల్లుకుపోయే కుసుమలతలంత

పిల్లగాలితో ఊసులాడే వరికంకులంత 

 

నీ నవ్వులకు దొర్లే ముత్యమంత 

నీ కన్నుల మెరిసే నీలమంత

నీ చెక్కిలిపై జారిపడే కెంపులంత 

నీ పదాలకు మురిసే పగడమంత

 

మచ్చలేని జాబిలంత 

వెచ్చగ తాకే తొలి కిరణమంత

పసిపాపల బోసినవ్వులంత 

వసివాడని పూవులంత.

 

|| సిరి వడ్డే || 20-03-2014

59. యాడుంటివి మామా 

 

http://sevalive.com/sahithya/?p=853

 

యాడనుంటువి మామా ?

కోడికూయక మునుపే సంతకని పోతివే?

సద్దికూడును మరిసి, ఏకువెంటే తరలిపోతివే?

గొడ్డును తెచ్చి కాడికి కడతనంటివే?

 

కొత్త రైక తెత్తనంటివే

ముత్తెమంత ముక్కెర ముద్దంటివే

మువ్వల గజ్జలతో మురిపిత్తనంటివే

మువ్వన్నెలకోక నీకంటివే

 

సిలిపిగా ఈలలేసి గోలసేసే గాలిసుడిగాడు

మరుల పూలగందమేసి పోయే వనరేడు 

సినుకులతో సిటికలేసే వానదేముడు 

కనుగీటి సైగసేసె కోరమీసాల సక్కనోడు 

 

తుంటరి మల్లెలు వలపు అత్తరులేసి పోయే 

గండుతుమ్మెదలు గుంపుగా సేరి గుసగుసలు రేపే 

కొంటె కందిరీగ బుగ్గ గిల్లిపోయే 

మొగలిపొదమాటున నాగులలసి సొమ్మసిల్లిపోయే

 

యెరుకతొచ్చి ఏమో సెప్పిపోయే

సిలక జోసెమంతా..ఇప్పిపోయే 

పావురాయి పిట్ట పిలుపు ఇనకపోయే

కాకమ్మయినా కబురు తేకపోయే 

 

ఆసలన్నీ సిసిరాలై రాలిపోయే 

ఊసులన్నీ వసంతాలనే నింపిపోయే

ఊహలన్నీ సెరత్తులై సిగురులేసే 

బాసలన్నీ గీస్మతాపాలై గుబులురేపే 

 

యెన్నెలమ్మొచ్చి ఎలుగు కల్లాపి సల్లిపోయే 

తారలమ్మలొచ్చి సుక్కలనే దిద్దిపోయే 

మెరుపులమ్మ మేనాదిగి ముగ్గులల్లిపోయే 

ఏడురంగుల దీపమొచ్చి రంగులద్ది పోయే 

 

మినుగురుల దీపమెట్టి ఎతుకుతున్నా 

సాగిపోయే ఏరులనే ఆరాలడుగుతున్నా 

జింకపిల్ల యెంటపడి మతిసెడి పరుగులెడుతున్నా

ఒడ్దు సేరే పతి నావ నడుగుతున్నా

 

గోదూలి ఏలైపోయే

లేగదూడలన్నీ ఇంటికి సేరిపోయే 

గువ్వలన్నీ గూడుసేరే 

వాడంత కునుకుతీసే 

సిరుగాలి సంగీతాలతో జోలలు పాడే 

 

తమలపాకు సేతులేమో కమిలిపోయే 

పూల పుప్పొడి పారానులేమో రాలిపోయే 

సిలకసుట్ట ఇసిగి ఎలిసి పోయే 

దూపమలిగి దూరతీరం సేరి పోయే 

 

మబ్బుసాటున సెందరయ్య తొంగిసూసి ఇసిగిపోయే 

జాబిలమ్మ యెన్నెల దీపమెట్టి అలిగిపోయే 

ముసురుపట్టి కనులేమో ఏరులాయే

మాపుటేలకైనా మరలిరాకపోయే 

 

మురిపాల మిరియాల జున్ను సేసుంచినా 

మినప సున్నుతో ఉట్టినంత నింపి పెట్టినా 

దిబ్బరొట్టి పానకాలే దాసి పెట్టినా 

కొర్రమేను పులుసు కమ్మగా వండి పెట్టినా

నాటుకోడి కూర గాటుగా వండినా 

సిల్లుగారెలేసి అదిమి పెట్టినా 

తెల్లనైన వరిబువ్వ వార్చిపెట్టినా 

ఇప్పపూల సార సేకరించి తెచ్చినా

 

పొన్నపూల పానుపేసి ఉంచినా 

నాగమల్లి పూల పక్క పరిసినా 

జాజిపూల దండ కొప్పులో తురిమినా 

మొగలిపూల అత్తరులే  సల్లినా 

 

యెన్నెల్లో తానమాడి పొదరింట ఎదురుసూత్తున్నా

యెన్నెల దొరవై వత్తవని, యెన్నెల సరసమే తెత్తవని 

వలపు ఇత్తరి పరసి ఉంచా... మరుల మడి తడిపి ఉంచా 

మగసిరితో వత్తవని  సొగసరి సొగసును దోసుకుంటావని

 

మల్లి మనసు సిన్నబోయే 

కనులు కడవలాయే

జామురాతిరంతా జాగరనాయే

రేయేమో తరగదాయే, కాలమేమో కదలదాయే 

నువ్వేడనున్నా ఏగిరమే గూటికి సేరుకో మామా !

నీ మల్లి గుండె గదిలో దాగుండిపో మామా ! 

 

|| సిరి వడ్డే || 22-03-2014

60. ఆమనికి స్వాగతాంజలి  

 

"సాహితీ సేవ పత్రిక" లో ప్రచురించబడిన కవిత

 

http://sevalive.com/%E0%B0%86%E0%B0%AE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%97%E0%B0%A4%E0%B0%BE%E0%B0%82%E0%B0%9C%E0%B0%B2%E0%B0%BF/

 

తొలికిరణాలను సృజిస్తూ 

అరుణోదయాలు ,

పరిమళాలను వెదజల్లుతూ  

వసంతోదయాలు,

 

రంగు రంగుల విరులతో 

ఆమనికి  అందాలు,

తుషారపు మౌక్తికాలను సృశిస్తూ  

చిగురుటాకులు ,

చల్లని వీవనలను వీస్తూ 

మలయమారుతాలు

మామిడి పూతలు విరగపూస్తూ 

వింత సోయగాలు 

వేపపూతలతో పులకిస్తూ 

వసంతుని ఆగమనాలు

  

తరులకు  సొగసులందిస్తూ 

విరబూసే సుమకాంతలు 

శుకపికాల కువకువలతో వింత హాయిపొందుతూ 

తలలూపే ముద్దు పూబాలలు

 

చిగురుటాకులపై అలవోకగా జారే 

తెలిమంచు ముత్యాలు ,

ఎలమావికొమ్మలపై

ఊయలలూగుతూ ఎలకోయిలలు ,

సరిగమల గలగలతో సవ్వడి చేసే 

సెలయేరమ్మలు,

 

షడ్రుచుల మేళవింపులు

కవిసార్వభౌముల నడుమ సాహితీచర్చలతో

కవిసమ్మేళనాలు 

వీనులకు విందులు చేకూర్చుతూ

జ్యోతిష్కుల పంచాంగ శ్రవణాలు

 

కోకిలమ్మల కచేరీలతో 

గున్నమావి సొగసులతో 

కెందామరల అందాలతో  

ప్రకృతికాంత పరిమళాలతో

పరవశించి ఆలపిస్తోంది రాగాంజలి 

నవ్య  రమ్య   జయనామ ఉగాదికి ,

రమణీయ, కమనీయ నవ చైతన్య యుగాదికి,

పలుకుతోంది ఆమని స్వాగతాంజలి 

తెలుగుజాతికి నూతనవత్సర శుభాకాంక్షల హృదయాంజలి.

 

|| సిరి వడ్డే || 23-03-2014

63. వసంతరాణికి...గీతాంజలి

 

సాహితీ సేవ గ్రూప్ ఉగాది కవితల పోటీ కోసం  వ్రాసిన ఉగాది కవిత  

 

మధుమాసపు కోయిలల కిలకిల స్వాగతాలతో

మరుమల్లెల పరిమళాలతో...విరుల సిరినగవులతో

వసంతములో స్నానమాడిన ప్రకృతి సోయగాలతో 

 

పసుపు పూతల గడపలతో... మామిడాకుల తోరణాలతో

వేపపూతల సువాసనలతో...పక్షుల పాటల కచేరీలతో 

షడ్రుచుల సమ్మేళనాల ఉగాది పచ్చడితో ... 

పంచాంగ శ్రవణాలతో...సాహితీవేత్తల కవనాలతో

 

హరివిల్లు కుంచెతో అద్దిన వర్ణాలతో 

పూలపుప్పొడిని అద్దుకున్న పారాణులతో

రంగవల్లులతో నిండిన వాకిళ్ళలో 

సిరిమువ్వల రవళులతో అడుగిడుతోంది 

వనరాణి, వసంతాల అలివేణి 

 

ఆమని కోయిలలు ఆలపిస్తున్నాయి

జయనామ సంవత్సరానికి సుస్వరాంజలి 

ఆహ్వానిస్తూ....ఆమనికి స్వాగతాంజలి 

అర్పిస్తూ ..హృదయ కుసుమాంజలి 

 

|| సిరి వడ్డే || 31-03-2014

61. సూపరు.. బంపరు.. ఆఫరు 

 

"సిరిమల్లె పూవు" గ్రూప్ కోసం రాసిన హాస్య తవిక (కవిత)

 

జాబిలినై వస్తా ..పక్షానికి ఒకమారు 

పుష్కరమే తెస్తా ...పన్నెండేళ్ళ కోమారు 

నేనంటే కొందరికి ..ప్యారు 

అందుకే పెంచేసుకుంటున్న ...బోల్డంత గ్లామరు 

 

సాహిత్యానికీ వచ్చిపడిందిట...సరిక్రొత్త గ్రామరు 

చదవాలంటేనే ...మరి బేజారు 

ఏమిటో అంతా ..గోలీమారు 

అందుకే మరి ...నేను పరారు 

 

మీరు కూడా ...పారాహుషారు 

భరించడం కష్టమే మరి ... ఈ హారరు

తప్పవీ తిప్పలు ..ముమ్మారు 

పారిపోవడమే నయం ...మయన్మారు (మయన్మార్ )

 

ఇదెక్కడి సంత....బజారు ?

అయినా మనమెప్పుడూ ...తీన్ మారు 

తెచ్చుకోవాలి మరి ..తప్పని హుషారు 

వప్పుకోండి నిజమని  ..ఒన్స్ మోరు

 

అమ్మో పిలుస్తున్నాడు ..మా మేనేజరు 

వెళ్లకుంటే ఊడుతుంది ...నా నౌకరు 

చుపించామా ...పొగరు 

ఇచ్చినట్లే చేతికి ...ఊస్టింగ్ ఆర్డరు 

 

నవ్వుతూ ఇస్తాడు ...ఒక కవరు 

అయ్యామా ....గైరహాజరు

 చూపించి మరీ ..తన పవరు 

అసలే ముందు  ..మిలటరీ మేజరు 

 

శౌర్యానికి ...టైగరు 

ఉరిమే ..తండరు

మనిషేమో ..మహా బారు 

పేరేమో ..అన్వరు

ఊరేమో ...పోరుబందరు 

 

ఉందిలే ఆయనకో ..లవరు

ఆవిడే తనకంటే... క్లవరు

దూకుడుకు మాత్రం ..మస్తు హుషారు 

అందుకే ..యమా జోరు 

 

ఇద్దరికీ ....వారు (వార్ )

ప్రతి ...హవరు

పేకాటలో వచ్చిందిట ...కలవరు

దానికితోడు ..మరో జోకరు 

 

గెలుసుకున్నాడు ..సిల్వరు 

దానికోసం ..తెరిచేసాడు ..ఒక లాకరు 

దానితో ఎక్కేసాడు ...పెద్ద టవరు

గెలుసుకున్నంత ఉత్సాహంతో ...ఆస్కారు 

 

వెంటనే కట్ ..నెట్వర్క్ సర్వరు 

ఎంతకీ అవదుగా ..రిపేరు

ఎందుకో మరి ..అంత కంగారు 

పరుగులో మాత్రం ..జాగ్వారు (జాగ్వర్..చిరుత లాంటి పులి )

 

ఇష్టమైంది ..ఉలవచారు 

పూసుకుంటాడు ఎపుడూ ..అత్తరు 

వాయిస్తాడు చక్కగా ..సితారు 

వినాలంటేనే ..పరమ బోరు 

 

విప్పాడు స్నానానికని ..షవరు

చన్నీళ్ళు వచ్చేసరికి ..బాడీ మొత్తం షివరు

వచ్చింది దానితో ..ఫీవరు

దవాఖానకు పోతే చెప్పారు ..డాక్టరు 

 

చెడిందని ..లివరు 

దానికి తోడు వచ్చింది ..షుగరు 

ఇది వినగానే పెరిగింది ..బ్లడ్ ప్రెషరు 

మింగక తప్పలేదు చేదు..పసరు 

మారిపోయింది పాపం ఫేసు ...కలరు 

 

ఉన్నారు తనకి ..అందరు 

మెచ్చేది మాత్రం ..కొందరు 

అసలే తోకలేని ..బందరు 

ఎక్కడ ఉందని ..కుదురు 

 

అందుకే అయ్యింది ..తారు మారు 

అయినా సరే ..పెద్ద దేశ ముదురు 

ఎందుకు వచ్చిన తంటా ..ఇది బ్రదరు

నవ్వుకోండి సరదాగా మరి ..అందరు ...

 

|| సిరి వడ్డే || 26-03-2014

65. ఎందుకో నీకింత నిర్దయ  

 

కాలానికైనా ఉంటుందేమో కాస్తంత దయ

 నిన్ను మాత్రం వెన్నంటే ఉంటుంది నిర్దయ 

వలచి వచ్చానని చులకన నీకు 

వెలివేస్తున్నావని వేదన నాకు

 

ప్రేమిస్తూ నేను... ద్వేషిస్తూ నీవు 

విసిరేస్తూ నీవు ... విలపిస్తూ నేను 

అందరాని చందమామవే నీవని తెలిసినా 

నిన్నే ప్రేమించడం మానలేకున్నా

విసిగి వేసారిన క్షణాన శిలగానే మిగిలిపోతున్నా 

 

అనుక్షణం నీకై తపించిన కాలమంతా 

అవమానాల ముళ్ళ బాటలనే పరిచావు 

కాలకూట విషాన్నే చిందించావు 

హృదయాన్ని చిధ్రం చేస్తూనే ఉన్నావు 

మనోవనంలో చివురించిన ఊహలన్నీ 

వాడి రాలిపోతున్నాయి పసిమొగ్గలుగానే 

నేలవరుగుతున్నాయి నిరాశల కొమ్మలుగా 

కన్నీటి ముత్యాలు విసుగు చెంది జారిపోతున్నాయి 

కనుల కొలనునుండి మనోసాగరంలోనికి 

 

ఎదలోని తేనెవాగులన్నీ తరలిపోతున్నాయి 

ఉప్పునీటి అలలు తాకని మరో ఆనంద సాగరానికి 

పెదవిదాటని పలుకులన్నీ పరుగులు తీస్తున్నాయి 

మది దాచిన మౌనాల గుప్పిట గుట్టు నీకు విప్పి చెప్పాలని 

గుండె చప్పుళ్ళలో దాచిన క్షణాలన్నీ నీ ప్రేమ వాకిట తెరవాలని

 

తరలిపోయే ఋతువులన్నీ ఆశల విత్తులనే నాటి పోతున్నాయి 

సాగిపోతూ ఏరులన్నీ ఊరడిస్తున్నాయి 

నిరాశల కొమ్మన ఊగుతూ ఆశల పత్రాలెన్నో ఊరటనిస్తున్నాయి 

మారే నా కలల ఋతువులన్నిటా వసంత శోభలనే నింపుతావని 

నీ నిరీక్షణలోనే యుగాలుగా నిరీక్షిస్తున్నా . ... 

 

 

|| సిరి వడ్డే || 13-04-2014

67. నీ అడుగులో అడుగునై 

 

తొలకరివై దిగివస్తావా ?

ధరణి నేనై హత్తుకుంటా

మనోగగనంలో హరివిల్లువై విరబూస్తావా ?

నా కన్నుల నింపుకుంటా

 

మేఘమాలికవై నను చేరుకుంటావా?

చెక్కిలిపై మెరుపులనే అద్దుకుంటా

స్నేహదీపమై నను అల్లుకుంటావా?

నీ చెలిమి వెలుగులే యెద పంచుకుంటా

 

సంధ్యరాగమై నను తాకుతావా ?

నీ జ్ఞాపకాల పవనాలనే సృజిస్తా 

చిరునవ్వై రవళిస్తావా ?

పెదవులపై నిను నిలుపుకుంటా 

 

గానమై నను మరిపిస్తావా ?

మనో వేదికపై నీ రాగమే ఆలపిస్తా

పదమై నన్నల్లుకుంటావా ?

నీ అడుగులో అడుగునై నే సాగిపోతా

 

|| సిరి వడ్డే || 10-05-2014

69. నా లచ్చి జాడ...మీరైనా  సెప్పరూ ? 

 

సుక్కవై నను సేరావు 

సప్పున నా మనసే దోసావు 

ఏడని ఎతకనే లచ్చీ 

ఇన్నిఏల సుక్కల్లో నిను 

 

ఎన్నెలై అగుపించి 

దోబూసులాడకే

జాబిలివై మురిపించి 

మబ్బుల సాటున దాగకే

 

సిరుగాలై నను తాకావు 

సెలయేరై సేదతీర్సావు 

ఏ మంచు దిబ్బలనడగను 

ఆ సల్లదనం ఏదని ?

 

"కొమ్మ" వై నను ఊహల ఊయలలే  ఊపావు

ముద్దు గుమ్మవై  అందాల ఇందులే సేసావు 

ఏ కొమ్మన వాలి మురిపిత్తున్నావో

కోయిల పాటలతో జతకలిపి 

 

పూలగంధమై పరిమలించావు

ఏ పూదోట దాగినావో 

మాటల మదువులతో మామను మురిపించి 

మాయసేసి నను నీనీడగా దాసేసావు

 

నను ఇడిసి పోనని బాసలే సేసి 

ఏడ దాగున్నావో ఆదమరసి

ఏటిగట్టుకు సానమాడ బోతినంటివే

పిత్తపరిగలు బేరమాడి తెత్తనంటివే

 

ఏటిలోని సేప పిల్లనడిగా 

కొలనులోని కలువబామనడిగా 

గూటిలోని గువ్వపిల్లనారా తీసినా 

నిండు సందురున్ని సైతం నిలదీసినా 

 

జాజి మల్లెలన్ని అలిగిపోయే మాలల్లలేదేమని 

పొదరిల్లు బోసిపోయే దీపమెట్టలేదని  

పోయ్యిలోన పిల్లికూన ముడుసుకున్నదే 

కాలమేమో పగపట్టి కదలకున్నదే 

 

సెలఏరులన్నీ నీ నవ్వుల గలగలనే తలపిత్తన్నాయే 

కూనలమ్మలన్ని నీ పలుకుల తేనియలనే ఊరిత్తన్నాయే 

పూవులన్నీ నీ మనస్సులోని మమతలతో మురిపిత్తన్నాయే 

పైరు గాలి నీ యెదసొదలనే  ఇనిపిత్తన్నాయే 

 

గువ్వలనడిగితే గుసగుస లాడుకుంటున్నాయే  

మల్లెలనడిగితే మత్తుగా సొమ్మసిల్లిపోతున్నాయే 

కొండలనడిగితే కరగనైనా కరగవే

కోనలమ్మలైనా బదులీయకున్నవే

 

నిను ఇడిసి నేనుండలేనే

ఏడేడు జన్మల తోడై నాతో నడిసి రావే 

మావ మదిలో కొలువుండి పోవే 

మావ కంటి ముత్యమై గుండెలో దాగుండిపోవే

 

 

|| సిరి వడ్డే || 01-05-2014

"మా ఆసరా" గ్రూప్ చిత్రసౌరభాలు (చిత్రకవితలు)  పోటీలో విజయం సాధించిన నా చిత్ర కవితలు : 

 

66. గాజుపూలు

 

చేజారి పగిలిపోతున్నాయి

గాజుపూవులుగా, నా ఆశల సుమాలు 

విరిగిన మనస్సు, పగిలన గాజు 

అతకవని తెలిసీ, వ్యర్ధ ప్రయత్నమే చేస్తున్నా 

తెగిన మనోదారానికి ముడివేసి అతకాలనే 

 

ఎందుకో ఈ మనస్సుకు 

ఇంత తపనలు 

వెంటాడుతూనే ఉన్నాయి 

నీ జ్ఞాపకాల మరీచికలు 

 

నీ ఊసులను హత్తుకోవాలనే 

పిచ్చి ప్రయత్నంలో నను నేను కోల్పోతూ 

నీ తలపులను దాచుకోవాలనే తడబాటులో 

మది కుసుమ గుచ్చాన్నే జారవిడుస్తూ 

 

కోల్పోయిన క్షణాలకై

ఎడారి కోయిలనై వేచిచూస్తూ

సోకరాగాలనే ఆలపిస్తున్నా 

గతాన్ని సైతం కదిలిస్తూ ...  

 

ll  27-03-2014 ll    సిరి వడ్డే

 

 

68. మనో దర్పణం

 

అద్దంలోనూ నే దర్శించేది 

నాలో ఉన్న నీ రూపాన్నే 

అద్దం కూడా స్వచ్చంగా చూపేది 

నను వీడని నీ జ్ఞాపకాల ప్రతిబింబాలనే 

 

అద్దం నను మోసం చేస్తోంది 

నను పదింతలు రెట్టింపు అందంగా చూపిస్తూ 

మనో దర్పణం కూడా నను మోసానికే బలి చేస్తోంది 

నీ ప్రేమకున్న రూపాన్ని తనలోనే గుట్టుగా దాచేస్తూ 

 

నీతో వెలివేయబడ్డ నా హృదిని 

దర్పణమే అక్కున చేర్చుకున్నది

వేదన గుండెకు అయితే 

కంటి తీరాల కెందుకో ఈ తుఫాను తాకిడి 

 

అద్దం సైతం అనునయిస్తూనే ఉంది 

నా మరో రూపంలో ఉన్న నీదైన నామదిని లాలిస్తూ 

అమ్మై గుండెల్లో దాచుకోవాలనే ప్రయత్నిస్తోంది 

గుండెల్లో ప్రవహించే లావాల ప్రవాహాన్ని..... 

 

26-03-2014 ll సిరి వడ్డే ll

 

 

70. సౌందర్య లహరి

 

బాలభానుని నులివెచ్చని కిరణాల స్పర్శకు 

పులకించి పరిమళించే కుసుమ బాలలు

వయారంగా వంపులు తిరుగుతూ 

నయగారాను తలపించే  జలపాతాలు, 

 

చిగురుటాకులపై అలవోకగా జారే 

తెలిమంచు ముత్యాలు,

ఎలమావికొమ్మలపై

ఊయలలూగుతూ కువ కువల స్వాగతాలు,

 

సరిగమల స్వరాలతో సవ్వడి చేసే 

సెలయేరమ్మల  గలగలలు  

చినుకు అందెలతో చిరు సవ్వడి చేసే 

తొలకరి జల్లులు అందాలు 

 

ధరణి తల్లిని గర్వంగా చీల్చుకుని వస్తూ 

ముద్దులొలికే  బుల్లి  అంకురాలు 

వయారాలతో తీగను అల్లుకుపోతూ 

కుసుమ కాంతలు 

 

చుక్కల నీలి చీరను కట్టి 

ఏడురంగుల వడ్డానం నడుముకు చుట్టి హోయలోలికే నీలంబరాలు 

హృదిని చల్లగా సృశిస్తూ, వాసంత సమీరాల వీవెనలు

పచ్చదనాల పానుపు పై పరవశిస్తూ గరిక పూల సోయగాలు 

 

ఆహా ...ప్రకృతి కన్య యెంత సౌందర్యలహరి 

జగతిని మైమరపించే అందాల ఆమని ......

 

 ll  సిరి వడ్డే  ll   28-03-2014

 

 

 " జయనామ ఉగాది" సందర్భముగా ....

 

72. ఉగాదిలక్ష్మి

 

సిరి మువ్వల సవ్వడితో 

చిరునవ్వుల నగవులతో 

హరివిల్లుల రంగులతో  

ముంగిట రంగవల్లులతో 

 

పుట్టినింట నడయాడే   

మా ఇంటి మహాలక్ష్ములు 

వీణావాణికి ముద్దుల తనయలే

మా చదువుల సరస్వతులు 

 

షడ్రుషుల మేళవింపులతో 

మామిడాకుల తోరణాలతో  

వేపపూల వసంతాలతో  

నూరూరించే పిండివంటలతో 

తెలుగు లోగిళ్ళ సంబరాలు  

 

పట్టుపావడాలు కట్టి

మా ఇంటి ఆడపడచులు 

తెలుగింటి సాంప్రదాయం ఉట్టి పడే 

మా తల్లులు వసంతలక్ష్మికి ప్రతిరూపాలు 

 

బంగారు భవితకై

జయకేతనాలకై 

కోయిలమ్మలై ...ఆలపిస్తున్నారు 

జయనామ సంవత్సరానికి స్వరాంజలి 

ఆహ్వానాలతో..ఆమనికి స్వాగతాంజలి 

అర్పిస్తూ ..హృదయ కుసుమాంజలి ...... @ సిరి 

 

ll   సిరి వడ్డే ll  29-03-2014

 

 

74. నవ మల్లిక

 

నీ తేజస్సుకు జాబిలమ్మ సైతం నివ్వెరబోయే 

నీ పరిమళాలకు ప్రకృతి కాంత మురిసి మైమరచిపోయే 

 

నీ సౌరభాలకు మనసుపడని మగువ ఉందా ఈ అవనిపై 

మధుమాసమే వేచిచూడదా నీ రాకకై 

 

శ్వేతవర్ణానికి సైతం సవాలు తప్పదే నీ ఛాయతో 

మనస్సు మురిసి లయతప్పుతుందే నీ రాకతో 

 

స్వచ్చతకు మారుపేరై నిలిచావు 

పూదోట విరి రాణివై వెలిగేవు 

 

నీలి కురుల చేరి తారకవై మెరిసేవు 

పరిమళాల గుభాలింపులతో నవమల్లికకే దసోహమనిపించేవు 

 

సిరి వడ్డే ll 01-04-2014 ll

 

 

75. నాలో ఉన్న నిన్ను

 

ప్రేమిస్తూనే ఉంటా నిన్ను నాలో దాచేస్తూ 

నాలో ఉన్న నిన్నే సదా ధ్యానిస్తూ 

 

అనుక్షణం నీ ఛాయగా నేనే మారుతూ 

కంటికిరెప్పలా నిను కాచుకుంటూ 

 

జ్ఞాపకాల గతాలను కదిలించుకుంటూ 

ఎద గనులనుండి పసిడి తలపులను త్రవ్వుకుంటూ 

 

హృదయబింబంలో నిన్నే ప్రతిబింబిస్తూ

మది కాన్వాసుపై నీ కుడ్య చిత్రాన్నే చిత్రిస్తూ 

 

మనోవేదికపై నీ రాగాలనే ఆలపిస్తూ 

మదిఫలకంపై నీ నామమే సువర్ణాక్షరాలతో లిఖిస్తూ 

 

సప్తజన్మలు నీకై వేచి చూస్తూ ....సప్తపదులు నీతోనే పయనిస్తూ .

నీ హృదయానికి సైతం నే కాపలా కాస్తూ ....శిలగా మారైనా నీ చెంతనే ఉంటూ ..... @ సిరి 

 

ll  సిరి వడ్డే ll    07-04-2014

 

 

 

 "శ్రీరామ నవమి" సందర్భముగా .....

 

76. సీతారామ కళ్యాణం

 

వింటిని విరిచిన దాశరధి మోమున విరిసిన మెరుపుల తటల్లికలు

సిగ్గులొలికే భూమిజ చెక్కిలిపై జారెను... హరివింటి వర్ణాల సిగ్గుల సోయగాలు 

 

నీలాంభరియే వేసే పాలపుంతల ముత్యాల పందిళ్ళు 

పుడమి తల్లి పులకించి పరిచే ...తనవడినే పసుపు, కుంకుమలతో పెళ్లి పీటలు

 

శుకుడు వ్రాసే మంగళ ప్రధముగా శుభలేఖలు ..పికము సమర్పించే పట్టు పీతాంభర వస్త్రములు 

తరువులన్నీ తరించి పత్ర తోరణాలనే సమర్పించే ....వనదేవత విరుల మౌక్తికాలనే అక్షంతలుగా చల్లె

 

సంజ కేంజాయలె శుభాహారతులే పట్టగా , శరత్చంద్రికలే నక్షత్ర దిస్టినే తీయగా 

కెందామరల పరిమళాను వెదజల్లుతూ కలువభామలే తెరలు పట్టగా 

 

మకరంధాలే పన్నీటి తొలకరులై సరిగంగ స్నానాలనే చేయించగా 

తరలివచ్చెనట రాజీవ నేత్రుడు , లక్ష్మణ భరత శత్రుఘ్న సోదరులతో గూడి 

 

పరిణయమాడ ధాత్రీ జనక జనని జానకమ్మను చిటికిన వేల బంధించి మురిపింప 

అగ్నిదేముడే సప్తపదులతో ప్రదక్షిణలే చేయించగా.. వాయుదేముడే మరువపు వింజామరలనే వీచగా 

 

అంబరాన్ని తాకే పెళ్లి సంబరాలే..... అవని మురిసి ఆశీర్వదించే జానకీ రాముల జంటనే

జాబిలమ్మే పెద్ద ముత్తైదువై తారలనే ముత్యాల తలబ్రాలుగా సమర్పించే .... @ సిరి 

 

సిరి వడ్డే ll 08-04-14 ll

 

 

 

 








 

 

 

73. తింగరోడా.....

 

(1)

 

నాకు నేనే అర్ధం కాలేదు 

నాలో ఉన్న నిన్నుమాత్రం ఎలా అర్ధం చేసుకోగలను ?

నాలో నేనే ఏమేమో అనుకున్నానే అనుకో 

నాలో ఉన్న నీతోనేగా ముచ్చటించేది ?

 

నాలోనే దాగి ఉన్న నిన్ను వేరని నేనెలా అనుకుంటాను

నేను నువ్వు వేరని ఎలా అనుకున్నావు 

నాలోనే నువ్వు నాతోనే నువ్వు...మనలోనే మనం మమేకమే కదా !

నేనే నువ్వని మురిపించావు నిన్నల్లో 

 

నను నన్నుగానే  మిగిల్చావు నీ నిందలతో 

నీ మాటల మంచు ప్రవాహంలో కరిగిపోయాను 

నీ క్రోధపు అగ్నిజ్వాలల్లో మనస్సుని బూడిద చేసేసావు 

అందుకే ఆత్మకు సైతం స్నానం చేయిస్తున్నా 

వాసంత సమీరమై నను పలుకరిస్తావని ......@ సిరి 

 

ll సిరి వడ్డే ll    06-05-2014

 

(2)

 

అందరికీ నచ్చేలా ఉండాలనే అనుకుంటాను 

కొందరికైనా నచ్చే ప్రయత్నమే చేస్తున్నాను 

ఎందరికో నచ్చుతూనే ఉన్నాను 

నాకు నచ్చిన నిన్ను మాత్రం మెప్పించలేకున్నాను

 

ఆనంద తరంగాలపై ఊరేగించేది నీవే 

శోక సంద్రాన ముంచేసేది నీవే

సంతోషపు వెలుగుల్లో నీ కలల కౌముది లెన్నో

దుఃఖపు నిశీధిలో నిట్టూర్పుల యామినిలెన్నో 

నువు పరిచయిస్తూనే ఉన్నా ...

 

నచ్చినవారు కసురుకున్నా ..

కనుపాపల్లో దాచుకున్నా మురిపమేనని

నీ పరిచయంతోనేగా నా మనస్సు పసిగట్టింది 

నా మనసే నీదైన వేళ.. నిను వీడిపోవడం..సాధ్యమేనా ?

అర్ధం చేసుకోవేమి ..తింగరోడా.....@ సిరి 

 

ll సిరి వడ్డే ll    07-05-2014

 

(3)

 

అనుక్షణం ఒకే కోరిక 

నిను పరిచయించిన క్షణం వద్దే కాలం ఆగిపోవాలని 

ఏ క్షణమైనా తీరని ఆశే ..నా మానస వీణియపై 

నీ స్వరాన్ని పదే పదే పలికించాలని 

 

సుమకాంతలన్నీ పరిమళిస్తున్నాయి 

నీ పెదవులపై సిరి నగవులై విరియాలని 

కోకిలమ్మ అలుకలు పోతోంది 

నీ స్వరంతో  పోటీ పడలేనని 

 

మేఘమాలిక వేచి చూస్తోంది 

తొలకరి జల్లై నిను తాకాలని 

ఇంద్రచాపం మైమరుస్తోంది 

నీ కన్నుల వెలుగులనద్దుకోవాలని

 

వాగులన్నీ ఉలిక్కి పడుతున్నాయి 

నీ మాటల గల గలల సవ్వడికి 

కొండలన్నీ శృతి కలుపుతున్నాయి 

నీ పద రవళులతో కలిసి 

 

అణువణువూ నువ్వే నిండావని 

తలచే హృది మొరవిన వెందుకనో 

అడుగడుగునా నిన్నే నింపుకుని 

అలసి సొలసిపోయే మది ఘోష (బాస) 

పట్టదు ఎందుకనో ..తింగరోడా ....@ సిరి 

 

ll సిరి వడ్డే ll 09-05-2014

 

(4)

 

ఏమి మత్తు చల్లావో ?

నీ మాటల మాయలతో ..

ఏమి మాయలే నేర్చావో ?

నీ గడుసరి కనుసైగల గారడీలతో 

 

మనోవనమంతా కుసుమించేది 

నీ జ్ఞాపకాల సుగంధాలే

మనో వాకిట వెల్లివిరిసేది

నీ కలల రంగవల్లికలే 

 

నచ్చినవారెంత దూరాన ఉన్నా 

మదికెపుడూ చెరువేనని 

ఎంతగా చెప్పినా నమ్మవేమిరా కన్నా?

మదినేలే యువరాజువి నీవేరా తింగరోడా ...@ సిరి 

 

ll సిరి వడ్డే ll    10-05-2014

 

(5)

 

మనస్సుకెంత మొండితనం నేర్పావో ?

నీ నీడగా మారి నీ వెంటే తిరుగుతూ 

నా వైపే రానని మొండికేస్తోంది 

 

వయస్సుకేమి గారాలు నేర్పావో ?

తలపుల తేనెల జలపాతాలే 

నాయగారాలుగా జారిపోతున్నాయి 

 

నీ ఊసులే హిమపాతాలై

మదిని తాకుతూ చల్లగా 

పులకింతలు లేపుతున్నాయి... కన్నా 

 

ఊహలన్నీ చిలిపి మలయమారుతాలై 

చెక్కిలిపై గిలిగింతల స్వరాలే మీటుతున్నాయి

అపుడే గాయాలను రేపుతావు 

వెనువెంటనే అనునయాల పూతలు పూసేస్తావు 

 

ఇంతలోనే దోచేస్తావు హృదయాన్ని 

అభిమానపు వెన్నలనే పంచేస్తావు 

 

తింగరోడా ...........

ఎలా చెప్పాలి నీకు , మదినేలే యువరాజువు నీవేనని ...@ సిరి 

 

ll  సిరి వడ్డే ll   11-05-14

 

(6)

 

వెన్నెల నౌకలపై ఊరేగిస్తావు 

కన్నుల వెన్నెలలే నింపేస్తావు 

కలల మేనాలో ఊరేగిస్తావు 

ఊహల ఊయలలో ఊపేస్తావు

 

వలపుల మధువులనే వలికిస్తావు 

మాటల తేనియలే చిలికిస్తావు 

సంతోషపు అలలపై తేల్చేస్తావు

ఆనందపు సాగరంలో ముంచేస్తావు 

 

తింగరోడా...

గుండెల్లో నీ స్థానం పదిలమని...చితిలో కూడా కాలదని అర్ధం చేసుకోవేమి ? @ సిరి 

 

ll  సిరి వడ్డే  ll   12-05-2014 

 

(7)

 

సిగ్గుల ముసురులేవో ముసురు కుంటున్నాయి 

ఎదలోని సొదలన్నీ తెలి మేఘాలపై పయనిస్తున్నాయి 

వలపుల తొలకరులేవో మదిని మురిపిస్తున్నాయి 

ఊసుల చినుకులేవో చిటికెలతో సవ్వడి చేస్తున్నాయి 

ఊహల హరివిల్లులే రంగుల కలలై హత్తుకుంటున్నాయి 

 

ఏ మేఘ సందేశాలకై వేచి ఉన్నావో ?

ఏ హంస రాయబారానికై ఎదురు చూస్తున్నావో?

ఏ పావురాయి ఉత్తరాలకై ఆదమరిచావో ?

మనో పుస్తకమంతా ..నీ ఊసుల లేఖలతో నింపుకున్నా ..

 

తింగరోడా...

ఎంతని చెప్పాలి ఎదలోపలి సంగతి ?  

ఏమని విప్పాలి మదిలోపలి అయోమయ పరిస్థితి ? @ సిరి 

 

ll సిరి వడ్డే ll   13-05-2014

 

(8)

 

వెలివేస్తూనే ఉంటావు ..హృదయాన్ని 

నిన్నెంతగా ఆరాధిస్తున్నా 

ఏమైనా అంటే అలుగుతావు 

ఏ కారణం లేకున్నా..

అడిగితే ముద్దంటావు..ఎంతైనా .. 

 

ఆనందానికి వర్ణాలను అద్దగలవా ?

జ్ఞాపకాలకు పరిమళం వాడిపోతుందా ?

కదిలే ఊహలకు హద్దులు ఉంటాయా ?

సంతోషాలకు అవధులు గీయగలవా ?

 

ఒక్క సారి ప్రేమించానని చెప్పు మనస్పూర్తిగా 

కోటి జన్మలు తోడై ఉంటా, నీ నీడకు సైతం జతగా 

నీ స్నేహంలో మైమరచి పోవాలని ఉంది

అందరాని చందమామవని తెలిసీ ..

ఆశపడుతూనే ఉంటుంది నా మది, ఎగసి ఎగసి పడే అలల జవ్వనిలా ...

 

తింగరోడా.....

ఒక్కసారి కంటి బాసలు లిపిని అర్ధం చేసుకోవూ .....@ సిరి 

 

 

ll  సిరి వడ్డే ll   20-05-2014

 

(9)

యెదలో లిఖించుకున్న చిరునామా చెరిగిపోతోంది
మదిలో మౌనంగా ముద్రించుకున్న ప్రేమ సౌధం కూలిపోతోంది
వసివాడని పరిమళమైన విరుల మైత్రీవనం వాడిపోతోంది
హృదయ స్పందన లయ తప్పి అలసిపోతోంది

వాన ఇంకిపోయిన మేఘంలా
కన్నీటి చినుకులతో తడిచిన చెక్కిలిలా
జాబిలి లేని రేయిలా
తంతి తెగిన వీణియలా
రాగం పలుకని పిల్లన గ్రోవిలా
మది మూగబోతోంది మౌన స్వరాలతో

నిదురించే కనులమాటున కలవై వస్తావనుకున్నా  
వెలుగు చీకటులకు నిచ్చెన వేసే జలతారు వెన్నెల దివికై వేచి ఉన్నా
భావాలన్నీ మనస్సులోనే బంధిస్తున్నా
గుండె లయలతో ప్రతిధ్వనించే రాగాలెన్నో ఆలపిస్తున్నా

తింగరోడా .....

ఆలకించవెందుకో...ఈ అలసత్వం దేనికో ?
ఎప్పటికీ అర్ధం అవుతుందో నా హృదయ ఘోష నీకు

ll  సిరి వడ్డే ll   09-06-14

(10 )

చీటికి మాటికి అలిగేస్తావు
నాకు తెలియదా ?
అనునయాల వడిలో పవళించడం నీకిష్టమని

అలిగిన వేళలోనేగా ...
మురిపించే నీ అందాలతో
నే ముద్దులమూటలు కట్టుకునేది

కనుసన్నలలోనే మెలగాలంటావు
కనుమరుగైతే రబసల పాలుచేసేస్తావు
నా కన్నుల దివ్వెలుగా వేలిగేవి నీ నవ్వులేగా,

"సిరి"మల్లెల చెండులెన్నో విసిరేస్తావు   
కనుసైగలతోనే  కట్టిపడేస్తావు
నా కనులకు తెలియని మౌనబాషలెన్నో నేర్పిస్తావు   

తింగరోడా....

పదిమందితో చెలిమి కూడదని మూతి ముడుస్తావు  
ఎందరున్నా  నా హృదయంలో... పదిలంగా
దాగుండిపోయింది నువ్వేనని
ఎంతకీ అర్ధం చేసుకోవెందుకని ? ......@సిరి

ll  సిరి వడ్డే ll 20-06-2014

(11)

వలపు వంతెనలేవో వేసేస్తావు
పదంతోనే ప్రణయరాగమాలపిస్తావు
మాటలతోనే మత్తులు జల్లేస్తావు
నవ్వులసుమాలతో పరిమాళాలనద్దేస్తావు


నీ పలుకుల సవ్వడికేమో
మదిమువ్వ రవళిస్తోంది
నీ అలికిడి విందేమో
గుండెగూడు గువ్వై విహరిస్తోంది

మానసవీణియకెన్ని మౌనస్వరాలో
తలపుల భూపాలరాగమేదో శృతి మీటుతుంటే
నీ వలపు గాలుల వీవనలతో, ఊహలే ఊపిరిలూదుతుంటే
మదివేదికపై పరిణయగీతికలెన్నో  

తుంటరి తూనీగై విహరిస్తోంది మది గతితప్పి
కులుకుల నర్తనలేవో అభినయిస్తోంది మనస్సు పురివిప్పి
వలపు తేనెల జల్లుల తడిచిపోతోంది తనువు మైమరచి
మధుమాసపు లగ్గాలేవో సైగలు చేస్తున్నాయి తొందరచేసి  

కలలకు సంకెళ్ళే వేస్తున్నా
మనోగవాక్షానికి సిగ్గుల పరదాలే మూస్తున్నా
జ్ఞాపకాల బరువు మోయలేక సతమత మౌతున్నా

మందమతి తింగరోడా
మురిపింప రావేలరా చిన్నోడా ... ...@సిరి

ll  సిరి వడ్డే ll  21-06-2014

(12)

జ్ఞాపకాలకేమి నచ్చచెప్పావో
జారిపోతున్నాయి కన్నీటి పూలుగా
ఆశలనెలా అనునయించావో
వాడిపోతున్నాయి పసిమొగ్గలుగా

నిట్టూర్పులనెలా జోకొట్టావో
కరిగిపోతున్నాయి కలతల స్వప్నాలుగా
ఊహలకేమి జోలలు పాడావో
ఊకొడుతున్నాయి (గ)మత్తుగా

తలపులకేమి నూరిపోసావో
సద్దుమణిగి పోతున్నాయి ప్రశాంత గౌతమిలా
ఊసులకేమి మత్తు జల్లావో
ఊపిరైపోతున్నాయి నీ వాయులీనాలుగా

వలపులనెలా  బుజ్జగించావో
మైమరచిపోతున్నాయి
నీ గారాలా మారాములుగా

పట్టదేమిటి నీకేదీ  తింగరోడా ?  

మమతలు వెన్నలనే పూసేస్తావు...
మాటల మధువులతో దోచేస్తావు
మదినెంతగా మాయ చేసినా ...  
నాకు ముద్దుల మా రాజువేగా... ...@సిరి

ll సిరి వడ్డే ll 23-06-2014

(13)

నీలిమబ్బు మేలిముసుగు మాటున దోబూచులాడే
వెన్నెలరేడువు నీవు,
మనోవనంలో పరిమళించే వలపు సుమానివి నీవు,

మది తోటలో ఆలపించే ఎల కోయిలవే నీవు,
ఊహల జగతిలో ఊయలలూపే చిలిపి స్వప్నమే నీవు,

హృది కోవెలలో వెలుగులు చిందే ఆశల దివ్వెవు నీవు
ఆణువణువూ రాగరంజితం చేసే శ్వాశల వేణువు నీవు,

నా కలల కావ్యంలో కదలాడే పద లాస్యమే నీవు
నయనపు వెలుగుల్లో ఉదయించే సుప్రభాత కిరణమే నీవు,
 
తింగరోడా.....

ఎంతకాలం నాకీ నిరీక్షణ ?

ఆశల తీరమై వేచిఉన్నా
ఊహలన్నీ  అలలై ఎగసి ఎగసి పడుతుంటే ....@సిరి

 

(14)

మనోగగనమంతా తిమిరపుతెరలెన్నో పరుచుకుంటున్నాయి
నా వెన్నెలరేడుని జాడ లేకుంటే,

స్వప్నలోకమంతా చిన్నబోతోంది
కలలన్నీ అల"జడులై" ఎగసిపడుతుంటే,

ఎదకోయిల మూగ బోతోంది
ఆశల ఆమని తరలిరాని వసంతమౌతుంటే,

నీలి మబ్బులన్నీ వలస పోతున్నాయి
నీ ఊసుల తొలకరులు కురవకుంటే,

వినీలపు మేఘమాలికలు మెరుపులనే మరచిపోతున్నాయి
నీ నవ్వుల వెలుగుల కనుమరుగౌతుంటే ,

తింగరోడా ...... ఆలకించాలనే ఆశక్తే ఉండదు నీకెందుకనో !!

కనురెప్పలను వేయడమే మరిచా ...
నువ్వెక్కడ కనుమరుగైపోతావోయని ....@సిరి

ll సిరి వడ్డే ll 07-07-2014

(15)

నీ పద లహరులకేమో ...
అరమోడ్పులౌతున్నాయి....నయనాలు,

నీ పలుకుల  లయ విన్యాసాలకేమో ...
రవళిస్తున్నాయి  ...హృదయస్పందనలు,

నీ ఎదసడుల జతులకేమో ....
నర్తిస్తున్నాయి ...పెదవి అంచున వాలిన మౌనాలు,

నీ కంట వెలిగే కాంతులకేమో...
మనోగగనమంతా మెరిసిపోతున్నాయి  ...మమతల  తారాదీపాలు ,

నీ పదముల సవ్వడులకేమో ...
ఎదకన్నుల్లో ఉప్పొంగిపోతున్నాయి  ... పన్నీటి  కెరటాలు,

తింగరోడా.....

ఆలకించవెందుకనో!
ఎదగూటిలో  ఆలపించే వలపు గువ్వల రాగాలను ..
మదికోనేట పరిమళించే ఊహా కలువల విన్నపాలను ...@సిరి

ll  సిరి వడ్డే ll   09-07-2014

(16)

ఎదలోతుల్ని స్పృశిస్తావు
వాసంత సమీరమై,

ఊసుల తేనియలెన్నో అద్దేస్తావు
మదిలో మెదిలే తీయనిజ్ఞాపకమై,

మనోవేణువుకెన్ని గారాలను నేర్పావో   
వలపుల(మమతల) గేయాలెన్నోపలుకుతోంది

భావాల జగతికేమి ఆహ్వానం పంపావో
మాటలకందని మౌనాలతోనే లిఖిస్తోంది,

మైమరపుల పులకింతలెన్నో
నీ మాటల మాయలోపడి,

ఆదమరుపుల వలయాలెన్నో
నీ కవ్వింతల ఆయస్కాంతాలకు చిక్కి,

తింగరోడా ....

ఎలా చెప్పను ?

గమ్మత్తు నీ మాటలో ఉందో,
మరి మధువొలికే నీ పలుకుల(పెదవి) మోవిలో ఉందో ...@సిరి

ll  సిరి వడ్డే ll    12-07-2014

(17)

నువ్వెవరని పరిచయించను ?
నాలోని నిన్నే చూపిస్తూ ...మురిపించే, మనోదర్పణానికి,
నేనెంతని లాలించను ?
నీకై తపిస్తూ ...తన్మయత్వంతో తబ్బిబ్బయ్యే హృదయానికి,

మది పొత్తిళ్ళలో నిను పసిపాపగా లాలిస్తూ  
మురిసిపోతోంది హృదయం,
అనుక్షణం నీకై తపించి, నిన్నే జపిస్తూ
సొమ్మసిల్లిపోతోంది మానసం ,

వలచి వచ్చాననేగా,  నీకింత అలుసు?
అతిగా ఆశ పడిందేమో, మనస్సుకి మాత్రం ఏమితెలుసు,
"సిరి" లేనిదాననని ఎగతాళి నీకెందుకు ?
గడసరి మగసిరి నీకుందిగా ? ఒకటయ్యేందుకు,

తింగరోడా....

బ్రతిమాలించుకోవడం నీకు ఇంత వేడుకా ?

ఆశలన్నీ కనురెప్పల మాటునే దాచేసి,
ఊహలన్నీ ఎదలోతుల్లో బందీలుగా చేసి,
నిరపరాధినే, మదిగదిలో శిక్షను అనుభవిస్తూ...
ప్రేమఖైదీనే ఎప్పటికీ ....నీకై తపిస్తూ ...@సిరి

ll సిరి వడ్డే ll 17-07-2014  

(18)

పరువం పైట వేసింది మొదలు....
ప్రేమరాగాలను ఆలపిస్తూ... చుట్టుముట్టే మత్తకోకిలలెన్నో,
ఏ ప్రౌఢకోయిల ప్రణయగీతికా ఎదను మీటలేదెందుకనో ?

యవ్వనసుధలను పసిగట్టేస్తూ...
వలపు ఝూంకారాలను మీటేస్తూ..తుంటరి తూనీగలెన్నో
ఏ బ్రమరనాదం చెవిని తాకలేదెందుకనో ?

కన్నెకలువను కవ్విస్తూ....
వెన్నెలజల్లులను కురుపిస్తూ... కనుగీటే చుక్కలరేడులెందరో
పొంగిపూసే మదిని దోచలేకపోయారెందుకనో ?

ఎలా పసిగట్టిందో హృదయం ...నీ పదసవ్వడిని
నటనమాడుతోంది మురిపిపోతూ,
ప్రణయనాదపు గమకాలనే మీటుతూ,
మదికింత పరవశాన్ని నేర్పింది నీ పరిచయమెందుకనో ?

మనోతీరాన్ని దాటి పొంగే ఉప్పెనంత ప్రేమని ...
మనోవనమంతా పరిమళించే ప్రణయసుగంధాన్ని...
మనోవీణియను మీటేసే నీ స్వర గంగాప్రవాహాన్ని  ...

తింగరోడా.....

ఆపడం సాధ్యమా ?
ఎందరు నిను ఆరాధిస్తున్నా...
ప్రేమించలేరుగా నాలా ..ప్రాణంతో సమానంగా ...@సిరి  

ll సిరి వడ్డే ll 21-07-2014

 

(19)

 

మనసుతీరా ఊసులాడినా 

ముద్దే తీరదు ఎందుకనో, 

మమతల మరువాలనే నింపుకుంటూ 

 

సొమ్మసిల్లిపోతుంది మది దేనికనో, 

కనుపాపలమాటున దాగుండిపోయి 

కలగానే దోబూచులాడతావు..... నీకేమి పనో ?

 

అసలు ఎందుకు వచ్చావో ?

నా జీవన గమనంలోనికి 

ఏమి చెప్పి మరిపించావో ?

 

నా నీడను సైతందింపేసి, ముగ్గులోనికి 

ముడిపడిపోయావు జ్ఞాపకాలనే పెనవేసి, 

అల్లుకుపోయావు, మమతలనే ముడివేసి, 

 

కనుమరుగైపోతావు ఎందుకో, ఎదనే ఏమార్చి 

తింగరోడా....

నా శ్వాస నీవే , నా ధ్యాస నీవే

 

మదికిన్ని సిగ్గులు నేర్పిందీ నీవే 

ఊరేగుతూ రావేలరా ..ఊహల రధం పై ....@సిరి 

 

ll సిరి వడ్డే ll 28-07-2014

 

( 20 )

 

పరిమళించాలనుంది

నీ పెదవులపై విరిసిన కుసుమాన్నై

స్పృశించాలనుంది

నీ చెక్కిలిని తాకే శీతలసమీరాన్నై,  

 

ప్రతిధ్వనించాలనుంది

నీ ఎదకనుమలలో మధురగానాన్నై 

కుసుమించాలనుంది 

 

నీ కనుల కొలనులో కలువభామనై 

ముద్దాడాలనుంది

నీ తనువును తాకే స్వాతిజల్లునై

 

కలుసుకోవాలనుంది 

నీ చెదిరిపోని స్వప్నానై

జారిపోవాలనుంది

 

నీ కంటజారే ముత్యాన్నై 

హత్తుకోవాలనుంది

అల్లుకున్న నీ గాధనై

మిగిలిపోవాలనుంది... 

 

తీరిపోని ఋణాన్నై

మాసిపోని మమతనై 

అలుపెరుగని జ్ఞాపకమై 

వీడిపోని బంధానై,

తింగరోడా ....

 

చిరునవ్వులతోనే జరిమానాలు వేసేస్తావెందుకనో?

మాటల మధువులతోనే మైమరిపిస్తావు దేనికనో ...@సిరి 

 

 ll సిరి వడ్డే ll  31/07/2014

 

(21)

 

హృదయకమలం త్యజిస్తోంది 

పరిమళగంధాన్ని

నీ నవ్వుల జల్లుల జాడలేదని 

 

మనోవనమంతా మూగబోతోంది

వసంతాన్ని విడిచి 

కోయిలవై నువ్వు వాలలేదని 

 

మదిచైత్రం చిన్నబోతోంది 

తననుతాను మరిచి

నీ చిద్విలాసపు చిత్తరువులేవీ కానరాలేదని

 

వలపు విరులన్నీ సొమ్మసిల్లిపోతున్నాయి 

మకరంధాలను విడిచి

నీ పలుకుల ముధువులు జాలువారవేమని 

 

మౌనాలన్నీ తరలిపోతున్నాయి  

మదిమాటున తోబూచులు మానేసి  

మాఘమాసపు ఊసులే తీయవేమని 

తింగరోడా ......

 

బ్రతకాలనే ఉంది ...అచ్చంగా నీ కోసమే ...

నను నేను మరచి, నువ్వే నిండిన మదిగూటిలో వదిగి వదిగి .....@సిరి 

 

ll  సిరి వడ్డే ll  05/08/2014

 

(22)

 

మదికి ఎంత సంబరమో !

తనలో మెదిలే ప్రతి భావాన్ని 

నీకు ప్రేమలేఖగా మలచాలని,

 

ఆదమరచి నిదురోయే 

నీ కనురెప్పలపై చిరుముద్దులీయాలని,

నీ జిలుగు చెక్కిలిపై సుతారముగా 

 

జారిపోయే జాబిలమ్మ నవ్వాలని 

కలలో మైమరచి నవ్వుకునే 

నీ పెదవులపై చిరునవ్వునై మిగలాలని ,

 

నీ కంటి దివ్వెలలో

వెలిగే ప్రేమజ్యోతులవ్వాలని 

ఊసుల మరులతోటలో

 

విరి,తావులమై అల్లుకోవాలని,

ఎందుకురా చిన్నోడా ....

నా కలలవాకిట రంగవల్లివై అల్లుకుపోయావు ?

నీ ఊసుల పన్నీటి కళ్ళాపులనే జల్లిపోతావు?......@సిరి 

 

ll  సిరి వడ్డే ll   12-08-14

 

(23)

 

వెన్నెలమామను చూస్తే

మచ్చలేని నీ రూపే కనిపిస్తుంది 

మరుమల్లెను పలుకరిస్తే 

 

స్వచ్చమైన నీ పిలుపుల పరిమళమే తాకుతుంది 

సెలయేటిలోని ప్రతి బిందువు 

నీ మాటే పలుకుతోంది 

 

వనంలోని ప్రతి తరువు 

నీ నవ్వుల పూలనే తురుముకున్నది

తనువుకెంత దూరంలో నీవున్నా 

 

మదికి నీవెపుడూ చేరువనే  

నా ఊహలలోనే జీవిస్తూ 

నా ప్రాణంలో ఊపిరై శ్వాసిస్తూ 

 

చిరుగాలుల సవ్వడిలో, సిరిమువ్వల రవళిలో

సెలయేటి నురగలలో, చిరుగాలి తరగలలో

పసిపాపల నవ్వులలో, వసివాడని పూవులలో

 

తొలి సంధ్యపు వెలుగులలో, శరత్చంద్రికలలో

మాయచేస్తూ చిన్నోడా .....

అనుక్షణం  స్పృశిస్తూనే ఉంటావు వెన్నెల వెలుగువై

 

 

కనుమూసి తెరిచేలోగా కనుమరుగైపోతావు మనసును దోచిన దొంగవై ....@సిరి 

 

ll  సిరి వడ్డే ll   23-08-2014





 


100. మా పల్లె లోగిళ్ళు

తొలిపొద్దు పొడుపులోని
బాలభానుని అరుణ కిరణాల అలికిడితో
హొయలొలుకుతూ కరిగిపోయే
తెలి మంచుపరదాల మాటున మా పల్లె అందాలు

తెలతెలవారే వేకువలో
గాలిపాడే సంగతులకు పులకరించే తరువులు
చిగురుటాకులపై అలవోకగా జారిపోతూ
మంచుముత్యాల సోయగాలతో మెరిసిపోయే పత్రాలు

సుప్రభాతవేదికపై కువకువల మేల్కొలుపులు
ముసిముసి నగవులనే విరులుగా అలంకరించుకునే
సుమలతల పరిమళాలు
పులకింతల గమకాలతో విచ్చుకుంటూ ముద్దు పూబాలలు

పచ్చదనాల పానుపుపై ముత్యాల కూర్పులతో
మురిసిపోతూ గరికపూల సోయగాలు
స్వాతిచినుకుల చిరుజల్లులను హత్తుకుంటూ ధరణి మురిపాలు
తూరుపు కనుమలనుండి తొంగిచూస్తూ దినకరుని దోబూచులు

మంగళవచనాలతో శుభాలు పలుకుతూ
గణగణ స్వరాలతో మ్రోగే కోవెలగంటలు
మెళ్ళో గంటల రవళులతో పరుగులుతీసే బసవయ్యలు
తెల్లారకముందే తట్టిలేపుతూ మా పల్లె తల్లి ఆత్మీయతలు

అభిమానం, అనురాగం చిగురిస్తూ చిరునవ్వుల సంబరాలు
బంగారు పంటలతో తులతూగే హృదయాలు నిండైన హేమంతాలు
మా పల్లెలోని ప్రతి ఇల్లు నిత్య వసంతాలు
వచ్చీ పోయే అతిధులే మా పల్లెకు కదిలే ఆనందాలు

ఝుమ్మంటూ యెదను మీటుతూ అల్లరి భ్రమరాలు
కొలను నిండుగా పొంగి పూస్తూ చెంగలువ కుసుమాలు
నీటి ముత్యాలతో సయ్యాటలాడుతూ తామరాకుల పరవశాలు
చూరులవెంట జారిపోతూ వడివడిగా సాగిపోయే వాననీటి వయారాలు

వానజాన కురులజాలువారే చినుకు ధారలను వడిసిపడుతూ
మా ఇంటి మండువాలోగిళ్ళు
తుళ్ళుతూ ముంగిట రంగవల్లులకు హరివింటి వర్ణాలను అద్దే మా పల్లె పడతులు
ఆడుతూ పడుతూ వరిమడులను నాటుతూ మా పల్లె పాడే జానపదాలు
ఆదమరచి నాగలి దున్నే రైతన్నలు, అలుపెరుగక చెమటోడ్చే కూలన్నలు

పాడిపశువుల గుమ్మపాలు పంచుతూ గోపన్నలు
మా పల్లె పడుచులాడే చింతపిక్కలు, సీతాదేవి వామనకుంటలు
పచ్చని తోరణాలతో మా పల్లె పలికే మమతల స్వాగతాలు
పసుపుగడపల శోభలతో మా పల్లె సీమలు పలికే ఆహ్వానాలు
దేశ సౌభాగ్యానికే పట్టుగొమ్మలు

పసిపాపల మారాలు, పల్లె తల్లుల అనునయాలు
అంబరాన్ని అంటే పండుగల సంబరాలతో ఏకమయ్యే మా పల్లె మనసులు
హైలెస్సా అంటూనే అలల పై సాగిపోతూ మా జాలరుల నావలు
నవ వధువులను మెట్టినింటికి సాగనంపుతూ కనుమరుగైపోయే గూడుపడవల జాడలు

తీయని జలాలతో ఊరి ఉరికి పొంగి పోయే బావి గట్టులు
గ్రీష్మ తాపాన్ని చల్లబరుస్తూ ముంజెలు, కొబ్బరి బొండాలు
అదృశ్య మైపోతూ మల్లె లాంటి స్వచ్చమైన పల్లెటూరి మమతలు
కధలుగానే మిగిలిపోయే మా ఊరి ఏరువాకలు

జ్ఞాపకాలై తడుముతూ గ్రామదేవతల జాతరలు
నవసమాజానికి కనుమరుగై పోతూ పల్లెల సోయగాలు
చరిత్రలోనైనా పాఠాలుగా మిగిలిపోయేనా పల్లెటూరి అందాలు?
వీడిపోని బంధాలుగా మిగిలేనా మా పల్లెవాసుల మమతల కోవెలలు?

ll సిరి వడ్డే ll 02-06-2014 ll




104. చిట్టి గుండెకెన్ని తపనలో

తరువులన్నీ ఋతువులను మరచి
వసంతపు శ్రీమంతాలే జరుపుకోవాలని  
విరిబాలల బోసినవ్వులతో
వడిని నింపుకోవాలని,

మధుపాలను అదిలించైనా
మధువుల కడవులను నింపుకోవాలని
తేనెటీగల వాకిట తేనెల కళ్ళాపి జల్లి
మురిసిపోవాలని, తీయందనాల అలలపై తేలిపోవాలని,

పేద గరికల చెంత చేరి
ఊసులెన్నో చెప్పుకోవాలని
గడ్డిపూలతో జతకలిపి ఆడిపాడాలని
అడవిపూల సోయాగాల గుట్టువిప్పాలని,

పూలపుప్పొడులెన్నో దోసిలి పట్టి
రాసులుగా పోయాలని
రాలిపోయే పత్రాల జాలి కధలన్నీ
కంటి ముత్యాలుగా వడిసి పట్టాలని,
చిగురుల పురిటి కందులకు లాలపోయాలని,

మిణుగురులనేరి గుట్టలుగా పోయాలని
మెరిసే జాబిలమ్మతో పోటీకి పెట్టాలని
వెన్నెలరేడుతో వీధి దీపమెట్టాలని
మెరుపులమ్మ తళుకులన్నీ మెలిపెట్టి
హరివింటి పొదరింటికి
కాపలా కంచెగా  కట్టాలని ,

వెన్నెల కన్నెతో కలిసి నర్తించాలని
శారద యామినిలో పులకించాలని
పున్నమి నదిలో విహరించాలని
శరత్చంద్రికల తోరణాలెన్నో కట్టాలని,

మాపులపై దోబూచులాడే
చిరుగాలుల సంగీతాలతో జతకలిపి పాడాలని
కాకమ్మ గూటిలో ఊయలలూగే
కూనలమ్మ తొలిపలుకులతో బాణీలే కట్టాలని ,

పడుచు గువ్వల కువకువల రాగాలెన్నో
చైత్ర వేదికపై శృతి చేయాలని
కలహంసల వయారి పాద సవ్వడులన్నీ
"సిరి" మువ్వలకే రవళులుగా శృతి చేయాలని,

పూల నెత్తావుల అత్తరులన్నీ
పన్నీటి కల్లాపిగా చల్లేయాలని
మకరంధపు అలలపై తేలిపోయే గడుచు తుమ్మెదల
సోగకన్నుల చిత్తరువులెన్నో చిత్రంగా మలచాలని,

మేఘమాలికనే కాటుక రేఖగా దిద్దుకోవాలని
బాలభానునే కస్తూరిగా అద్డుకోవాలని
సంజకెంజాయిలనే లత్తుకగా పాదాలకు  పూయాలని
వెన్నెలమామతో  గారాలరాగాలెన్నో పాడుకోవాలని.....@సిరి

ll  సిరి వడ్డే ll  22-06-2014



107. మైత్రీ వేణువు 

కాగితంతో కలానికున్నది
సాహితీ బంధం,
వనంతో పికానికున్నది  
అను"రాగ" బంధం,

మల్లెతో మధుమాసానికున్నది
వసంతాల బంధం
జాబిలితో  రేయికున్నది
వెన్నెల బంధం,

సుమంతో  భ్రమరానికున్నది
మధువుల బంధం,
మాధవునితో, రాధమ్మకున్నది
ఆ"రాధ"నా బంధం,

సంద్రంతో తీరానికున్నది
అలల బంధం,
గగనంతో  భువనానికున్నది
ఆత్మీయ బంధం,

నీలాంబరితో  హరివింటికున్నది
సప్తవర్ణాల బంధం,
విరితో  తరువుకున్నది
పరిమళాల బంధం

అధరాలతో మధువులకున్నది
ప్రణయ బంధం,
నయనానికి, హృదయానికున్నది
కలల బంధం,

గిరితో ఝురికున్నది
జలధారల బంధం,
కలువతో  చంద్రునికున్నది
వలపు బంధం,

మురళితో రవళికున్నది
ఆలాపనల బంధం,
పదంతో పాదానికున్నది
నర్తన బంధం,

"శ్రీ"  తో
"లక్ష్మి" తో
"సిరి" మా లక్ష్మికున్నది
పవిత్ర మైత్రి బంధం,
 
మీతో నాకు
నాతో మీకు  
ఉన్నది మాత్రం .... ఆత్మబంధం .......@ సిరి

ll  సిరి వడ్డే ll  05-07-14


(ప్రియనేస్తాలు శ్రీ బాబుకి, శ్రీ లక్ష్మికి ఈ కవిత ఆత్మీయంగా అంకితం)




110. తింగరి బుచ్చి

పాడితే శిలలైనా కరగాలన్నానని
రాళ్ళన్నీ పోగేసుకుని, కచేరీ మొదలు పెట్టేసింది,

గుండెగూటిలో గువ్వవే నీవన్నానంతే
పక్షి బాషను తెగ సాధన చేసేస్తోంది,

హృదయమంతా నువ్వే నిండావంటే
చిన్నగుండెలో ఎలా పట్టానని తెగజుట్టు పీక్కుంటోంది,

మది కాన్వాసుపై నీ చిత్రాన్నే గీసుకున్నానంటే  
ఫోటో తీసి చూపించమని  గోలచేసేస్తోంది,

ఇన్నాళ్ళకు నీళ్లోసుకుందని మురిసిపోతుంటే
రోజుకు రెండుసార్లు  పోసుకుంటున్నానని తెగ దీర్ఘంతీస్తోంది,

మంత్రాలకు చింతకాయలు రాలతాయంటే
పచ్చడి పెట్టుకుందాం మంత్రంవేయమని చింతతోపుల్లోకి తోసేస్తోంది,

మూడుముళ్ళు, ఏడడుగులు కలిపి నూరేళ్ళన్నానని (3+7=100)
ప్రైవేటుకోసమట, లెక్కలమాస్టారును వెంటేసుకోచ్చింది,

బోసినవ్వులంటే నాకు ప్రాణం..... అనగానే,
మొత్తం పళ్లన్నీ పీకించుకొచ్చేసింది,

నీ తలపుల జల్లుల్లో తడిచిపోతున్నానంటే,
పడిశం పట్టేస్తుందని విసుక్కుంటోంది ....తింగరి బుచ్చి..... @సిరి

ll  సిరి వడ్డే ll   16-07-2014





 

8. ఏ నావదేతీరమో 

 

పసితనపు ఛాయలతో 

వసివాడని స్మృతులతో 

కల్మషమంటని నిర్మలమైన మనస్సుతో 

మరుపురాని నేస్తమై సాగిపోయిన 

చిరుప్రాయపు నవ్వులనావదేతీరమో !

 

పరువాల పరవళ్ళతో 

ఎగసిపడే కలల అలలతో 

మదిని మీటే మురళీనాదాలతో 

పదహారుప్రాయపు పవనమై స్పృశించిపోయిన 

యవ్వనపు వెన్నెలనావదేతీరమో !

 

నడివయస్సు నడవడికతో 

కట్టిపడేసిన బాంధవ్యాలతో 

సంసార సాగరపు ఈదులాటతో 

బాధ్యతల సుడులలో చిక్కుకుపోయిన 

మద్య వయస్సు మమతలనావదేతీరమో !

 

ముసలితనపు మజిలీలో 

తీరిన బాధ్యతల బడలికలో 

కన్నవారి లాలనకై ఎదురు చూపులతో 

మలి బాల్యపు పలకరింపుతో 

మురిసిపోయిన ముదిమి నగవుల పసిడినావదేతీరమో ! 

 

జీవనయానంలో, సాగరతీర సమీపానికై 

సాగిపోయే బ్రతుకునావదేతీరమో ....@సిరి 

 

ll సిరి వడ్డే ll 28-07-2014

 

9. నేస్తమా! నువ్వు వరమై వస్తానంటే 

 

బాష తెలియని బంధమైనది  

సృష్టిలోనే అతి మధురమైనది 

 

జీవితంలో మరచిపోలేనిది 

ప్రతిక్షణం పలుకరించేది 

 

చిరకాలపు తోడై నిలిచేది 

చిరునవ్వై పెదవులపై నర్తించేది 

 

వెన్నెలై మదిని చల్లగా తాకేది 

ఆనందమై మోమున విరిసేది 

 

మైత్రి మాధుర్యాన్ని పంచేది 

అపురూపమైన అనురాగమే నీది 

 

వెన్నంటి నడిపించే నమ్మకమైనది 

సంద్రమై పొంగే ఎదకు ఓదార్పు ఇది 

 

వెన్నుతట్టి నడిపించే ధైర్యమైనది 

చీకటింట చిరుదివ్వై వెలిగేది  

 

నిశబ్దంలో రవళించే సిరిమువ్వైనది 

మదిలో నిండే వాత్సల్యమైనది  

 

మమతను పంచే చెలిమే నీది 

నేస్తమా! నువ్వు వరమై వస్తానంటే 

 

నే వేచి ఉండనా, ప్రతిక్షణం నీకై చెలిమి జగానా

చెలిమి కానుకే ఇస్తానంటే 

 

నే జన్మించనా నీకై ఎన్ని జన్మలైనా 

 

ll  సిరి వడ్డే ll  03/08/2014 

 

46. వేర్వేరు న్యాయాలెందుకో 

 

మగడు దిద్దలేదే ఆలికి నుదుటి కుంకుమ?

నిత్య సుమంగళివి నీవని దీవిస్తూ

పుట్టుకతోనే అమ్మదిద్దింది తొలి తిలకం

జీవిత సౌభాగ్యాన్ని నీకై అందిస్తూ

 

మాంగల్యం జారిందేమో విధివశాత్తు

మనువాడిన మగడిని తారల్లో చేరుస్తూ

సింధూరవర్ణాలకు నిశీధి తెరలేస్తూ

మగువ మదిలో ఆరనిసెగలను రేపుతూ

 

హేమంతాలన్నీ శిశిరాలుగా మారుస్తూ

పూలఋతువులమాటే వలదంటూ

శుభానికి పిలుపులేదని వెలివేస్తూ

కర్పూర కణికవై కరిగిపొమ్మంటూ

విధిరాసిన రాతకు నిను బలిచేస్తూ

వీధి ముఖమే చూడొద్దంటూ

 

తిమిరపు నీడల్లో బ్రతకమంటూ

దవళవస్త్రంతో దావానలాన్నిచుట్టేస్తూ

ఆడజాతికేనా ఎక్కడలేని నీతి ?

మగజాతికి లేదా ఏ పరిధుల రీతి ?

 

వితంతు చట్టానిది అధోగతి అయ్యింది

పురుషాహంకారానికి బలైపోయింది

పుట్టుకతోనే ముత్తైదువలు అందించారు

నిండుగా నీకు గాజులు, పూవులు

పసుపుకుంకుమలకు లేనేలేవు ఏ తేడాలు

విధివంచిత పేరుతో మీకెందుకీ భేదాలు

 

భర్తతోనే ముడిపడిందా భార్య సౌభాగ్యం ?

ఆడవారికేనా ఈ దౌర్బాగ్యం?

భార్య మరణిస్తే భర్తకి చేయరేం ఈ అన్యాయం?

పరాయిదేశాలలో లేదే ఈ దయనీయం? 

 

ll సిరి వడ్డే ll 18-08-14

15. వేర్వేరు న్యాయాలెందుకో 

 

మగడు దిద్దలేదే ఆలికి నుదుటి కుంకుమ?

నిత్య సుమంగళివి నీవని దీవిస్తూ

పుట్టుకతోనే అమ్మదిద్దింది తొలి తిలకం

జీవిత సౌభాగ్యాన్ని నీకై అందిస్తూ

 

మాంగల్యం జారిందేమో విధివశాత్తు

మనువాడిన మగడిని తారల్లో చేరుస్తూ

సింధూరవర్ణాలకు నిశీధి తెరలేస్తూ

మగువ మదిలో ఆరనిసెగలను రేపుతూ

 

హేమంతాలన్నీ శిశిరాలుగా మారుస్తూ

పూలఋతువులమాటే వలదంటూ

శుభానికి పిలుపులేదని వెలివేస్తూ

కర్పూర కణికవై కరిగిపొమ్మంటూ

 

విధిరాసిన రాతకు నిను బలిచేస్తూ

వీధి ముఖమే చూడొద్దంటూ

తిమిరపు నీడల్లో బ్రతకమంటూ

దవళవస్త్రంతో దావానలాన్నిచుట్టేస్తూ

 

ఆడజాతికేనా ఎక్కడలేని నీతి ?

మగజాతికి లేదా ఏ పరిధుల రీతి ?

వితంతు చట్టానిది అధోగతి అయ్యింది

పురుషాహంకారానికి బలైపోయింది

 

పుట్టుకతోనే ముత్తైదువలు అందించారు

నిండుగా నీకు గాజులు, పూవులు

పసుపుకుంకుమలకు లేనేలేవు ఏ తేడాలు

విధివంచిత పేరుతో మీకెందుకీ భేదాలు

 

భర్తతోనే ముడిపడిందా భార్య సౌభాగ్యం ?

ఆడవారికేనా ఈ దౌర్బాగ్యం?

భార్య మరణిస్తే భర్తకి చేయరేం ఈ అన్యాయం?

పరాయిదేశాలలో లేదే ఈ దయనీయం? 

 

ll సిరి వడ్డే ll 18-08-14

 

22. నేర్చుకుంటున్నా..

నటిస్తూ జీవించడం   

 

ఏ మహానుభావుడిచ్చాడో

ఆడజాతికి గొప్ప నజరానా 

"ఆడ" బిడ్డంటూ ...

పుట్టుకతోనే విసిరేస్తుంది 

కలతల (వెతల) జగాన 

"ఈడ" బిడ్డవు కాదంటూ 

 

జనన మరణాలు ఒక్కసారేగా

ఏ ప్రాణికైనా ?

చస్తూ బ్రతికే శిక్ష మాత్రం 

ఆడ జన్మకేనా ?

 

జన్మిస్తూనే తెచ్చుకుంటుంది 

వెట్టిచాకిరీని  స్థిరాస్తిగా 

చితి చేరేవరకు విస్మరించదు

బాధ్యతను  పొరపాటుగానైనా

 

పుడుతూ కన్నవారి కోసం 

పెరుగుతూ తోబుట్టువులకోసం 

తాళిని మోస్తూ కట్టుకున్నవాడికోసం

కలలుకంటూ తాను కన్నవారి కోసం 

 

మరణంలోనూ జీవించే 

మర్మమేమి పసిగట్టిందో 

కట్టుబడే ఉంటుంది జీవితాంతం 

ఆరనివ్వని కంట తడితో 

 

రక్తబంధపు బాధలెన్నున్నా

మూడుముళ్ళ బంధమే వేధిస్తున్నా 

ప్రేగుబంధమెంతగా మెలిపెడుతున్నా 

చెలిమి బంధం చెంతలేకున్నా 

 

అనుక్షణం మరణిస్తూ ...జీవించే 

నిర్వేదం నుండే నేర్చుకుంటున్నా 

ఆడజాతికి అంకితమిస్తూ 

ఒక మరుపురాని పాఠాన్ని

 

 నటించడం ఎలాగో జీవితంలో 

జీవించడం ఎలాగో నటనలో..!

 

ll సిరి వడ్డే ll  11-09-2014

21. లిఖిస్తున్నా..రుధిర శాసనాలెన్నో 

 

కాలపు తెరలను తొలగిస్తూ

తొంగిచూసే జ్ఞాపకాలెన్నో 

ముళ్ళపొదలపై సంచరిస్తూ 

హృదయాన్ని గాయపరచే వేదనా వీచికలెన్నో

 

మనసు లేనిచోట మనుగడను సాగిస్తూ 

కదలాడే ప్రాణమున్న బొమ్మలెన్నో 

పుట్టినింటి గడపదాటగానే చెల్లిపోయే 

మమతానురాగాల అత్మీయతలెన్నో 

 

వధువుకాదు నీ దృష్టిలో ఆలి అంటే 

జీవితాంతం నిను మత్తెక్కించే మధువే 

సప్తపదులు కావవి మెట్టినింట పెట్టే అడుగులు 

నవ వధువుకు నువ్వు వేసిన అరదండాలు

 

తాళి కట్టే పేరుతో తలను వంచి 

మూడుముళ్ల లైసెన్స్ ను మెడకి తగిలించి 

జీవితాంతం శ్రమను దోచి 

‘కార్యేషు దాసిలంటూ యంత్రాలనే చేసి 

కరణేషు మంత్రియంటూ పదవినే కట్టబెట్టి 

భోజ్యేషు మాతలంటూ అమ్మతనాన్నే మట్టుబెట్టి 

రూపేచ లక్ష్మీ, శయనేషు రంభలంటూ తనువంతా దోచి 

క్షమయా ధరిత్రీ… అన్న మాటతో గిరిగీసి 

జీవితాన్నే దోచిన కీచకసుతులు మీరు 

 

పగలంతా విశ్రాంతికి నోచని ఓ యంత్రం 

రాత్రయితే నీ భోగాలకు పరిమళమందించే మరువం 

నువ్వు చేస్తున్నదేమో గొప్ప కష్టం 

అలుపెరుగక రేయింబవళ్ళు నీకర్పిస్తున్నా జీవితం 

 

మగజాతికేనా? ఆడబొమ్మలతో ఆడుకుంటూ 

వారాంతపు సెలవులు, ఆటవిడుపులు ? 

సంసారబాధ్యతతో సతమతమయ్యే ఆలికి లేవా ? 

ఏ సంతోషాలు, ఆదమరిచే క్షణాలు ?

 

అందుకే లిఖిస్తున్నా ..రుధిరాక్షరాలతో 

అమ్మగా, అత్తగా, అక్కగా, ఆలిగా, చెల్లిగా 

విధిస్తున్నా శిక్షని, 

వెలివేస్తున్నా నిన్ను శాశ్వతంగా 

రక్తాశ్రువులతో శపిస్తున్నా నిన్నే 

జీవమున్నా విగతజీవిగా బతకమని 

రాజీనామా చేస్తున్నా ఆలితనానికి 

నేమాత్రం నిత్య సుమంగళిగా ఉంటూ..!

 

ll సిరి వడ్డే ll 26-08-2014

 

17. మహిషాసురమర్ధిని 

 

పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమియైన మనభారతంలో

కర్మసిద్ధాంతమే వద్దంటూ, ఖర్మయని నిందిస్తూ 

వేదాలకు నీళ్ళు వదిలేస్తూ, ధర్మం నడుస్తోంది కుంటుకుంటూ 

ఆడబిడ్డ ఆదిశక్తులంటూ, సిరులివ్వగా వచ్చిన శ్రీలక్ష్మి అంశమంటూ

 

 అన్నపూర్ణలు, దుర్గాభవానిలంటూ అవసరాలకే స్తుతులు 

"బాలా త్రిపుర సుందరిని" పూజిస్తూ, బాలికలపై అత్యాచారాలు చేస్తూ 

"భద్రకాళి"ని భజిస్తూ బ్రతకనిచ్చారా, ధైర్యంగా ఏనాడైనా 

అంబవు, జగదంబవు, విశ్వానికి మాతవని పూజిస్తూ 

చూడగలిగారా పరాయి మగువలో సైతం అమ్మనైనా 

 

"సర్వమంగళివి" నీవని ధ్యానిస్తూ, దోచుకోవడమేగా సర్వస్వాన్ని 

భైరవివంటూ భరించమంటూ, చంద్రికవంటూ సహనాన్ని పరీక్షిస్తూ 

చండిగా సరిపడలేదంటూ, "లలిత"మైన తత్వమే నీదంటూ  

చదువులమ్మా ఒక ఆడదే , సిరులనిచ్చు శ్రీదేవి ఆడదే 

జగన్మాతకైనా తప్పిందా "శీలపరీక్ష", "అగ్నిపరీక్ష" 

 

సత్యం కోసం తెగ(న)అమ్మినా, జూదంలో సైతం పందెం కాచినా 

అర్ధనారీశ్వర తత్వమేదైనా, శ్రీహరి గుండెల్లో సిరికి స్థానమెంతున్నా 

మగువా! తరాలెన్ని మారుతున్నా అంతరాలలో మార్పు సున్నా 

ఆ కాళీతత్వమే నీకు రక్షగా, చండిరూపమే నీ దీక్షగా  

ధైర్యమనే త్రిశూలాన్నే ఆయుధంగా, కాలానికనుగుణంగా దూసుకుపో, 

మూకాంబికవై, మహిషాసురమర్ధినివై సాగిపో ...! 

 

ll  సిరి వడ్డే ll   29/09/2014

18. దిగులెందుకు నేస్తం  

 

అలా కుములుతావెందుకు నేస్తం, 

ఎటు కొట్టుకుపోతుందో..నీ ప్రేమప్రవాహంలో పడి నా మానసం, 

అరుణోదయంతో మొదలయ్యే నీ తలపులు, 

తారోదయంతో ప్రకాశిస్తాయి నీ కలల దివ్వెలై అంటూ మురిపిస్తావు, 

 

ఏ కాంతకు చోటివ్వని "ఏకాంత సీమ"కు నను రాణిని చేస్తావు, 

మనోవనాన నన్నో వసివాడని వసంతంలా నింపుకుంటావు, 

మదిగూటిలో ఒదిగిపోయే ముద్దుల గువ్వగ పొదువుకుంటావు,

నా ఊసులనే హృదయపు సడులుగా చేసుకుని 

మురిసీ మురిపించేవు,

మనసుతోనే మనువాడేవు,

నా స్వరం వినాలంటూ పరితపించేవు, 

పలుకరించినంతనే చెంతలేనని విలపించేవు, 

 

నీ ప్రేమ మాధుర్యమెరుగక జారిపోయిన   

మునుపటి కాలాన్ని నేనేమని అర్ధించను,

నీ మది కారాగారాన బంధీలైపోయిన నా ప్రతి గడియనూ 

నేనెలా గుప్పిట పట్టుకోను, 

 

ఎంతటి అనురాగమో నీది, 

ఏనాటి అనుబంధమో మనది,

నీకై నేనేమి చేసానని ఇంత మమకారం నీకు, 

నీ కోసం నేనేమివ్వగలనో తెలియని అయోమయం నాకు, 

 

ఎద సంద్రంలో పెల్లుబికే ప్రేమవరదకీ జన్మ ఆనకట్ట వేసిందని, 

మరు జన్మకు నిరూపించాలికదా మనది ఆత్మ బంధమని, 

అందుకే నా ప్రాణబంధమా .....

మరి  నను పోనివ్వు నీకన్నా ముందుగానే,

స్వర్గపు వాకిట నీకై వేచి చూసి ఆత్మీయంగా నిను స్వాగతించడానికై ..!

 

ll  సిరి వడ్డే ll  28/01/2015

 

31. సిపాయి చిన్నయ్యా ...

అందుకో నా జోహార్లు  

 

ఏ దేశ జవానులదైనా, ఒకటే లక్ష్యం, ఒకటే కర్తవ్యం

మాతృదేశ సౌభాగ్యమే వారికి ధ్యేయం, 

తనవారి రక్షణే వారికి తెలిసిన పదం 

వత్సరానికి ఒకమారే మనకు దీపాల పండుగలు  

ప్రతిరోజు సహవాసమే వారికి తూటాల సందడులు 

ధీరత్వమే వారికి అమ్మ నేర్పిన తొలి పదాలు 

శూరత్వమే వారు ఆణువణువూ నింపుకున్న చిరునామాలు 

 

ఒక రోజునే  కేటాయిస్తూ సైనిక వందనమంటూ 

అన్యాయమే చేస్తున్నాము వారు చేసిన సేవలకు 

సరిపోతుందా మనకు ఈ జన్మ చివరివరకు 

శిరస్సువంచి మనస్పూర్తిగా హృదయాన్ని అర్పించేందుకు 

 

రణరంగంలో అలుపెరుగని యోధుడవై

క్రమశిక్షణలో నీకు నీవే సాటనిపించే ధీరుడవై

త్యాగనిరతిలో లక్ష్యానికి సాక్ష్యమే నీవై 

భద్రతకే నీవు మరు రూపానివై 

 

పోరాటంలో అసువులే బాసినా 

సమరదీక్షలో వీరమరణమే పొందినా 

రక్షణసాధనలో  చిరంజీవివై మిగిలినా 

పద్మవ్యూహంలో అజేయుడవై నిలిచినా 

 

మనోగగనంలో వెలిగే ధ్రువతారకవే 

హృదయపు కోవెలలో పూజలందుకునే దైవానివే 

మది కాన్వాసుపై చెరగని చిత్తరువువే 

ఎద కనుమలలో ప్రతిధ్వనించే సమర నాదానివే 

ఓ సిపాయి చిన్నయ్యా ..అందుకో నా హృదయపూర్వక జోహారులు

 

ll  సిరి వడ్డే  ll   13/10/2014

29. స్నేహ వాహిని 

 

కాలపు కొమ్మలపై, 

పల్లవించే చిరు చివురుల పల్లవాలే మన స్నేహం,  

పరిమళించే పసి(డి) మొగ్గల ముగ్ధత్వమే మన స్నేహం, 

 

నీ చెలిమికి వయస్సెంత అంటే ఏమి చెప్పను నేస్తం ? 

కడ కట్టె కాలేవరకు, కన్నీటి బిందువు చెక్కిలిని తడిమేవరకు, 

మన మైత్రికి లోతెంతో ఎలా చూపగలను ? 

అంతేలేని గగనపు ఎత్తని, అంతు చిక్కని సాగరపులోతని,  

 

నీ స్నేహమే ఒక కమ్మని కావ్యం, 

చల్లగా స్పృశించే ఒక మలయమారుతం, 

పెదవులపై విరిసిన వెన్నెల కుసుమం, 

హృదయఫలకంపై పదిలంగా నిలిచిన చెరగని జ్ఞాపకం,

కడవరకు విడిపోని బంధం మన స్నేహం,

 

ఓ తేట తేనియ తెలుగు గీతం, 

గమకాలు పలికే సుమధుర స్వరం, 

చిరునగవులను వెలిగించిన దీపం, 

చెలిమికలిమి ఛాయలు విస్తరించిన వృక్షం,

 

స్వచ్చమైన మల్లెల తెల్లదనం, పండువెన్నెల పరిచిన  చల్లదనం,  

తప్పొప్పులను సరిచేస్తూ, విజయాలను ప్రోత్సహించే ఓ చదువులమ్మ ఆలయం, 

మన స్నేహ పరిమళం ఎన్నటికీ వసివాడని  సుమం  ,

మన హృదయాలను వీడిపోని సౌరభాల సుమగంధం,

నవ్వుల నదిలో సాగిపోయే పూవుల పడవ మన స్నేహం

ఈ జన్మ నుండి .. వారధి కట్టేదే మరో జన్మదాకా...మన చెలిమి తీయని జ్ఞాపకం..!

 

ll  సిరి వడ్డే ll  11/01/2015

42. ముద్దుల కన్న య్య

 

యశోదమ్మకెంత ముద్దో, 

కన్నయను కందనీయకుండా బు(సు)ద్దులను నేర్పిస్తూ, 

తను అనుకోలేదేమో, కలగనలేదేమో? 

ముల్లోకాలకు తనను చిరంజీవిని చేస్తాడని..తన కన్నయ్య,

అమ్మ క్రమశిక్షణ అవసరమేనేమో! 

 

మరి జగములనేలే జగన్నాధునికైనా, 

అమ్మ దగ్గర యెంత అమాయకత్వమో, 

ముల్లోకాలను ఏలే స్వామికైనా ,

 

అమ్మ అనునయాలకీ ఉదారత ఎక్కువే, 

సుతారమైన సుమాలుగా తాకుతూ, 

ఈ అమ్మ జన్మదెంత పుణ్యమో, 

జగన్నాటక సూత్రధారినే చెవి మెలిపెట్టేస్తూ,

 

అమ్మ ప్రేమ ఎంత అపురూపం, 

రథసారథినే క్రమశిక్షణలో పెడుతూ. 

ఎవరన్నారు దైవానికి అమ్మలేదని? 

జగద్విజేత ఎలా అయ్యాడు మరి ? 

 

ll సిరి వడ్డే ll 18/12/2014

 

44. నా సెందురూడా  

కడవెత్తుకుని వచ్చాను నీకోసమేకదరా నా సెందురూడా 

ఏటిగట్టున ఏసి ఉన్నాను నీ కోసమేకదరా నా సెందురూడా

గడ్డిమోపు నెత్తిన పెట్టుకుని మోయలేకున్నా 

చేయివేసి సాయమందీయరాదా నా సెందురూడా

 

ఏతమేసి తోడుతున్నా సెరువునంతా 

పంటసేలు తడవకున్నది... వేగమేరారాదా నా సెందురూడా

ఆకలేసి పెయ్యదూడ నా సుట్టునే తిరుగుతున్నది 

పాడియావు సెంతకు తువ్వాయిని సేర్చరాదా నా సెందురూడా

 

తూముడొడ్లు దంచుతుంటే సెమటపట్టి సెరిగిపోయె 

నుదుట కుంకుమను నువ్వు దిద్దరాదా నా సెందురూడా

మువ్వన్నెల సీర కట్టి, మురిపెమంతా సిలకులుగా సుట్టి, 

సిరిచందనాలనే పులుముకున్నా రారాదా నా సెందురూడా...!

 

ll సిరి వడ్డే ll 24/11/2014

 

 

53. తప్పులెన్నబోకురా మా శివయ్యా 

 

తప్పులెన్నబోకురా మా శివయ్యా 

నా తప్పులెన్నబోకురా శంకరయ్యా 

పుణ్యము, పాపము ఎరుగని బోయనయ్యా 

పూజలు, సేవలు తెలియని కోయను నేనయ్యా 

 

తప్పులెంచబోకురా జంగమయ్యా

కరుణించి నను బోవరా తాండవమాడే శివయ్యా 

 

నాగయ్యది ఇసపు(విషపు) తప్పు మెడను ఏసుకోలేదా ?

భూదిదేమో కాటి తప్పు ఒంట పూసుకోలేదా ?

పులితోలుది ఏట(వేట) తప్పు మొలకు సుట్టుకోలేదా ?

నా తప్పులెన్నడము ఓ శివయ్యా నీకొప్పదయ్యా !

 

గంగమ్మది పొగరు తప్పు జడను కట్టుకోలేదా ?

సెంద్రయ్యది మచ్చ తప్పు సిగను పెట్టుకోలేదా ?

కొండయ్యది గట్టి తప్పు ఇల్లు సేసుకోలేదా ?

నా తప్పులెన్నబోకురా తాండవమాడే శివయ్యా 

కరుణించి నను బోవరా హర హర మహాదేవ !! 

 

ll సిరి వడ్డే ll 23/10/2014

 

నా కవితలు

62. ఒక్కోసారి 

 

ఒక్కోసారి మనసెందుకో.... 

జగతిలో ఉన్న వేదనలన్నీ తననే చుట్టుముట్టినట్లు, 

విశ్వంలోని బాధలన్నీ తనచెంతనే పొంచి ఉన్నట్లు, 

సంతోషం ఆమడ దూరంలో ఉండి శోధిస్తున్నట్లు,

ఆనందమంటే తెలియదని వెక్కిరిస్తున్నట్లు, 

కలతలు, కష్టాలు, కన్నీళ్లు, 

దుఃఖాలన్నీ వెంటాడి వేధిస్తున్నట్లు, 

నిశాంతి నీడలే తన జాడలైనట్లు, 

తెగ ఇబ్బంది పడిపోతుంది,

నిర్వేదంగా, నిత్తేజంగా, 

నిర్వీర్యంగా, నిర్లిప్తంగా, 

నిరాశా నిట్టూర్పులతో, 

మనసు లేని మగడి మాంగల్యం బరువును మోస్తునంత భారంగా....

 

ఒక్కోసారి హృదయమెందుకో.... 

ప్రపంచమంతా తన ఆధీనమైపోయినట్లు, 

కోటిజన్మల ఆనందం తన సొంతమైనట్లు,

సంతోష తరంగాలేవో ఉవ్వెత్తున లేచి మనోతీరాన్ని తాకుతున్నట్లు,

సుఖాల అంచులలో ఊయలలే ఊగుతున్నట్లు, 

మనోగగనమంతా నవ్వుల తారలెన్నో విరబూస్తున్నట్లు, 

ఉత్సాహాల సంబరాలేవో అంబరాలను తాకుతున్నట్లు, 

తెగ ఉబ్బి తబ్బిబ్బైపోతుంది,

 

సంతోషంగా, సరదాగా, సల్లాపంగా, 

ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆటపాటలతో, తుళ్ళి తుళ్ళి పడుతూ, 

పరవశంతో పడిలేస్తూ, మైమరుస్తూ, మురుస్తూ, 

 

ప్రాణబంధం ఆర్తిగా హత్తుకున్నంత ప్రేమగా......

ఒక్కోసారి మది ఎందుకో .... 

లోకమంతా అల్లకల్లోలమైపోయినట్లు, 

ఆప్తులకు ఆమడదూరంలోనే ఉండిపోతున్నట్లు, 

సన్నిహితులంతా చెలిమిని వీడి ఒంటరిని చేసిపోయినట్లు,

వెలివేయబడిన ప్రపంచాన ఏకాకిగా మిగిలిపోయినట్లు, 

గాలి, నీరు, కొండ, కోన మౌనవ్రతమే పాటిస్తున్నట్లు, 

ప్రపంచమంతా తనను వీడిపోయినట్లు, 

తెగ ఉలికులికి పడిపోతుంది,

అయోమయంగా, అనిర్వచనీయంగా, అబద్రతాభావంతో, 

ముభావంగా, మూగగా, మౌనంగా, అచేతనంగా, 

రాగం మరచిన చైత్రకోయిలలా, 

శిశిరం తాకిన తరువులా, 

అర్ధంకాని అయోమయంలో చిక్కుకున్నట్లుగా అయిపోతూ ఉంటుంది

 

ll  సిరి వడ్డే ll  08/01/2015

 

64.   మా"విడాకులు"

వెళ్ళిపోయావు కదూ? అంటూ నిలదీస్తున్నావు

నాది అహం అని నిందిస్తావు 

అనవసరంగా కలహమాడింది నీవని 

ఎప్పటికీ ఒప్పుకోవు ఎందుకని ?

 

ప్రేమించి పెళ్ళాడక పోతేనేమి ?

పెళ్ళాడి ప్రేమించుకుందామని 

క్రొత్తదనాన్ని నేర్పించింది నీవేగా ?

నేనే తగ్గి ఉండాలనే  పంతం మానుకోలేవా ? 

 

అనుక్షణం,

 

ఏ మెట్టెలు సవ్వడో  నీ చెవిని తాకినప్పుడు

నీ హృదయ స్పందన నేనౌతాను

ఏ జాజి, మల్లెలో జావళీలు పాడినప్పుడు 

నీ ఎద పానుపుపై పరిమళమౌతాను 

 

ఏ పసిపాప నవ్వులో నిను మైమరపించినప్పుడు 

నీ గుండె తడినై నిను నిమురుతాను 

ఏ మలయామారుతమో నిను స్పృశించినప్పుడు 

నీ యెదలో చల్లని హిమపాతమై ప్రవహిస్తాను 

 

నీ నిట్టూర్పుల మాటున దాగి 

నులివెచ్చని కిరణానై స్పరిస్తాను 

ఏ జామురాతిరికో కునుకు పట్టినప్పుడు 

నీ కన్నుల్లో మెరిసే కలగానే మిగిలిపోతాను 

 

నీ దిగులును దాచుకునే ప్రయత్నంలో

ఏ ఒక్క జ్ఞాపకంగానైనా నేను నీ మదితలుపును తడితే 

మన్నించి గుండెలకు హత్తుకోలేవా ?

 

మావిడాకులు కట్టిన పందిరిలోనే 

మా"విడాకులు" రద్దంటూ ప్రతిజ్ఞ చేయలేవా?

ఇకనైనా ఆహాలకు  మనమధ్యన చోటులేదంటే 

కోటి జన్మలైనా నీ వెంటే నే నడిచి రాలేనా ?

చిరునవ్వుల వరమే ఇస్తానంటే

చిరు దివ్వెను నేనై నీ కన్నుల్లో మిగిలిపోనా ?

 

ll సిరి వడ్డే ll 24/10/2014

 

(24)

 

హృదయం  ఉక్కిరి బిక్కిరి  అవుతోంది 

నీ  జ్ఞాపకాల భారాన్ని మోయలేక 

చెక్కిలి తడుముకుంటోంది

జారిన  జ్ఞాపకాల కన్నీటి చారికలు కానరాక 

 

చిరునవ్వు  దిగుల పడుతోంది

వాడిన నగవుల పరిమళాలను  తలచుకుని 

కలలన్ని  వెక్క వెక్కి రోదిస్తున్నాయి 

నీ జాడైనా తెలియకుందని 

 

ఆశేమో ఊపిరై ఊగిసలాడుతోంది 

అలుకేమో అలుపై వగచుతోంది 

ఊహేమో ఉలికులికి పడుతోంది 

కాలమేమో విరగబడి నవ్వుతోంది 

 

మది దోచిన చిన్నోడా ..

 

వాగులు, వంకలు, గుట్టలు, పిట్టలు  , 

గువ్వలు, మువ్వలు, పూవులు  

నవ్వులన్నీ గుచ్చి గుచ్చి ఆరా తీస్తుంటే ...

 

నేనమని బదులిచ్చేది ?

ఏమని సర్ది చెప్పేది ? 

నువ్వు నన్ను వెలివేసిపోయావన్న సంగతి ....@సిరి 

 

ll  సిరి వడ్డే ll  25/-09/14

 

(25)

 

ఎన్నెన్నో స్మృతులు 

మది తలుపులను తెరుచుకుంటూ 

ఎన్నెన్నో ఆశలు 

కోర్కెల రెక్కలను తొడుక్కుంటూ 

 

ఊహల వానలేవో 

మదిని తడిపేస్తుంటే 

తలపుల వరదలేవో 

పొంగిపొరలి ఎదను ముంచేస్తుంటే 

 

అర్పించిన మనసును విడిచి 

నిను వలచానని మరచి 

అందనంత దూరంలో దోబూచులాడుతూ 

ఉడికిస్తావెందుకని ?

 

ఇంత గడుచుతనం నీకేల

సొగసరిని నేను కానా

చేపట్ట రావేమిరా నచ్చిన చెలికాడా

 

తింగరోడా ...

 

 నీకై నే వేచి ఉంటే...నువ్వే నా ప్రాణమంటుంటే 

తికమక పడిపోతూ నీకీ  జాగేలరా ?.....@సిరి 

 

ll  సిరి వడ్డే ll   01/10/2014

 

(26)    

 

హృదయం ఉక్కిరి బిక్కిరి అవుతోంది 

నీ జ్ఞాపకాల భారాన్ని మోయలేక 

చెక్కిలి  తడుముకుంటోంది  

ముద్దాడిన నీ ఊసుల గురుతులు కానరాక 

 

చిరునవ్వు దిగులు పడుతోంది 

నీ పలుకుల పరిమళాలను వీడలేక  

కలలన్నీ వెక్కివెక్కి  ఏడుస్తున్నాయి 

నీ జాడ కనుమరుగై పోయిందని 

 

చిన్నోడా ...

 

ఆశేమో ఊపిరౌతోంది

ఊహేమో ఉలుకులికి పడుతోంది 

అలుకేమో ప్రణయరాగమై పరవశిస్తోంది 

కాలం  విరగబడి పరిహసిస్తోంది 

నీ సడి లేదేమని ? గడుసరి జాడేదని

 

తింగరోడా...

 

వాగులు, వంకలు, గుట్టలు, పిట్టలు, 

గువ్వలు, మువ్వలు, పూవులు నవ్వులన్నీ 

చిన్నబోయి  ఆరాకై  వెదుకుతున్నాయి

నేనమని చెప్పేది ? నువ్వు నన్ను విడిచిపోయిన కధనం 

అందరిలోనూ అలుసే చేసిపోతావు నీకిదేమి సంబరం !

 

ll సిరి వడ్డే ll 02/10/2014

 

(27)

 

వలపు వసంతాలేవో 

మేలుకొలుపులు పాడుతుంటే, 

తలపుల ప్రత్యూష బిందువులేవో 

మైమరచి మెరిసిపోతుంటే,

 

సిగ్గుల విరులేవో 

కెందామరలై పూస్తుంటే, 

ఊహల మారుతాలేవో 

చెక్కిలిని తాకుతుంటే,

 

తెలిమంచు పరదాలే 

చిలిపిగా వీడ్కోలు పలుకుతుంటే, 

మనోవనమంతా పరిమళిస్తోంది 

పరవశాల వెల్లువలతో,

 

హృదయమంతా ఉప్పొంగిపోతోంది 

తమకాల సుగంధాలనే అద్దుకుంటూ 

ఆశలేవో గిరిగీసి అల్లరి పెడుతుంటే 

ఊహలేవో ఉలికులికి పరుగెడుతుంటే ,

 

వసంతుడవై వస్తావని, 

వసంత కేళీతోమురిపిస్తావని, 

ఆమనినై ఆలపిస్తూనే ఉన్నాను, 

పూలరాగాలనే పుప్పొడి ముద్దులుగా అద్దుకుని, 

నా అందాల తింగరోడా    !...@సిరి

 

ll సిరి వడ్డే ll 25/10/2014

 

(28)

 

ప్రతి స్వప్నంలోను తీయని కధవై ,

ప్రతి మౌనంలోను తెలియని బాసవై,

మాటలకందని మౌనలేఖవు నీవై ,

అశానిరాశలలో అనునయానివై,

ఓటమినిట్టూర్పులలో చల్లని ఓదార్పువై,

 

పెదవులపై చెదరని చిరునవ్వువై ,

చెక్కిలిపై విరిసే సిగ్గుల కెందామరై  ,

హృదయంలో వాడని జ్ఞాపకసుమమై,

కన్నుల్లో కదిలే కలల కావ్యమై ,

 

అనుక్షణం వెన్నంటే ఉంటావు,

నా ఊహల ఊయలలో ఊరేగుతూ ,

నా గుండె గూటిలో గువ్వలా ఒదిగిపోతూ,

నీ హృదయపు సవ్వడిలో మువ్వై రవళిస్తూ,

 

ప్రతి క్షణం .....నీ ధ్యాసే ,

ప్రతి నిత్యం ....నీ తలపే 

 

తిక్కలోడా .....

 

పట్టదుగా నీకెప్పటికీ..

నీకై తల్లడిల్లే నా మది ప్ర(ళ)ణయపు ఉదృతి ...@సిరి    

 

ll సిరి వడ్డే ll 17/11/2014

I

114. వటవృక్షంవటవృక్షం... ఎందరో "వణిజులు" (వ్యాపారులకు) విశ్రాంతినిస్తూసుస్థిర పరుచుకుంది తనపేరును "బనియన్ ట్రీ" గా,పత్రగ్రీవాలలో అలరిస్తూ, యెర్రని ఫలాలతో మురిపిస్తూఊడలెన్నో విస్తరించుకుంటూ..వసుదైక కుటుంబం మనదని చాటేస్తూ,త్రిమూర్తులకు కొలువై ఉన్న హరితదేవాలయమే తానంటూపిల్లలమర్రి పేరుతో పసి హృదయాలను దోచేస్తూ,మళ్ళీ తుళ్ళే పసిప్రాయాన్ని మొదలంటూ... చందమామ, బాలమిత్ర కధలలో తానుంటూఆయుర్వేదంలోను, దంతక్షయ నివారణలోనూ తన ఉనికిని చాటుకుంటూ,సౌందర్యపోషణకు నేనే మహారాణి నంటూ బల్లగుద్ది మరీ చెపుతోందిఅందాల మర్రి ..ఔషదాల జాబిలి, తరతరాలకు తరగని మన పెన్నిది ...@సిరిll సిరి వడ్డే ll 17-07-2014

 

115. సుమలతలుపసిపాపల బోసినవ్వుల్లో పరిమళిస్తూవసివాడని అమ్మ ప్రేమలో మురిపిస్తూశారదమ్మ కుటీరాన అక్షరమై కొలువుంటూనీలాంబరి గూటిలోన తారాదీపమై వెలుగొందుతూపూరెమ్మల వంపులలో ఒదిగొదిగిపోతూ   సెలయేరమ్మ గలగలలలో రవళిస్తూతీపిరాగాల కూనలమ్మ గళాన్ని పెనవేస్తూహేమంతాల పందిరినే ఆలంబనగా అల్లుకుంటూమమతల మరువాలనే పంచే హరిత నేస్తాలు...అలుపెరుగని రైతన్నల ముద్దు బిడ్దలు....@సిరిll సిరి వడ్డే ll 21-07-2014

 

 

116. ఉప్పెన 

 

ప్రకృతి వైపరీత్యమో, కలికాల ధర్మమో !

సంద్రానికి సంబరమో, ఉగ్రరూపానికి ప్రతిరూపమో, 

 

చిన్నాచితకా బేధమే తెలియదు 

పేదాధనిక  తేడాయే చూపదు, 

 

కట్టడాల్ని సైతం కదిలిస్తుంది 

కరుణతో తనకు పనేమీ లేదని నిరూపిస్తుంది, 

 

మూగజీవులను సైతం కబళిస్తుంది

ప్రాణాలతో చెలగాటమే ఆడుతుంది,  

 

ప్రాణంలేని బొమ్మలుగా మార్చేస్తుంది

తనవారిని దూరంచేసి తీరని శిక్షనే విధిస్తుంది,

 

బ్రతుకు చదరంగంలో పావులుచేసి ఆడిస్తుంది

విరించి విరచితానికే సవాలు విసిరేస్తుంది 

 

ll  సిరి వడ్డే ll  24-07-2014

 

117. కూపము (బావి)     

 

దాహార్తిని తీరుస్తూ, ఊరే చెలమల ఊటలతో అక్షయమై పోతూ 

వేసవిలో సైతం నిండుగా ప్రవహిస్తూ ,

 

నీటివనరులెన్నో సమకూరుస్తూ 

ఏతమేసినా, గిలకలేసి తోడినా 

 

చేదలతో నింపుకున్నా తరగని అమృత జలధారలను అందిస్తూ

ఊరి బావిగట్ల ముచ్చట్లంతా మాకు ఎరుకేలే 

 

నీ కధలే వింటే తుళ్ళే పసిప్రాయమే మళ్ళీ మొదలయ్యేనులే 

స్వయంభూగా, వినాయకునికి జన్మనిచ్చి

 

విహారిపురికి "కాణిపాకం" అనే పేరు సార్థకం చేసావులే 

ఆధునిక జగతికి నీతో పనేముందని ? 

 

నీ ఊసులన్నీ ఒకానొకప్పటి కధలుగానే మిగిలిపోయేనులే

పల్లె పల్లెలో నీ ఉనికిని చాటుకుంటూ 

 

అమ్మమ్మ, నాన్నమ్మ కధలలోనే దాగుండిపోయావులే.. @సిరి

 

ll సిరి వడ్డే ll 26-07-2014

 

118.  బామ్మా ...నీకు సాటెవరమ్మా ? 

 

అసలుకంటే వడ్డీ ముద్దంటూ 

అమ్మప్రేమలోని కమ్మదనానికి నెలవై ఉంటూ 

 

కాకమ్మా చిలకమ్మా కధలే వినిపిస్తూ 

కలిమీలేములు, కష్టసుఖాలను వివరిస్తూ

 

కృషీ పట్టుదల మనవెంటేనంటూ 

ధైర్యసాహసాల గాధలనే నూరిపోస్తూ

 

లాంతరైనా, విద్యుత్తైనా కార్యదీక్షకు అడ్డురావని నిరూపిస్తూ

"ఘటాల" సంగతులతో చల్లగా మదిని మురిపిస్తూ

 

ఇంటికి పెద్ద దిక్కువై నడిపిస్తూ 

సుఖదుఃఖాలెన్నో పరిచయిస్తూ 

 

బామ్మా ...నీకు సాటి ఎవరమ్మా ? బంగారం నువ్వమ్మా

మముగన్న పెద్దమ్మా ...వెయ్యేళ్ళు వర్ధిలవమ్మా...@సిరి  

 

ll  సిరి వడ్డే  ll   14-08-14

 

119. ఎంత అద్భుతమో 

 

రంగు రంగు కోకలను చుట్టుకుంటూ 

సీతాకోకచిలుక సోయగమెంత అద్భుతమో !

 

దరహాసపు ముత్యాలను జార్చుతూ 

పసిపాపడి హసితమెంత అద్భుతమో !

 

తుమ్మెద మౌనబాషలోని భాష్యమెంత అద్భుతమో 

పాపడి పెదవిపై పారాడుతూ పసి(డి) పలుకులెంత అద్భుతమో !

 

ప్రకృతికాంత ఒడిలో వదిగిపోతూ... 

కల్మషమంటని ఈ మైత్రి బంధమెంత అద్భుతమో ! 

 

ముద్దుగారే మాటల మౌక్తికాలను దోసిలిపడుతూ 

చిట్టి సీతాకోకచిలుకమ్మ పరవశమెంత అద్భుతమో !....@సిరి 

 

ll సిరి వడ్డే ll 17-09-2014

120.  ఎంత ముచ్చటనో  

 

ఎంత సంబరమో నా మదికి 

మా తోట చిలుకమ్మ సందడికి 

 

ఏమి ఊసులు మోసుకొచ్చిందో 

ఎదకెన్ని సంతోషాలను నింపిందో 

 

చిట్టి చిలుకమ్మ పలుకులెంత ముచ్చటనో

ముక్కున కోరికే జామపండెంత రుచికరమో 

 

తానాలపించే కువకువల సంగీతాలెంత శ్రావ్యమో

రెక్కల వీచికలలోని స్వరాలెంత మధురమో 

 

శుకజాతి పండితుడి ముహూర్తమెంత శుభకరమో

వెంకన్నసామి పరిణయమెంత నయనానందకరమో 

 

అమ్మకొట్టిందని అమాయకంగా ....

చిట్టి నేస్తానికి పిర్యాదు చేస్తుంటే యెంత చూడ ముచ్చటనో !...@సిరి 

 

ll సిరి వడ్డే ll   23-09-2014

77. నీ సమక్షంలో పరుగులు తీస్తూ

 

నీ సమక్షంలో పరుగులు తీసే సమయం 

నీ నిరీక్షణలో కదలక మారాం చేస్తూనే ఉంటుంది 

 

కాలానికెందుకో ఇంత నిర్దయ

ప్రతిగడియ ఒక కంటకమై గుండెగులాబీ చుట్టూ తీయని గాయాలను చేస్తూ 

 

నీతో గడిపిన క్షణాలను మెలిపెడుతూ 

జ్ఞాపకాల గనులనుండి త్రవ్వి తీస్తూ 

 

వేచి వేసారిన నిమిషాలన్నీ ఉప్పునీటి సంద్రమై కంటపొంగుతూ 

యెదలో నిదురిస్తున్న గతాన్ని సైతం ఉప్పెనలా ముంచేస్తూ

 

క్షణానికోసారి నిమిషాలను లెక్కిస్తూ 

క్షణమైనా వదలక బాధించే నీ తలపులను నిలదీస్తూనే ఉన్నా 

 

సప్తజన్మలైనా వేచి ఉంటా ...సప్తపదులు నీతో నడిచేందుకై 

కోటిజన్మలనైనా కోరుకుంటా ... నీ కనుకొలనులో కలువగా నైనా కుసుమించేన్డుకై...... @ సిరి 

 

 

ll సిరి వడ్డే ll 15-04-14

 

 

78.  అలుపెరుగని సైనికులం

 

ఆది నుండి అనాదిగా ఆడది ఎపుడూ ఆటబొమ్మనే అంటూ... తరాలు ఎన్ని మారినా అంతరాలలో మార్పు మాత్రం రాదంటూ 

అమ్మ ,అక్క ,చెల్లి, ఆలి ...ఆడవారేనన్న ఇంగితాన్ని మరచిపోతూ, విర్రవీగే మీకోసం వ్రాస్తున్నాం ఇపుడే కొంగొత్త స్వర్ణ శాశనం 

పర స్త్రీ అంటే పబ్లిక్ ప్రాపర్టీ అనే భావం ఎపుడు వేళ్ళతో సహా పెకలించబడుతుందో

అపుడేకదా ? భరతమాత కంట గంగధారాలు ఆగేది అనేది నాటి మాట ...దుమ్ముదులిపి చైతన్య గీతికను ఆలపిస్తోంది ఈ నాటి మగువ బాట 

 

నీ ఇంట పుడితేనే ఆడబిడ్డనా ? నీ గడ్డ పై పుట్టిన ఆడబిడ్డలంతా నీ సొంత సోత్తులేనా ?

ఆడ బిడ్డ అని తెలిసిన గడియమొదలు నీకు గుండెల్లో గుబుల్ల దిగుళ్ళు ...బ్రూణహత్యలకు ఎక్కడలేని హడావిడులు 

అడ జాతి మొత్తానికి ఏమైనా వ్రాసి ఇచ్చారా మీరు అడవి మల్లెలుగా వాడిపోయే వారసత్వం ?

 

ఆడదంటే అలసత్వం, వంటింటి కుందేలు అనుకునే నిరంకుశత్వం, జీతం లేని బానిసత్వం అని చాటాలని అనుకుంటే 

నిరూపిస్తాం అబలలం కాము మేము సబలలమని ... మా తోడూ లేనిదే మీకు మనుగడ లేదని 

నిరూపిస్తాం అర్ధనారీశ్వర తత్వం మాదని ...ఎందులోనూ మేం తీసిపోమని 

అన్నింటా మాదే హవా అని మా రాజ్యానికి మేమే రాణులం , తిరుగులేని నాయికలం , అలుపెరుగని సైనికులం....... @ సిరి 

 

79. ఆడం - ఈవ్

 

జగతికి తొలిజంటగా, వలపుల పంటగా, 

శృంగార మూర్తులుగా వెలిశారు ఆడం, ఈవ్ లు 

కన్నులపంటగా, తిరుగులేని జంటగా, 

సృష్టి కారకులుగా జగమేలిన మన పూర్వీకులు

 

అందానికి వీరు చిరునామాలు 

నవయవ్వనసీమలో రతీమన్మధులు

సౌందర్యలహరికి మారు రూపాలు 

తలపులవనంలో పరిమళ మకరంధాలు 

 

స్వేచ్చా గగనాన విహరించిన ప్రేమ పక్షులు 

మానవజాతి అభివృద్దికి మూల స్తంభాలు

ప్రణయ కావ్యంలో నాయకానాయికలు 

ఆచంద్ర తారార్కము నిలిచే చిరంజీవులు ... @ సిరి 

 

ll  సిరి వడ్డే ll 29-04-2014

 

80. ఎగసిపడే జీవన కెరటాలు

 

ఎగిసిపడే వేదనా తరంగాలు ...మనోసాగరమంతా వలయాలుగా చుట్టేస్తూ 

జ్ఞాపకాల హోరులతో పడి లేచే ఊహల కెరటాలు...ఉప్పునీటి(కన్నీటి) చెలమలుగా ప్రవహిస్తూ 

నీలి కన్నుల ఎగసిపడే కన్నీటి ముత్యాలనే గుప్తనిధులుగా దాచేస్తూ 

జీవన సంద్రంలో కల్లోల తరంగాలై మనస్సునే తాకుతున్నాయి కన్నీటి ఉప్పెనలై 

 

ఆశల గలగలల మాటున తీరం చేరని విషాదపు సుడులెన్నో ..ఎన్నెన్నో 

యెద పొరల్లో నిదురిస్తున్న జ్ఞాపకాలన్నీ వరదలై పొంగి, సునామీల ప్రకంపనలతో ముంచేస్తూ 

గుండె తీరాలను కోసుకుని కట్టలు తెంచుకుని దుఃఖ ప్రవహాలై మదినే కల్లోల పరుస్తున్నా 

 

గమ్యం ఎరగని ఆశల నౌకలపై పయనిస్తూ...ఊరే ఊహల ఊటబావుల కోసం నిరీక్షిస్తూ 

సాగర గర్బంలో దాగిన ఆశల ముత్యపు సౌదాలకై అన్వేషిస్తూ

ఈదలేమని తెలిసీ ఆగదు గమ్యం ఎరుగని, తీరం తెలియని జీవనయానం 

సాగలేమని తెలిసీ తప్పని సాహసాల వెదుకులాటలే ... 

ఈ ప్రళయ సంద్ర గర్భాన దాగిన అమూల్య సంపదల అక్షయాలకై వెతలతోనైనా వేటలే ...... @ సిరి 

 

ll  సిరి వడ్డే ll 01-05-2014

 

 

81. పార్క్ లో బెంచీ

 

వసంతాలెన్నో పరిమళిస్తున్నా, గ్రీష్మ తాపాలే మండిస్తున్నా ,

వర్షపుధారలే ముంచేస్తున్నా, శరత్తులే కుసుమిస్తున్నా ,

హేమంతాలే పలుకరిస్తున్నా, శిశిరాలనే నింపుకున్నా, 

ఋతువులెన్ని మారినా ఈ జగతిలో ఏకాకిగానే నిలుచున్నా,

 

చుట్టూ ఎందరున్నా..నను గుర్తించేవారే లేకున్నా 

వత్సరాల (వసంతాల) తరబడి ఎందరినో వడిలో మోస్తూనే ఉన్నా

తుషారపు వేకువలో బాలబానుని నులివెచ్చని స్పర్శతో 

సంధ్యా సమయపు వేళలో మలయమారుతాల బుజ్జగింపులతో 

 

గువ్వల కువకువల పలకరింపులతో ...చుట్టూ చేరి ఊసులాడే గరికపూల ముచ్చటలతో

మారే తరాలను మోస్తూనే ఉన్నా ..మారుతున్న పరిస్తితులకు మూగ సాక్ష్యమై నిలిచి ఉన్నా 

ఎందరో కవుల భావాలను వడిలో చేర్చుకున్నా...

మరెందరికో సేద తీర్చుతూనే ఉన్నా.. ఎందరితో కలిసున్నా వంటరిగానే మిగిలిపోతున్నా ... @ సిరి 

 

 

ll సిరి వడ్డే ll 02-05-2014

 

 

82. పెదవి దాటని మౌనాలెన్నో

 

ఆశల ఎడారిలో ఎండమావుల ఆవిరులే కంటున్నా, ఎడారి కోయిలనై ఒంటరి రాగాన్నే ఆలపిస్తున్నా 

నిశీధపు సామ్రాజ్యంలో కౌముదివై నువ్వు అగుపిస్తున్నా, నిరవపు వేదికపై యామిని గానాన్నే వింటున్నా

పెదవి దాటని మౌనాలెన్నో గొంతులోనే బందీలై ఉన్నా, గుండెలు దాటని వేదనలెన్నో నిట్టూర్పులై మిగిలున్నా 

నువ్వు వెలివేసిన హృదయంతో తల్లడిల్లి పోతున్నా, జారిపోయే ప్రతి కన్నీటి బిందువును దోసిలి పట్టే ప్రయత్నమే చేస్తున్నా 

 

చిగురుల చైత్రాలన్నీ మోడువారిపోతున్నా, మాఘమాసపు ఆశలన్నీ అణగారిపోతున్నా 

ఊహల వసంతపు నెత్తావులన్నీ తరలిపోతున్నా, బాసల హేమంతాలన్నీ బావురుమంటున్నా

నువ్వు పరిచయించిన కలలన్నీ చెక్కిలిపై శోక బిందువులై జారిపోతున్నా 

ఎన్నో తలపుల వడిదుడుకులు, ఎదలోపలి అయోమయాలుగా..జవాబులులేని ప్రశ్నలై మిగిలున్నా 

 

నా ఊహలనెందుకు ఉరితీసావో, నా వలపుల అలల నౌకవై ఎందుకు పయనించావో 

నా మది నెందుకు నీ ప్రేమకు బలి చేసావో, పగిలిన ప్రతి హృదయపు శకలంలో జ్ఞాపకమై నిలిచావో 

నిను పరిచయించిన తొలి క్షణం అక్కడే నిలిచిపోవాలనుకోవడం పిచ్చి తనమేనేమో 

తొలి చూపులోనే నిను వలచానని, ఆ క్షణమే నను నేను మరిచానని నీకు చులకనయ్యానేమో !... @ సిరి 

 

 

ll సిరి వడ్డే ll 03-05-2014

 

 

82. పసి జగతి

 

పవనుడేమి ఊసులు చెప్పాడో 

బుద్దిగా తలలూపుతూ పూబాలలు 

పసి(డి) మొగ్గలేమి ముచ్చట గొలిపాయో

కల్మషమంటని విరినగవులతో ముద్దు పాపడు(లు) 

 

గుండెను చీల్చుకువస్తున్నా... 

హరితఖడ్గాలంటే యెంత మురిపెమో ధరణి మాతకు

పసికూనలెందరో ...అంకురాలుగానే వాడి రాలి పోతున్నా 

జాలి లేదు... చీము నెత్తురు లేని కామాంధులకు

 

పరిమళాలెన్నో విరజిమ్ముతూ పూవని

బోసినవ్వులు తప్ప మరేమీ ఎరుగని పసి జగతిని

కాపాడుకోలేని మన దుస్థితిని..భరతమాత హృదయ నిర్వేదాన్ని 

మరే రక్తాక్షరాలతో లిఖించాలో ఈ దృతరాష్ట పాలనని........ @ సిరి 

 

ll  సిరి వడ్డే ll  05-05-2014

 

83.  ప్రియబాంధవా

 

గగనపు నీలి సంద్రంపై తేలియాడే తెలిమబ్బుల తరగలల్లే

మనో సంద్రమంతా తేలియాడుతూ నీ ఊహల అలలెన్నో 

రెక్కలు తొడిగిన విహంగాలతో పోటీ పడుతూ 

రెక్కల గుర్రమెక్కి ఊరేగుతోంది నీ నీడైన నా మనస్సు 

 

ఏ దూరతీరాన దూబూచులాడుతున్నవో 

ఏ మేఘ సందేశాలకై వేచి ఉన్నావో

ఎవరు గాయపరిచారో ..మొయిలుని హృదయాన్ని

ఏ క్షణాన వరదలై పొంగించేనో తన వాన(కన్నీటి) నీటి ప్రవాహాన్ని 

 

ఎన్నాళ్ళుగా దాచానో నీపై నింపుకున్న అంతులేని ప్రేమని 

ఎంతగా వేచి వేసారానో అంతు చిక్కని నీ ఆగమనాన్ని 

మేఘాల పరదాల మాటున దాగిన తొలకరివై

నా కన్నుల ఆనంద భాష్పపు జల్లువై నా చెక్కిలిని తాకవా ? నా ప్రియబాంధవా ...... @ సిరి 

 

ll సిరి వడ్డే ll 07-05-2014

 

84.  కొండపల్లి బొమ్మా

 

కొండపల్లి బొమ్మా....బంగారు బొమ్మా

పొనికిచెక్కతో జరిగేను ..నీ నిర్మాణమమ్మా 

దశాబ్దాల చరితగల ..సొగసరి నీవమ్మా 

కొండవీటి రెడ్డి రాజుల ఆదరణతో ఊపిరి పోసుకుని ... ఆంధ్ర సంస్కృతిని చాటి చెప్పావమ్మా

 

ఏనుగు అంబారి -మావటివాడు రూపాలకు సజీవకల్పన నీవే నమ్మా

ముట్టుకుంటే ముచ్చటగా నాట్యమాడే నృత్యకళాకారిణిలకు పోటీ నీవే నమ్మా

పల్లెల సాంప్రదాయపు దుస్తులతో ఉట్టిపడే జీవకళ నీదమ్మా

కాదేదీ నీ రూపానికి అనర్హమంటూ ...రాజస్తాన్ బొమ్మల శైలే నీదంటూ మురిపించావమ్మా

 

తీర్ధ యాత్రాస్థలాల్లో, హస్తకళా కేంద్రాల్లో ..ముచ్చటగొలుపుతూ మురిపించేవు 

నా జాతి రత్నమణి గర్వంగా నా తెలుగు జాతి కీర్తినే హిమపర్వత శ్రేణికి నిలిపేవు

మన తెలుగు సాంప్రదాయాలను ఉట్టిపడుతూ తలమాణికమై వెలిగేవు 

కొయ్య బొమ్మలకే చిరునామావై నిలిచేవు ...భారతజాతి కేతనాన్నే ఎగురవేసావు ... @ సిరి 

 

 

ll సిరి వడ్డే ll 10-05-14

 

 

85. రంగుల(కలలు) కళలు

 

గగనపు కాన్వాసుపై వివిధ వర్ణాలతో 

హరివిల్లుని చిత్రించేందుకు సమాయత్తమైనట్లు 

 

రంగురంగుల కోకలని చుట్టుకొని నీరూపాలన్నీ 

వర్ణలాస్యమేదో చేస్తూ... మదిని రంజింపజేస్తున్నట్లు

 

కలలలోని నీ కళలు ...రంగులు పూసుకొని 

రేయికి కొత్తవర్ణాలు పులుముతున్నట్లు

 

అన్ని వర్ణాలలో నువ్వే కనిపిస్తూ 

నీవలపులే నాట్యమాడుతూ నామదిని దోచినట్లు 

 

నీ ప్రేమలోని వర్ణాలను కలలకే పరిమితం చేస్తూ 

నాకంటికి మాత్రం చీకటి పూతని మిగిల్చినట్లు ....... @ సిరి 

 

 

ll సిరి వడ్డే ll 14-05-2014

 

 

86. పసి(డి)ప్రాయం

 

ఏ కల్మషం అంటని పసి(డి)ప్రాయం 

వసివాడని విరినగవుల మరువపు పరిమళం 

పసిపాపల బోసినవ్వులా... వెలకట్టలేనిది బాల్యం 

చందమామ, బాలమిత్ర కధలకు మురిసిన చిరుప్రాయం  

 

అమ్మవడిలో ఆదమరచి మురిసిన సమయం... జోలపాటలకు మైమరచిన పసితనం 

నాన్న చేయి పట్టుకుని నడిచిన చిరుపాదం..నాన్న గుండెలపై ఆదమరిచి నిదురించిన ప్రతి క్షణం  

కేరింతలతో, తుళ్ళింతలతో బుజ్జాయి, తువ్వాయిల వెంట పరుగులతో అలుపెరుగక పరుగులుతీసిన సమయం  

బడిలో చదువులు బెదిరించిన వైనం...నిలిచిపోవాలని, జీవితాంతం ...యెంత ఆరాటం ?

 

తుమ్మెదల గుంపుల వెంటపడి తరిమినా ...వాన నీటిలో ఆదమరచి ఆడినా 

గవ్వలెన్నో ఏరుకొచ్చి కుప్పలుగా పోసుకున్నా, గుజ్జనగూల్లెన్నో కట్టి ఆనందంతో గెంతులే వేసినా 

పదుల వసంతాలను దాటిపోయినా ... మనోవనంలో సుమించే నెత్తావులే పసిజ్ఞాపకాలు 

ఆ దైవమే వరమందిస్తానంటే ....సెలవంటూ సాగిపోయిన బాల్యమే వరముగా కోరుకుంటా ! ... @ సిరి 

 

 

ll సిరి వడ్డే ll 19-05-2014

 

 

87. గాలిపటం

 

ఎగిరే ఆ రంగుల పతంగం ...ఎల్లలు ఎరుగని విహంగం  

సర్ఫింగ్, బోర్డింగ్, బుగ్గీయింగ్ క్రీడలకు నువ్వే ఆధారం 

మిలటరీ సేనలకు సైతం నీ సేవలెంతో ఉపయోగం 

కాగితం, సూత్రం, వెదురు ఉంటే చాలు పూర్తైపోతుంది నీ నిర్మాణం

 

పసి పాపలు మొదలు పండు ముదుసలి వరకు సంబరమే  నిను చూసిన వేళలో 

అచ్చమైన ఆంధ్రుల సంక్రాతికి నువ్వు ముఖ్య అతిధివే..పండుగ సంబరాలలో 

అందాల తారకవే నువ్వు మా అందరి గుండెల్లో 

నీలి గంగానాన  విహంగానివై స్వేచ్చగా విహరించేవు 

 

అందమైన వర్ణాలతో కనువిందులే చేసేవు 

దివి సీమకు కిరీటమై అలరించేవు 

కవుల అల్లికల్లో హత్తుకుపోయేవు

తరాలెన్ని మారినా....నీ ఉనికి మాత్రం బద్రమే, నువ్వొక అపురూపమైన నేస్తమే సుమా ! ... @ సిరి 

 

 

ll  సిరి వడ్డే ll   20-05-2014

 


88. మోనాలిసా (మొనాలిసా)  

అందమైన వర్ణనలకు చిరునామా నీ సోయగం
కవుల కవనానికి కధానాయిక నీ రూపం
లియోనార్డో డావిన్సీ కుంచె నుండి జాలువారిన ఓ అద్భుతం
(వి)చిత్రంగా మదినే దోస్తోంది నీ చిత్రం

మెరిసిపోయే చిరునగవులెన్నో అధరమధువులలో
మ్రోగిపోయే తలపులనాదాలెన్నో యువహృదయాలలో
కరిగిపోయే కలల కౌముదిలెన్నో కుర్రకారు వలపు యామినిలో
నిను తలచి మురుసిపోయే తమ ప్రేయసి అందాలలో

మనసులనే చేసావు నీ ఊహల బాసలుగా
యువతను చేసావు నీ చూపునకు బానిసలుగా
మదినే దాచావు పెదవి దాటని మౌనాలనే..ఊసులుగా
విశ్వమంత ప్రేమను ఇరుకు యెదలో నింపేస్తూ అలవోకగా
మోనాలిసా నువ్వు ప్రేమకే ఒక మధూలిక ...@సిరి

ll సిరి వడ్డే ll 240-05-14

89. చిరు నగవులు

దేశ విదేశ బాషలు ఎన్నైనా .. సంస్కృతీ సంప్రదాయాలు ఏమైనా
దరహాసానికి లేవు ఏ బేధాలు ...ఏ కల్మషాలు అంటనివి చిరునవ్వుల దీపాలు
వేదాలు, శాస్త్రాలు చదవాలా ?....చిరునగవులకు అర్ధం వెదకాలంటే ?

గుండెల్లో ఆత్మీయత ఉంటే చాలదా ..మది నిండుగా నవ్వాలంటే
పెదవులపై చిరునవ్వుల దీపకళికలు...అంబరాన వెలిగే ఆరని తారాదీపాలే
మదిసౌధం నుండి జాలువారే దరహాసపు మౌక్తికాలు
ముఖారవిందానికి తరగని ఆభరణాలే

పసిపాపల్లే నవ్వుదాము ఏ కల్మషం అంటకుండా ...
చిరునవ్వులనే పంచుదాము వసివాడని పూవులా ..
నవ్వుల నక్షత్రాలనే నింపుదాము మనో గగనమంతా ..
దరహాసపు కుసుమాలనే పూయిద్దాము అధరాలపై ఆప్యాయంగా ...@సిరి

ll సిరి వడ్డే ll 25-05-14

90. 'స్టెమ్ సెల్ బ్యాంకింగ్' 

వైద్య శాస్త్రం సాధించిన ఘనత, ఆధునిక శాస్త్ర పరిజ్ఞానానికే ఒక మణిపూస
మానవుని మూలకణాలతో అవయవాల పునరుత్పత్తి ..
ప్రాణాంతక వ్యాధుల నిర్మూలనకు అంకురోత్పత్తి  
అమ్మ ప్రేగు తెంచుకుంటూ పసిగుడ్డు జననం
బిడ్డ బొడ్డుప్రేగు నుండి జన్మిస్తూ మూలకణాల ఔషదం
అమ్మకు బిడ్డ ఒక బహుమతి, బిడ్డకు అమ్మఇచ్చే'స్టెమ్ సెల్ బ్యాంకింగ్' మొదటి బహుమతి

తల్లి కణాల తోనే వ్యాధి నిర్మూలనలు, బిడ్డకు అమ్మ అందించిన అపురూపమైన కానుకలు
వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు స్టెమ్ సెల్స్, ఎందుకూ పనికిరాదంటూ కోసి పడేసే బొడ్డుతాడు ఇచ్చే విలువైన బ్యాంకింగ్
రుగ్మతల నివారణ, ఉపశమనాలకై లక్షల వ్యయం దేనికని ?
వైద్య సాంకేతిక విధానంలో స్టెమ్ సెల్ మనకు దొరికిన విలువైన గని
తెలుసుకోండి ఆరాతీసి మరీ మన ఉజ్వల  ఆరోగ్య భవిష్యత్తు ఉనికిని
దాచుకోండి తరతరాలకు ఉపయోపడేలా  అమ్మ ఇచ్చిన  అపురూప బహుమతిని ..@సిరి

ll  సిరి వడ్డే ll  02-06-14

91. పిపీలికము

ఐకమత్యానికి మారు పేరు నీవమ్మా
క్రమశిక్షణ నేర్పే సైనికుడవు నీవేనమ్మా
అలుపెరుగని కూలన్నలకు మార్గదర్శివి నీవమ్మా
ఊపిరితిత్తులు, గుండె లేకున్నా, రక్తం రంగేదో తెలియకున్నా

నీకన్న 20 రెట్లు బరువునైనా అవలీలగా మోసేస్తావు
మానవులు 1000 కిలోల బరువును మోయడంతో సమానమని చాటేస్తావు
కదిలే కొమ్ముల్లాంటి అంటెన్నాలతోనే ముద్దు ముచ్చట్లు
మీ కోరల బలానికి పిక్క బలం చూపించాల్సిందే అందరు

రెక్కలు విప్పి ఎగిరినా, చీమలు దూరని చిట్టడువుల్లో అంటూ పొగిడినా
పై పారేపక్షి కిందపారే చీమ అంటూ సామెతలతో పదే పదే నిను తలచినా
పరిమాణాన్ని సైతం చీమంత అంటూ మిము ప్రాతిపదికగా తీసుకున్నా
మిడిసిపాటులేనే లేదు మీ జాతికి..నేర్పరాదా మీలోని కొంత ఔదర్యాన్నైనా మా మానవజాతికి ..@సిరి

ll 07-06-2014 ll సిరి వడ్డే


92. శ్వేత కపోతం  

శాంతికి చిహ్నం నీవు...కల్లా కపటమెరుగని కపోతమే నీవు
ఎల్లలెరుగని స్వేచ్చా విహంగానివే నీవు
తొలి తపాలాకు శ్రీకారం చుట్టిందే నీవు
సందేశాలెన్నో పంపిణీ చేసిన  తొలి తపాలా బంటువే నీవు  

దేశసేవకై శ్రమించావు... మా జవహారుకు ప్రియనేస్తమై మిగిలావు
ఖండాలెన్నో స్వేచ్చాగా దాటేస్తావు
ఆంక్షలు, హద్దులు ఎరుగనే ఎరుగవు  
ప్రతిఫలమేదీ ఆశించని ధన్యజీవివే నీవు

పిచ్చిమనస్సుకెంత ఆశనో ..నీలా (పావురమై) ఎగరాలని
రెపరెపలాడే  రెక్కలు తొడిగి... స్వేచ్చా గగనంలో విహరించాలని
విలుకానికి బలైపోతూ అంతరిస్తోంది మీ జాతి
నిను సమిధగా మార్చే వేటగాళ్లకు లేదమ్మా ఏ నీతి ...@సిరి

ll సిరి వడ్డే ll   09-06-14


93. జెయింట్ వీల్.

గగనపు అంచున తాకుతుందనేలా గమ్మత్తుగ తిరుగుతూ
ఈ ప్రపంచంలో నువ్వు అల్పజీవివని మానవజాతికి గుర్తుచేస్తూ ..
సకల చరాచర ప్రకృతి అందాలను చూపిస్తానని సవాలు విసిరేస్తూ
అరుపులు, కేకలు, కేరింతల సమ్మేళనలతో వయోబేధమే లేదని నిరూపిస్తూ  

ఎగ్జిబిషన్ లు, తీర్థాలు, తిరునాళ్ళే తన చిరునామాలంటూ  
కులమత, చిన్నా పెద్దా తెడాలేవీ లేదంటూ
మేఘమాలికలు, తారలమ్మలు, నీలాంబరిలను ఆప్యాయంగా పలుకరిస్తూ
ధరణికి నే తోబుట్టువునంటూ సంతోషాల నడుమ జంపాలలే ఊపుతూ

తన పూర్వీకులు ఊయలలకు తనొక ఆధునిక అద్భుతమని మురిపిస్తూ
మనిషి జీవితానికి తనొక రోల్ మోడల్ గా నిలుస్తూ
గిర గిర తిప్పుతూ , గిరులను సైతం పలుకరిస్తూ
కళ్ళు తిరిగేలా కలవరపెట్టేసినా .... ఆచంద్రతారార్కం నిలిచిపోతుంది అపురూపనేస్తమై ...@సిరి

ll  సిరి  వడ్డే ll 12-06-14


94.  ఘంటిక

కోవెలగంటలలోని గణ గణ నాదాలు
అమ్మ పూజలోని ఘంటికా స్వరాలు
చదువులమ్మ వడికి రారమ్మని పిలిచే ఘంటారావాలు
తువ్వాయి మెడలోని చిరుగంటల సవ్వడులు...పసిడిప్రాయాన్ని స్పృశిస్తూ ....

మా పూరిపాకలను కాల్చేసే మంటలనార్పే ఫైర్ ఇంజన్ గంటలు
తెల్లారిందోయంటూ తట్టిలేపే అలారం గంటలు, మా వీధిలో మేలుకొలుపుపాడే చర్చి గంటలు
మా ఊరి గోదారమ్మ అలలపై తేలియాడే నావల పతాకాలకు రవళీస్వరాలు ఆలపించే గంటలు
మా పల్లె ధర్మపీఠానికి రమ్మని పిలిచే గంటలు

సినిమహాలులో మ్రోగినా, ఐస్ బండిలో మ్రోగినా పిల్లలకు కేరింతలే
సైకిలు, రిక్షాలు మ్రోగించినా దారి తొలగమని చూచనలే
దైవానికై మ్రోగించినా నైవేద్యం సమయమని తెలుపునులే
వైద్యులు గొంతు తనదిగా చేసుకుని కాంపౌండర్ ను  పిలుచునులే ...@సిరి

ll సిరి వడ్డే ll  13-06-14

95.  నను మన్నించు నాన్నా  

ఆంక్షలు పెట్టే కరుకుదనం వెనుక.... కరుడుగట్టిన ఆ గాంభీర్యం వెనుక
విసురులతో, కసురులతో భయపెట్టే ఆ మాటల శతఘ్నుల వెనుక
భయంతో దూరంగా నెట్టేసే ఆ పెదవి దాటని మౌనం వెనుక ...
దాగున్న వెన్నలాంటి మనస్సును గుర్తించలేకపోయాను నాన్న

రెక్కలు ముక్కలు చేసుకున్న కష్టం మాటున...తిండి, నిద్రకు దూరమై కన్నుల్లో కసిరే యెర్రని జీరల చాటున
ప్రావిడెంటు ఫండు, పెన్షన్లతో సహా దాచేసి, డబ్బులడిగితే గదిమిన కటువుల మాటల దాపున
అప్పులపాలైనా నోరువిప్పని గుట్టుగా  దాచేసిన కన్నీటి చారికల మాటున ..
దాగిన కన్న తీపి బాధ్యతను గుర్తించనేలేదు నాన్న ...

అపోహపడ్డాను నాన్న ..అమ్మ మాత్రమే త్యాగమూర్తియని ... ఆదమరిచాను, అమ్మలా బేలకాదు నాన్న అన్న విషయాన్ని
పెదవి విప్పి ఎందుకు చెప్పలేదు నాన్న కన్న పాశానికి కట్టుబడ్డానని.. కడుపారా ఏడవాలని ఉంది నాన్నా ..గుండెల్లో గడ్డకట్టిన దుఃఖమంతా కరిగి ప్రవహాలై పొంగేలా... నిన్ను లాలించే అమ్మగా పుట్టి, నిను కడుపారా మోసి, లాల పోసి, నిను నాలాంటి మరో బిడ్డకు మళ్ళీ మంచి నాన్నగా తీర్చి దిద్ది...జీవితాన్ని తీర్చిదిద్దిన నీ ఋణాన్ని వడ్డీతో సహా తీర్చేసుకోవాలని ఉంది నాన్నా.

ll  సిరి వడ్డే  ll   14-06-14

(పితృదినోత్సవం సందర్భంగా ఆరాధ్య దైవాలైన నాన్నలందరికీ నమస్సుమాంజలిలు _/\_ )


96. సిరుల గంగ   

గిరులనుండి జాలువారే జలధారల పాపలయెడ  మురిపాలు నింపుకుంటూ   
తల్లి ధరణికెంత మురిపెమో, హృదిని హత్తుకుంటూ
కొండ కోనలు దాటి పరుగు పరుగున ఎగసి పడుతూ  
ఉరకల గంగకెంత సంబరమో, పైరులతో చెలిమిచేస్తూ

ప్రతితరువును పలుకరిస్తూ, సుమకాంతలను స్పర్శిస్తూ
పంటపొలాలకు తానక్షయమే అవుతూ
గలగల సవ్వడులతో సిరి మువ్వల రవళుల సంగీతాలే వినిపిస్తూ
మా పల్లె జానపదాలతో కలిసి మమతల జావళీలనే పాడుతూ

మా చెరువు, బావులను జలపాతాల సాక్షిగా నింపేస్తూ..రైతన్నలకు తానెంతో చేయూతనిస్తూ
సుందరమై, సుసంపన్నమై, అన్నదాతలకు ముద్దు బిడ్డడు తానై
తరలివస్తోంది వయారాల నీటి జాణ, వంపుల సొంపులతో మయురనర్తనాలతో
మా మల్లె సోయగాలను ఇనుమడింప, అన్నపూర్ణ మా భరతమాతయని ఎలుగెత్తి చాటంగా...@సిరి

ll  సిరి వడ్డే ll  16-06-14


97. రైతన్నకు బాష్పాంజలి

పలుగు పట్టి, పారతో మట్టిని తవ్వి, దారులేచేసి, జలవాగులనొదిలి
దుక్కి దున్ని, విత్తు నాటి,చెమటనే నీటి చలమలుగా తోడి
నాగలి దున్ని, స్వేద రసాయనాలెన్నో జల్లి
అంకురాలను చూసి మురిసి పడి

మొలకనాటి చిగురులు తడిమి, సంతోషాల జల్లులతో తడిచి
మొగ్గతొడిగి, పిందెలు నిమిరి... కలుపునేరి, మడులు కట్టి
నెత్తురునే శ్రమదానం చేసి...పైసా పైసా కూడబెట్టి, కప్పాలెన్నో గట్టి
వేలయోజనాలు పయనించి ..అలసి సొలసి కూరలమ్మి

పైసలు చేతబట్టి, భార్యబిడ్డల ఆకలి దీర్చ,అడుగు ముందు కేయబోతే
దళారుల మీదబడి డబ్బంతా గుంజేస్తారు,ఎవడబ్బ సొమ్మని దోచేస్తారు? రైతన్నల శ్రమ"ధనాన్ని"
గద్దెలెక్కే గ్రద్దలకేమి తెలుస్తుంది బడుగు జీవుల ప్రాణాల విలువ
పాలకులెందరు మారినా ..మారేనా మన భారత కిసానుల మరణ యాతన ..@సిరి

ll సిరి వడ్డే ll 18-06-14


98. చిట్టి పొట్టి చిన్నారులం   

ఏ కల్మషమంటని పసి(డి) ప్రాయం, పోటీ ప్రపంచంలో మేమూ సమిధలం
ఆటపాటలకు మేం దూరం, సాంకేతిక పరిజ్ఞానంతో సతమతమైపోతున్నాం
చదువుకుంటూ మేము, చదువును"కొంటూ" అమ్మా నాన్నలు

పల్లెబడిలో ఓనమాలు దిద్దని వాళ్ళం,
బస్తీల ఆంగ్లపు హంగులతో కుస్తీ పట్టే  నవభారత నిర్ణేతలం
అమ్మనే కమ్మని పిలుపును తెలియని వాళ్లము
"మమ్మీ" పేర మృతకళేబరాలతో ఘోరీలు కట్టేశాం,  

చిట్టి చిలకమ్మ, కాకమ్మల కధలే వినని వాళ్ళం
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటూ వెలిగిపోతున్నాం
నన్నయ్య భావయుక్తి, కృష్ణ రాయుని ఘనకీర్తి మాకయోమయం
మాతృబాష మాట్లాడితే చులకనయ్యిపోతాం
పరబాషకే పట్టంకట్టి, భరతమాత గుండెలను నిలువునా చీల్చేసే భావిభారతపౌరులం మేము . .. @ సిరి

ll  సిరి వడ్డే ll   20-06-14


99. శిల్ప కళా శోభితం

ఏ దేవళం చూసినా శిల్పకళా శోభితమే
ప్రతి శిల్పంలోనూ దాగున్నది అందమైన నాట్యభంగిమే
అజంతా, ఎల్లోరా, లేపాక్షి శిల్ప సంపదంతా మా సొంతమే
సప్తస్వరాలను మీటే వేయిస్తంభాల శిల్పకళంటే మాకు పూజ్యమే

అమర శిల్పి జక్కన, రామప్పలు మావారే
రాజులే పోయినా, వారి కధలే వినిపించులే
తెలుగుజాతి కీర్తిని ఇనుమడింప చెదరని సాక్ష్యాలుగా నిలిచెలే
వీర గాధలెన్నో విప్పి చెప్పెనులే, యుగాలనాటి చరిత్రలెన్నో నేర్పెనులే

కవులవర్ణనలో కావ్యనాయికలు మీరేలే, కళాజగతిలో అపురూప సంపదలు మీరేలే
గిరితనువుల మెరిసి, శిలలకు సైతం ఘనకీర్తిని చేర్చి
కన్నుల విందులు కావించి, గుండెలో అందెలు మ్రోగించి, ఉలి అలికిడికే పులకించే మూగ నేస్తాలు
ప్రాణమున్న మా మనుషుల కంటే ఘనకీర్తిలో మీరే చిరాయువులు...@సిరి

ll  సిరి వడ్డే ll  21-06-14


101. హిమగిరి సొగసులు

తెలిమంచు మబ్బులను కవ్విస్తూ, హిమగిరి శిఖరపు అందాలు
నీలవేణి సోయగాలకు మైమరచిపోతూ, పాలరాతి గిరుల చందాలు
గిరికన్యలకెంత మురిపెమో ! తెలిమంచు తెరలమాటున దాగిన
నీలాంబరి సొగసులను క్రీగంట వీక్షిస్తూ, సంబరాలతో అంబరాన్ని మీటుతూ
గిరిఎదలకెంత ఆరాటమో ...గగనపు అంచులనైనా హత్తుకోవాలని

హిమబించువులను అలవోకగా జార్చుతూ,
తరువుల సోయగాలను తనవితీరా స్పృశిస్తూ
పొగమంచు పరదాల మాటున చిలిపి చినుకులతో
ఆమనికి అభ్యంగన స్నానాలేవో చేయిస్తూ, గిరులు చేసే అల్లరులకు...

ప్రకృతిమాత మురిసిపోతోంది ..గిరికన్యలకు పెళ్లికళ వచ్చిందని,
ఆమనికి వసంతాల శ్రీమంతం జరపాలని, మంచుపూల తలంబ్రాలనే దోసిలిపట్టాలని,
విరిబాలలకు మమతల లాలలే పోయాలని, చివురుల పాపలకు ముద్దుల జోలలెన్నో పాడాలని ....@సిరి

ll సిరి వడ్డే ll 23-06-14


102.  "సిరి" మువ్వల సవ్వడి (సందడి)

శివపూజకై కుసుమించిన సిరి సిరి మువ్వలు
నటరాజుని తాండవానికి పరవశించే రవళుల గలగలలు,

పదరవములతో నటనాంజలి నర్పించే మంజల ఝరులు  
వయారినడకలకు..మయూర నర్తానలను నేర్పించే  స్వరజతులు,

అభినయాల అందాలకు మురిసి  పులకించే మధుర ధ్వనులు
నటనాభిషేకాల తరియించు అందియల లయగతులీ చిరు గజ్జెల స్పందనలు,  

భిన్నత్వంలో ఏకత్వాన్ని శృతిచేసే భారతావని గుండెల సవ్వడులు
నవరస అభినయ అనునయాలతో నాట్య కళకు తెచ్చెను ఎన్నో వన్నెలు,

మృదు మంజుల స్వర పదములతో అలరించే అందియలు
సంగీతామృత సాధనలో స్వర సాహిత్యానికి జతకలిపే చెలిమి  వీచికలు ...@సిరి

ll  సిరి వడ్డే ll   05-07-14


103.  ద్రాక్ష పండూ ..నిన్ను చూడగానే నోరూరుచుండు

అతి ప్రాచీన పంటై వర్ధిల్లుతూ, అరవయ్యి రకాల జాతులతో అలరిస్తూ ఐదువేల వత్సరాల క్రితమే
మన ఆసియా ఖండానికే తాను పుట్టింటి బిడ్డడై మురిపిస్తూ

ప్రాచీనకాలంలో మధువు తయారీకే పరిమితమైనా ఆధునిక కాలంలోవైట్ వైన్, రెడ్ వైన్, రోస్ వైన్ల
తయారీలో తామే ముఖ్య పాత్రను వహిస్తూ

పానీయాలు, సలాడ్లు, జామ్ లు, జెల్లీలు, కిస్మిస్ లు కావేవీ తనరుచికనర్హమంటూ సుశ్రుత సంహిత, చరక సంహితల వంటి గొప్ప గొప్ప కావ్యాల్లో సైతం తమ ఔషధీయ లక్షణాలను చాటుకుంటూ
భారతావనిలో ఘనమైన చరిత మాకుందని చాటుకుంటూ కౌటిల్యుని అర్ధశాస్త్రంలో సైతం తమ ఉనికిని సుస్థిర పరుచుకుని

హిమాలయ పర్వతపాదాల చెంతపుట్టి , పోషక పదార్ధాలతో రక్తప్రసరణ, మూత్రపిండాల పనితనాలను మెరుగుపరచి అజీర్తి, మలబద్దకం, నోరు, గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గించి, విటమిన్లు, ఖనిజాలుతో ఆరోగ్యానికి పూర్తి రక్షణ కలిగించి

ఏనుగు బతికినా చచ్చినా విలువే అన్నట్లు, ఎండిపోయినా కిస్మిస్గా పోషక విలువలను మనకు పంచి కొలెస్టాల్ని అదుపు చేసి, క్యాన్సర్ను ఎదుర్కొని, విటమిన్ "సి" ని పుష్కలంగా నింపుకుని మానవజాతిని ఆదుకునే ధన్యజీవులే ఈ ద్రాక్షలు ..@సిరి

ll సిరి వడ్డే ll 06-07-2014


105.  వేదోపనిషత్తులు

మోక్షమార్గాన్ని చూపే ఉపనిషత్తులనే, అంతంలో చేర్చుకుని వేదాంతమంటూ...
మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటూ ..తైతీరీయోపనిషత్ లో చెప్పబడినా,

మన భారతీయ లైకిక, అలౌకిక విద్యలన్నింటికీ వేదాలే మూలస్థానమంటూ...
నిత్యసత్యాలనుప్రకటిస్తూ, ధార్మికతత్వాన్నీ, సాంస్కృతిక సంపదను వెల్లడించినా,

భారతభూమి, వేదభూమి, యోగభూమి, త్యాగభూమి, ధర్మభూమియంటూ...
మత సాంప్రదాయాలకు మూలమై, హైందవజాతికి ప్రాచీనమైన పవిత్ర గ్రంథాలై విరాజిల్లినా,

సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసాది నైతిక ధార్మిక విలువలంటూ
విజ్ఞాన వీచికలు ప్రసరింపజేసిన ధన్యభూమిగా మన భారతావనిని మలిచిన తీరేదైనా,

గుభాళించే ఆదర్శ సామాజిక జీవనవ్య వస్థను నెలకొల్పిన ఘనత తమదేయైనా...
ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అధర్వణవేదాలై, మరెన్నో ఉపనిషత్తులసారమై భాసిల్లుతూ,

"బ్రహ్మవిద్య" యనబడే... వేదాలు అనంతములు, అపారములు ...
పామరులకు అందుబాటులో లేని వేదభాషల అక్షయాల భాండాగారములు . ..@సిరి

ll సిరి వడ్డే ll 08-07-2014

106.  సింధూర సోయగం

ఉదయించే భానుబింభాన్ని నుదుటి తిలకంగా దిద్దుకున్న
తూరుపు ముత్తైదువ నిండు సౌభాగ్యమెంత సుకుమారం

కెందాయిలెన్నో  నిండుగా అద్దుకున్న
సంధ్యాసుందరి మోమెంత  అతిశయం

రంగురంగు పూలనద్డుకున్న విరిమోములతో వికసించే
వాసంతిక లలాటమెంత మనోహరం

కస్తూరి తిలకమద్దుకున్న అష్టలక్ష్ములు పేరంట మాడే... శ్రావణమాసమెంత శుభకరం
రంగులెన్నో దిద్దుకున్నరంగవల్లికల సంక్రాంతి లక్ష్మి...నిండుతనమెంత శోభాయమానం

కన్నెవధువును, ఇల్లాలిగా మారుస్తూ, వరుడు దిద్దిన
నుదుట మెరిసే కళ్యాణ తిలకమెంత  శోభితం

మగువ మోమున విరాజిల్లే... నిత్యకళ్యాణం
ఇనబింబ మనిపించు ప్రతి తల్లి కుంకుమకు సౌభాగ్యాల నీరాంజనం....@సిరి

ll  సిరి వడ్డే  ll   12-07-2014

108. కల"కలం"

పాళీని నూరి... ధ్వజమెత్తుతుంది ... అభ్యుదయభావాలకై
వలపుసిరా పోసుకుని ...పరుగెత్తుతుంది ప్రేమభావాలకై

కర్తవ్యాన్ని బోధిస్తూ కదిలిపోతుంది ...విద్యార్ధుల ఉజ్జ్వల భవిష్యత్తుకై
అక్షరాల ముత్యాలనే కూరుస్తుంది ...భావాల మరువాలను పంచడానికై

లిఖిస్తూ కల "కలం " సృష్టిస్తుంది ... సమాజంలోని మార్పులకై
నిగ్గుదీసి ఆరాతీస్తుంది ... సహించలేని ఆన్యాయానికై

గళమెత్తి చాటిస్తుంది...మన భారతీయ చరితలెన్నో తెలపడానికై
అలుపెరగక పరుగులు తీస్తుంది...సమసమాజ నిర్మాణానికై

గ్రంధాలనే అలంకరిస్తుంది ... మన ఘనతను చాటడానికై
మనస్సులనే పరిచేస్తుంది ... అక్షరమాలికలతో తనువులను మీటడానికై....@సిరి

ll సిరి వడ్డే ll 17-07-2014

© 2013 by Komal Vadday

bottom of page